డియర్ పేరెంట్స్.. అమ్మాయిల పైన ‘బొమ్మరిల్లు’ కట్టుబాట్లు వద్దు!

మీరు బొమ్మరిల్లు సినిమా చూసే ఉంటారు కదా! మితిమీరిన రక్షణాత్మక వైఖరితో  హీరోను తన తండ్రి ప్రతి విషయంలోనూ కంట్రోల్‌ చేయడం, తన కొడుకు తనకు నచ్చినట్లే ఉండాలని, తాను చూపిన అమ్మాయినే పెళ్లాడాలని.. ఆంక్షలు పెట్టడం, దీంతో హీరో విసుగెత్తిపోవడం.. వంటివన్నీ ఈ సినిమా కథలో.....

Published : 07 Jul 2022 18:54 IST

మీరు బొమ్మరిల్లు సినిమా చూసే ఉంటారు కదా! మితిమీరిన రక్షణాత్మక వైఖరితో  హీరోను తన తండ్రి ప్రతి విషయంలోనూ కంట్రోల్‌ చేయడం, తన కొడుకు తనకు నచ్చినట్లే ఉండాలని, తాను చూపిన అమ్మాయినే పెళ్లాడాలని.. ఆంక్షలు పెట్టడం, దీంతో హీరో విసుగెత్తిపోవడం.. వంటివన్నీ ఈ సినిమా కథలో కనిపిస్తాయి. అయితే నిజానికి ప్రస్తుత సమాజంలో కొంతమంది తల్లిదండ్రులు ఇలాంటి కట్టుబాట్లు, ఆంక్షలు, తమలోని అనవసర భయాల్ని తమ కొడుకుల కంటే కూతుళ్ల పైనే ఎక్కువగా రుద్దుతున్నారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఫలితంగా ఆడపిల్లలు స్వేచ్ఛను కోల్పోవడంతో పాటు ఇలాంటి బంధనాలు వ్యక్తిగతంగా-కెరీర్‌ పరంగా వారి ఉన్నతికి అవరోధాలుగా మారుతున్నాయంటున్నారు నిపుణులు. అందుకే పేరెంట్స్ తమలోని అభద్రతా భావానికి తెరదించి తమ కూతుళ్లను అన్ని రకాలుగా ప్రోత్సహించమని సూచిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు తల్లిదండ్రులు తమ కూతుళ్లపై పెడుతోన్న ఆంక్షలేంటి? వాటి వల్ల కలిగే పర్యవసానాలేంటో తెలుసుకుందాం రండి..

ఈ టైమ్‌కల్లా ఇంట్లో ఉండాలి!

చదువు, ఉద్యోగాల పేరిట ప్రస్తుతం ఎంతోమంది అమ్మాయిలు గడప దాటుతున్నారు. ఇది వాళ్ల తల్లిదండ్రుల్ని సంతోషపెట్టే అంశమే అయినా.. బయట మహిళలపై జరిగే అఘాయిత్యాలు ఆ పేరెంట్స్‌కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో ‘నీ పని ఎప్పుడు పూర్తవుతుంది?’, ‘చీకటి కాకముందే ఇంటికి చేరడం మంచిది!’.. ఇలా వారిపై ప్రశ్నలు-ఆంక్షల వర్షం కురిపిస్తున్నారు. నిజానికి దీనివల్ల ఆ సమయం కాగానే వారిలో ఎక్కడలేని భయం, టెన్షన్‌ ఆవహిస్తుంది. నిమిషం ఆలస్యమైనా.. అమ్మానాన్న ఏమంటారో, ఎలా స్పందిస్తారోనన్న ఆలోచనలతో అటు చేసే పనిపై, ఇటు చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. నిజానికి పేరెంట్స్‌లో ఉండే ఇలాంటి భయాల్ని అమ్మాయిలపై రుద్దడం వల్ల.. వాళ్లు ఆత్మవిశ్వాసం కోల్పోవడంతో పాటు తల్లిదండ్రులు తమను అనుమానిస్తున్నారా? అన్న సందేహం కూడా కలిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

అందుకే ఇలాంటి అనవసరమైన ఆలోచనల్ని కట్టిపెట్టి.. తమ కూతుళ్లను ఎలాంటి ప్రతికూల పరిస్థితినైనా సమర్థంగా ఎదుర్కొనేలా మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారుచేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే సమయంతో పనిలేకుండా ఎప్పుడంటే అప్పుడు ధైర్యంగా బయటకు వెళ్లేలా వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులదే అంటున్నారు. అప్పుడే వారు అన్ని విషయాల్లో రాణించగలుగుతారు.

అది వద్దు.. ఇది వేసుకో!

బయట అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలకు వాళ్ల వేషధారణే ముఖ్య కారణమని కొందరు అంటుంటారు. అయితే ఇలాంటి వాళ్ల మాటలు పట్టుకొని కొంతమంది తల్లిదండ్రులు తమ కూతుళ్ల ఆహార్యం విషయంలో లేనిపోని ఆంక్షలు విధిస్తుంటారు. మోడ్రన్‌గా ఉండే దుస్తులు వేసుకోకుండా, ఒంటిని పూర్తిగా కప్పేసే సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలంటూ ఆంక్షలు విధించే వారూ లేకపోలేదు. దీంతో చాలామంది తమకు నచ్చినా నచ్చకపోయినా పేరెంట్స్‌ నిర్ణయానికి కట్టుబడాల్సి వస్తుంటుంది. నిజానికి ఈ తరహా ధోరణి వాళ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు. ఇది క్రమంగా వారు స్వీయ ప్రేమను కోల్పోయేలా చేస్తుంది.. ఈ ఒత్తిడి, ఆందోళనలతో అటు వ్యక్తిగతంగా, ఇటు కెరీర్‌పై దృష్టి పెట్టలేరు.

కాబట్టి కూతుళ్ల డ్రస్సింగ్ విషయంలో పేరెంట్స్ అర్ధంపర్ధం లేని ఆంక్షలు, కట్టుబాట్లు పెట్టడం మంచిది కాదు. వారికి సౌకర్యంగా ఉండి, అభ్యంతరకరంగా లేనంత వరకు.. డ్రస్సింగ్‌ విషయంలో వారికి పూర్తి స్వేచ్ఛనివ్వడం మంచిది. ఇది వారిలో అన్ని రకాలుగా సానుకూల దృక్పథాన్ని నింపుతుంది.

ఎప్పటికీ ‘ఆడ’పిల్లేనంటూ.!

ఎదిగే ఆడపిల్లను భారంగా భావిస్తూ.. ఎప్పుడెప్పుడు అత్తారింటికి పంపుదామా అన్న ఆలోచన చేసే తల్లిదండ్రులు ఇప్పటికీ లేకపోలేదు. అంతేకాదు.. పుట్టినప్పట్నుంచి వాళ్ల చదువులు, కెరీర్ కంటే భవిష్యత్తులో జరగబోయే పెళ్లి నిమిత్తమే ఎక్కువగా పొదుపు చేసే వాళ్లూ లేకపోలేదు. ఇలాంటి ఆలోచనల వల్లే చిన్నారి పెళ్లికూతుళ్ల సంఖ్య పెరుగుతోందని చెబుతున్నాయి కొన్ని గణాంకాలు. నిజానికి ఇలా చిన్న వయసులోనే మోయలేని భారాన్ని, బాధ్యతల్ని భుజాలకెత్తుకోవడం వల్ల వారి చదువు-కెరీర్‌ కుంటుపడుతోంది. దీనికి తోడు ఆరోగ్యపరంగానూ వారిపై ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు.

అందుకే పెళ్లి పేరుతో కూతుళ్ల భవిష్యత్తును చేజేతులా పాడు చేయకుండా.. ముందు వారు కెరీర్‌ పరంగా ఎదిగేలా భరోసా కల్పించాలంటున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు పిల్లల్ని వారికి నచ్చిన అంశాల్లో ప్రోత్సహించడం ముఖ్యం. ఫలితంగా ఎంతోమంది ఆడపిల్లలు ఆయా రంగాల్లో ఉన్నత శిఖరాలు అందుకోవడం మనం తరచూ చూస్తూనే ఉన్నాం. ఇలా వాళ్లు తమను తాము నిరూపించుకున్నప్పుడు.. మీరు పెళ్లి సంబంధాలు వెతకడం కాదు.. అవే మీ అమ్మాయి ముంగిట క్యూ కడతాయనడంలో సందేహం లేదు.

ఆ రెక్కల్ని బంధించద్దు!

పురుషాధిక్యం ఉన్న చాలా రంగాల్లో అడుగుపెడుతూ తమను తాము నిరూపించుకుంటున్నారు ఈతరం అమ్మాయిలు. అయినా కొందరు ఆడపిల్లల కలలు నెరవేరట్లేదనే చెప్పాలి. ఎందుకంటే సమాజం, కుటుంబం నుంచి వాళ్లకు ఎదురయ్యే వివక్ష, ఆంక్షలే! నిజానికి తమ కూతురు ఏ వ్యాపారమో లేదంటే క్రీడల్లోకో అడుగుపెడితే నలుగురూ ఏమనుకుంటారోనన్న భయం పేరెంట్స్‌ని పిల్లల కలలకు రెక్కలు తొడగనివ్వకుండా చేస్తోంది. దీనివల్ల మీరు బలవంతంగా మీ అమ్మాయిని మీకు నచ్చిన రంగంలో చేర్చినా దానిపై తనకు ఆసక్తి ఉండకపోవచ్చు. ఇది తన బంగారు భవిష్యత్తునే ప్రశ్నార్థకంగా మార్చచ్చు.

కాబట్టి తల్లిదండ్రులు రంగంతో పనిలేకుండా అమ్మాయిల ఆసక్తిని పరిగణనలోకి తీసుకొని వారిని ప్రోత్సహించమంటున్నారు నిపుణులు. ఇదే వారిని ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేస్తుంది. తద్వారా మొట్టమొదటగా గర్వపడేది మీరే అని గుర్తుపెట్టుకోండి!
ఇలాంటి చాలా విషయాల్లో కొడుకులకు ఉన్నంత స్వేచ్ఛ, ప్రోత్సాహం కూతుళ్లకు లేదనే చెప్పాలి. కాబట్టి సమాజపు ఒత్తిళ్లకు తలొగ్గకుండా కుటుంబంలో ఆడ-మగను సమానంగా పెంచడం, అన్ని విషయాల్లో ఇద్దరినీ సమానంగా ప్రోత్సహించడం వల్ల అమ్మాయిలు నేటి సమాజంలో నలుగురికీ ఆదర్శంగా నిలవగలుగుతారు. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయమేంటి? Contactus@vasundhara.net వేదికగా పంచుకోండి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్