Published : 22/12/2022 20:45 IST

పిల్లలతో గడుపుతున్నారా?

పొద్దున్న లేచింది మొదలు.. ఎవరి హడావిడిలో వాళ్లుంటాం. ఒకే ఇంట్లో ఉంటున్నా ఒకరితో మరొకరం మాట్లాడుకునే టైమే ఉండదు ఒక్కోసారి. ఈ హడావిడిలో పిల్లలతో గడిపే సమయం కూడా ఉండదు.. అయితే ఇలాగే ఉంటే పిల్లలకు, పేరెంట్స్‌కి మధ్య దూరం పెరిగిపోతుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ప్రతి రోజూ ఓ నియమం పెట్టుకున్నట్లుగా పిల్లల కోసం సమయం కేటాయించాలని సూచిస్తున్నారు.

ఉదయం లేవగానే హడావిడిలో పడిపోకుండా పిల్లలు, తల్లిదండ్రులు.. ఒకరికొకరు గుడ్‌మార్నింగ్‌ చెప్పుకోవడం, ఈక్రమంలో పెద్దలు పిల్లలకు ఓ ముద్దూ-ఓ హగ్గూ ఇవ్వడం, రాత్రి పడుకునే ముందు గుడ్‌నైట్‌ చెప్పుకోవడం.. వంటివి రోజువారీ అలవాట్లుగా మార్చుకోవాలంటున్నారు నిపుణులు.

ఇంటి పనులు, వంట పనులు, ఇల్లు శుభ్రం చేయడం.. వంటి పనుల్లో మీతో పాటు మీ పిల్లల్నీ భాగం చేయడం వల్ల ఇద్దరూ కలిసి మరింత ఎక్కువ సమయం గడపచ్చు.

మీరు వ్యాయామం చేసేటప్పుడు, వాకింగ్‌/జాగింగ్‌కి బయటికి వెళ్లేటప్పుడు మీ పిల్లల్నీ మీతో పాటు కలుపుకోండి. తద్వారా వారి శరీరానికీ వ్యాయామం అందుతుంది.. ఒకరికొకరు మరింత దగ్గరవ్వచ్చు.

పేరెంట్స్‌-పిల్లల మధ్య అనుబంధాన్ని పెంచడంలో ఆటలూ కీలక పాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు. అందుకే ‘పిల్లలతో ఆటలా..?’ అనుకోకుండా వీలు చిక్కినప్పుడల్లా వారితో సరదాగా ఆడుకోవడం/వారిని ఆడించడంలో తప్పు లేదు.

‘పిల్లలకెందుకు ఈ పనులు?’ అనుకోకుండా గార్డెనింగ్.. మొదలైన వాటిలో పిల్లలనూ భాగం చేయడం వల్ల వారికి మంచి అలవాట్లు అలవడడంతో పాటు ఇద్దరూ కలిసి కాసేపు సమయం గడిపినట్లూ ఉంటుంది.

ఇలా ఆలోచిస్తే పేరెంట్స్‌-పిల్లలు కలిసి చేసే పనులు, అనుబంధాన్ని దగ్గర చేసుకునే మార్గాలు బోలెడుంటాయి. మరి పాటిస్తారు కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని