టీనేజ్ పిల్లలతో ఎలా ఉంటున్నారు?

కాలం మారుతున్న కొద్దీ పిల్లలను పెంచే పద్ధతులు మారిపోతున్నాయి. ముఖ్యంగా టీనేజ్‌ పిల్లల విషయంలో కొంతమంది తల్లిదండ్రులకు సవాల్‌గా మారుతోంది. నేటి తరంలో కొంతమంది పిల్లలు చిన్న చిన్న విషయాలకు కూడా తల్లిదండ్రులతో గొడవపడుతున్నారు. తమకు కావాల్సిన వాటిని పొందడానికి.....

Updated : 28 Jun 2022 12:29 IST

కాలం మారుతున్న కొద్దీ పిల్లలను పెంచే పద్ధతులు మారిపోతున్నాయి. ముఖ్యంగా టీనేజ్‌ పిల్లల విషయంలో కొంతమంది తల్లిదండ్రులకు సవాల్‌గా మారుతోంది. నేటి తరంలో కొంతమంది పిల్లలు చిన్న చిన్న విషయాలకు కూడా తల్లిదండ్రులతో గొడవపడుతున్నారు. తమకు కావాల్సిన వాటిని పొందడానికి అలకబూనుతున్నారు. ఇలా టీనేజ్‌ వయసుకి వచ్చిన తర్వాత పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య పలు రకాల వైరుధ్యాలు వస్తున్నాయని రిలేషన్‌షిప్ నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో టీనేజ్‌ పిల్లలతో సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకుందామా...

సమస్య మూలాన్ని తెలుసుకోండి...

కొన్ని సందర్భాల్లో టీనేజ్‌ పిల్లలు తమ సమస్యలను తల్లిదండ్రులకు చెప్పుకోలేరు. ఈ క్రమంలో వారి సమస్యలను తల్లిదండ్రులకు పరోక్ష పద్ధతిలో చెప్పడానికి ప్రయత్నిస్తుంటారు. ఫలితంగా కొన్ని సందర్భాల్లో వారి కోపానికి కారణమవుతుంటారు. ఇలాంటప్పుడు ఇరువురి మధ్య సంఘర్షణ ఉన్న సంగతి తెలుస్తుంది కానీ, అసలు సమస్య అర్థం కాదు. కాబట్టి, కొంచెం ప్రశాంతంగా ఆలోచించి అసలు కారణాన్ని అన్వేషించడం ఉత్తమమైన మార్గం అంటున్నారు నిపుణులు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు చిన్న విషయాలకే కోప్పడుతుంటారు. దానికి కారణం పిల్లల భవిష్యత్తు గురించే అయినా అది అనర్థాలకు దారితీసే అవకాశం లేకపోలేదు. కాబట్టి, పిల్లలతో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మొదట అసలు కారణాన్ని అన్వేషించే ప్రయత్నం చేయండి.

గీత దాటొద్దు...

కొన్నిసార్లు పిల్లలు చేసే పనులు తల్లిదండ్రులకు విపరీతమైన కోపాన్ని తెప్పిస్తుంటాయి. ఇలాంటప్పుడు వారు తమ సహనాన్ని కోల్పోయి ప్రవర్తించే అవకాశం ఉంటుంది. దాంతో తల్లిదండ్రులు కొంచెం ఎక్కువగా ప్రతిస్పందించే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడే సహనంగా ఉండాలంటున్నారు నిపుణులు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకుండా కొంత సమయం తర్వాత వారితో మాట్లాడడం మంచిదంటున్నారు. ప్రశాంతంగా ఉన్నప్పుడే పిల్లలు తల్లిదండ్రులు చెప్పే మాటలను స్వీకరించడానికి ఎక్కువ అవకాశం ఉంటుందంటున్నారు.

ముందుగానే గుర్తించాలి...

మోడ్రన్‌ దుస్తులు ధరించడం, కాలేజీకి డుమ్మా కొట్టడం, చెప్పకుండా స్నేహితులతో టూర్లు వేయడం వంటి వాటి వల్ల పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య వైరుధ్యాలు ఎక్కువగా వస్తుంటాయి. వీటిని తగిన సమయంలో పరిష్కరించుకోకపోతే భవిష్యత్తులో పలు రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి  వస్తుంది. కాబట్టి, జరగబోయే నష్టాన్ని ముందుగానే అంచనా వేసి దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు.

మీరూ పాటించాలి..

టీనేజ్ పిల్లలను దండించాల్సి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అతిగా స్పందించకూడదు. సాధ్యమైనంత వరకు వివరంగా చెప్పే ప్రయత్నం చేయండి. వారు చేసే పనుల వల్ల భవిష్యత్తులో ఎలాంటి నష్టాలు వస్తాయి వంటి వివరాలు సున్నితంగా వివరించాలి. తద్వారా వారిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వారికి ఏవైనా నిబంధనలు పెట్టినప్పుడు మీరు కూడా ఆచరించాల్సి ఉంటుంది.

వారికి సమయం ఇవ్వండి...

కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఎంత చెప్పినా వినడం లేదని బాధపడుతుంటారు. అయితే మీ ప్రయత్నాలు మీరు చేసినప్పుడు వారికి కొంత సమయం ఇవ్వాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే మార్పు అందరిలో ఒక్క రోజులోనే  రావాలనే నియమేమీ లేదు. కాబట్టి, మీరు చెప్పాలనుకున్న విషయాలు చెప్పిన తర్వాత వారికి కొంత సమయం కేటాయించండి. అప్పటికీ ఫలితం రాకపోతే మరోసారి పిల్లలకు చెప్పే ప్రయత్నం చేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్