పిల్లలకు ‘డిజిటల్’ నైపుణ్యాలు.. ఇలా!

పిల్లల్ని తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహించడమే కాదు.. వారిలో సాంకేతిక నైపుణ్యాల్నీ పెంచడం ముఖ్యమంటున్నారు నిపుణులు. ఎందుకంటే రాబోయే పదేళ్లలో ప్రపంచ జనాభాలో 90 శాతం మంది డిజిటల్‌ నైపుణ్యాల్లో పూర్తి పట్టు సాధించచ్చనే అంచనాలున్నాయంటున్నారు. ఇక కరోనా ముందుతో....

Updated : 13 Mar 2023 18:54 IST

పిల్లల్ని తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహించడమే కాదు.. వారిలో సాంకేతిక నైపుణ్యాల్నీ పెంచడం ముఖ్యమంటున్నారు నిపుణులు. ఎందుకంటే రాబోయే పదేళ్లలో ప్రపంచ జనాభాలో 90 శాతం మంది డిజిటల్‌ నైపుణ్యాల్లో పూర్తి పట్టు సాధించచ్చనే అంచనాలున్నాయంటున్నారు. ఇక కరోనా ముందుతో పోల్చుకుంటే.. కరోనా తర్వాత డిజిటల్‌ రంగంలో పెను మార్పులు చోటుచేసుకోవడం మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. దీన్ని దృష్టిలో ఉంచుకొని పిల్లలు భవిష్యత్తులో సాంకేతిక రంగంలో వెనకబడకుండా ఉండాలంటే.. తల్లిదండ్రులు ఇప్పట్నుంచే వారిలో డిజిటల్‌ పరిజ్ఞానం పెంపొందించాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కొన్ని అంశాలు దృష్టిలో పెట్టుకోవడం ముఖ్యమంటున్నారు.

‘కీవర్డ్సే’ కీలకం!

ఈ కాలంలో దేని గురించి తెలుసుకోవాలన్నా ఇంటర్నెట్‌లో వెతికేస్తున్నాం. పెద్దలే కాదు.. పిల్లలూ ఇందుకు మినహాయింపు కాదు. అయితే ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర విషయాలు చిన్నారుల్ని తప్పు దోవ పట్టించే ప్రమాదమూ లేకపోలేదు. కాబట్టి ఈ ముప్పు తప్పాలంటే.. కీవర్డ్స్‌ కీలక పాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు. పైగా సరైన కీవర్డ్‌తో వెతికితే ఆయా అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మన కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. అందుకే పిల్లలకు అంతర్జాలంలో సమాచారం వెతికే క్రమంలో కీవర్డ్స్‌ ప్రాముఖ్యాన్ని వివరించాలి. అదే సమయంలో వాళ్లు తెలుసుకోవాలనుకుంటోన్న టాపిక్‌కు సంబంధించిన కొన్ని కీవర్డ్స్‌ చెప్పడంతో పాటు వాటితో వెతికి మరీ ప్రయోగాత్మకంగా వారికి వివరించాలి. తద్వారా ఇంటర్నెట్‌ సెర్చింగ్‌పై వారికి అవగాహన పెరుగుతుంది.. అలాగే వారు తప్పుదోవ పట్టకుండానూ జాగ్రత్తపడచ్చు.

ఆ రెంటికీ మధ్య వ్యత్యాసం!

చాలామంది పిల్లలకు ఇంటర్నెట్‌ వినియోగం గురించి అవగాహన ఉన్నప్పటికీ.. అందులోని కొన్ని డిజిటల్‌ టూల్స్‌ని ఉపయోగించే విషయంలో పూర్తి నైపుణ్యాలు ఉండకపోవచ్చు. దీంతో కెరీర్‌లో పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉదాహరణకు.. సామాజిక మాధ్యమాల్నే తీసుకుందాం.. ఇందులో భాగంగా ఫేస్‌బుక్‌-ఇన్‌స్టాగ్రామ్‌.. వంటి వేదికలకు, లింక్డిన్‌ వేదికకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఫేస్‌బుక్‌ను మనం క్యాజువల్‌గా ఉపయోగిస్తూ.. మన చుట్టూ ఉన్న వ్యక్తులతో స్నేహాలు పెంచుకుంటాం. అదే.. లింక్డిన్‌ను వృత్తిపరమైన సంబంధాల్ని మెరుగుపరచుకోవడానికి ఉపయోగిస్తాం. అలాగే ఒక మెయిల్‌ పెట్టేటప్పుడు కూడా అది క్యాజువలా? ఫార్మలా? అనేది చాలా ముఖ్యం. పిల్లలకు చిన్న వయసు నుంచే ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని వివరించి చెప్పడం వల్ల డిజిటల్‌ పరిజ్ఞానం పెరుగుతుంది. ఏ సోషల్‌ మీడియాను ఎలా ఉపయోగించాలన్న విషయంలోనూ పూర్తి అవగాహన వస్తుంది.

‘యాప్‌’లతో పట్టు!

ఈ డిజిటల్‌ యుగంలో ప్రస్తుతం యాప్‌ల హవా కొనసాగుతోంది. ప్రతి విషయాన్నీ ట్రాక్‌ చేయడం దగ్గర్నుంచి విభిన్న అంశాల గురించి అవగాహన పెంచుకోవడం దాకా.. ప్రతిదీ వీటి ద్వారా సులభతరమవుతుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పిల్లల్లో డిజిటల్‌ నైపుణ్యాల్ని పెంచడానికి ఈ యాప్‌ల సహాయం కూడా తీసుకోవచ్చంటున్నారు నిపుణులు. ప్రస్తుతం పిల్లల్ని వివిధ విషయాల్లో నిష్ణాతుల్ని చేయడానికి బోలెడన్ని యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు.. దేశాలు-వాటి చరిత్ర-కరెన్సీ.. తదితర ప్రపంచ భౌగోళిక అంశాల గురించి అవగాహన పెంచే ‘బేర్ఫుట్ వరల్డ్‌ అట్లాస్‌’, రోబోలు-డ్రోన్లు.. వంటి సాంకేతిక పరికరాల డిజైనింగ్‌ను సులభంగా నేర్పించే ‘ప్లే అండ్‌ లెర్న్‌ ఇంజినీరింగ్‌’, గణితాన్ని సరళంగా బోధించే ‘డ్రాగన్‌ బాక్స్‌’, రాత నైపుణ్యాల్ని పెంపొందించే ‘రైట్‌ ఎబౌట్‌ దిస్‌’, పజిల్‌-మేజెస్‌ నైపుణ్యాలు పెంచే ‘థింక్ రోల్‌ ప్లే అండ్‌ కోడ్‌’.. వంటి యాప్స్‌తో పిల్లల్లో విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించచ్చు.. అదే సమయంలో వారిలో సాంకేతిక నైపుణ్యాలూ అలవడతాయి. కాబట్టి చిన్నారుల్లో సాంకేతిక నైపుణ్యాల్ని పెంపొందించేలా వారికి అవసరమైన యాప్స్‌ గురించి తల్లిదండ్రులే పిల్లలకు వివరించాలి.

‘పాస్‌వర్డ్స్‌’తో సురక్షితంగా..!

మన సమాచారాన్ని సురక్షితంగా దాచుకోవడం దగ్గర్నుంచి నగదు బదిలీ దాకా.. ఇప్పుడు ప్రతిదానికీ ఆన్‌లైన్‌నే ఆశ్రయిస్తున్నాం. పిల్లలూ ఇందుకు మినహాయింపు కాదు. అయితే ఈ క్రమంలో ఆయా అకౌంట్లకు సురక్షితమైన, కఠినమైన పాస్వర్‌్లను పెట్టుకోవడం మనకు తెలిసిందే! పిల్లలకూ ఈ విషయంలో అవగాహన కల్పించడం మంచిదంటున్నారు నిపుణులు. తద్వారా ఆన్‌లైన్‌ మోసాల్లో చిక్కుకోకుండా వారు ముందు నుంచే జాగ్రత్తపడచ్చంటున్నారు. ఇలా నిర్దేశించుకునే పాస్వర్డ్.. అవతలి వారి ఊహకు కూడా అందనంత కఠినంగా ఉండడం మంచిదంటున్నారు. ఈ క్రమంలో అక్షరాలు-అంకెలు-స్పెషల్‌ క్యారక్టర్స్‌ కలగలిసేలా.. కాస్త పెద్ద పాస్వర్డ్‌ను పెట్టుకుంటే మేలు. అలాగే అన్ని అకౌంట్లకు ఒకే పాస్వర్డ్ కాకుండా వేర్వేరుగా పెట్టుకుంటే మరీ మంచిది. అంతేకాదు.. ఎక్కువ రోజుల పాటు అదే కొనసాగించకుండా.. మధ్యమధ్యలో పాస్వర్డ్ మార్చడం మర్చిపోవద్దని పిల్లలకు వివరించాలి. పిల్లల్లో సాంకేతిక నైపుణ్యాల్ని పెంపొందించడంలో ఇదీ ముఖ్యమే!

బ్యాలన్స్‌ తప్పకుండా..!

పిల్లల్లో సాంకేతిక పరిజ్ఞానం పెంచాలన్న ఉద్దేశంతో ఈ విషయంలో తల్లిదండ్రులు వారిపై ఒత్తిడి తీసుకురావడం కూడా సరికాదంటున్నారు నిపుణులు. ఇప్పటికే కొంతమంది చిన్నారులు ఏవేవో సాకులు చెబుతూ ఎక్కువ సమయం అంతర్జాలంతో గడిపేస్తున్నారు. కాబట్టి వారిలో డిజిటల్‌ నైపుణ్యాల్ని పెంపొందిస్తూనే.. స్క్రీన్‌టైమ్‌ను తగ్గించడమూ పేరెంట్స్‌ బాధ్యత. ఈ క్రమంలో నిర్ణీత వేళల్లోనే వారికి టెక్నాలజీని ఉపయోగించుకునేలా ఆప్షన్‌ ఇవ్వడం, అది కూడా అవసరమైన వెబ్‌సైట్లు/సమాచారం మాత్రమే వెతికేందుకు అనుమతించడం, మిగతా సమయాల్లో తమకు ఆసక్తి ఉన్న వ్యాపకాలపై దృష్టి పెట్టేలా ప్రోత్సహించడం.. ఇలా చేయడం వల్ల ఇటు వ్యక్తిగతంగా, అటు కెరీర్ పరంగా.. రెండింటినీ బ్యాలన్స్‌ చేయచ్చు. ఇది శారీరకంగానే కాదు.. మానసిక ఆరోగ్యానికీ మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్