వింటున్నారా..? అమ్మాయిలని ప్రోత్సహిస్తే పదేళ్ల ముందుకు..!

అసమానతలు, వివక్ష అమ్మాయిల అభివృద్ధికి ప్రధాన ఆటంకాలుగా మారుతున్నాయని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే అమ్మాయిలు ఇలాంటి సవాళ్లను అధిగమించే ఓర్పు, నేర్పు తల్లిదండ్రులే నేర్పించాలంటున్నారు నిపుణులు. అన్ని విషయాల్లోనూ వారిని....

Updated : 11 Oct 2022 18:47 IST

పుట్టగానే ‘ఆడపిల్లా?’ అన్న నిట్టూర్పులు..

పెరిగి పెద్దయ్యే క్రమంలో ఉన్నత చదువులెందుకన్న నిరుత్సాహపు మాటలు..

వయసొచ్చాక ఓ అయ్య చేతిలో పెట్టి భారం దించుకోవాలన్న ఆరాటం..

అమ్మాయిల పెంపకం విషయంలో రోజురోజుకీ మార్పులొస్తున్నా.. ఇప్పటికీ ఇలా ఆలోచించే తల్లిదండ్రులు కొంతమంది లేకపోలేదు.  దీనికి తోడు పేదరికం, సమాజం నుంచి ఎదురయ్యే అసమానతలు, వివక్ష అమ్మాయిల అభివృద్ధికి ప్రధాన ఆటంకాలుగా మారుతున్నాయని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే అమ్మాయిలు ఇలాంటి సవాళ్లను అధిగమించే ఓర్పు, నేర్పు తల్లిదండ్రులే నేర్పించాలంటున్నారు నిపుణులు. అన్ని విషయాల్లోనూ వారిని ప్రోత్సహిస్తే.. పురోభివృద్ధి విషయంలో వాళ్లు ఓ దశాబ్ద కాలం ముందుంటారని ఈ ఏడాది యునిసెఫ్‌ థీమ్‌ చెబుతోంది. ‘ఇది మన సమయం - మన హక్కులు, మన భవిష్యత్తు’ పేరుతో ఈ ఏడాది ‘అంతర్జాతీయ బాలికా దినోత్సవం’ నిర్వహిస్తోన్న నేపథ్యంలో.. ఆడపిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలంటే తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన విషయాలేంటో తెలుసుకుందాం రండి..

అందం కాదు.. ప్రతిభ ముఖ్యం!

‘అరె.. ఈ అమ్మాయి చాలా క్యూట్‌గా, అందంగా ఉందే!’ అని చెప్పినంత సులువుగానే.. వారిలో ఏవైనా శారీరక/మానసిక లోపాలుంటే ఎత్తిచూపుతుంటారు. ప్రస్తుత సమాజంలో ఇలాంటి వివక్ష అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిల పైనే ఎక్కువగా ఉంది. నిజానికి ఇలాంటి పోలికలు, వారి అందాన్ని వర్ణించడం వల్ల భవిష్యత్తులో వారికి ఒరిగేదేమీ ఉండదని చెబుతున్నారు నిపుణులు. దీనికి బదులుగా వారిలోని ప్రత్యేక నైపుణ్యాలపై దృష్టి సారించి వారిని ఆ దిశగా ప్రోత్సహిస్తే.. కెరీర్‌లో వారు అనుకున్న లక్ష్యాల్ని చేరుకోగలుగుతారు. ఇక ఈ క్రమంలో తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే.. తమ శారీరక-మానసిక లోపాలు, వాటి వల్ల వారిలో ఉన్న అభద్రతా భావం అధిగమించేలా సరైన మార్గనిర్దేశనం చేయాలి. ఇలాంటప్పుడే వారికి ఏది మంచి, ఏది చెడు అన్న విషయాలు అర్థమవుతాయి.

ఆ విషయంలో ‘అతి’ చేయొద్దు!

సమాజం అన్ని రంగాల్లో ఎంత ముందుకు వెళ్తున్నప్పటికీ.. నేటికీ అమ్మాయిల్ని, అబ్బాయిల్ని చూసే దృష్టి కోణంలో ఇంకా తేడాలు కనిపిస్తున్నాయనే చెప్పాలి. ఇందుకు కారణం.. ఇంటా, బయటా వారిపై జరిగే అఘాయిత్యాలే! దీంతో తమ కూతురికి ఎటు నుంచి ఏ ఆపద వస్తుందోనన్న భయంతో తల్లిదండ్రులు వారిని అతి జాగ్రత్తగా చూస్తున్నారు. అదే ‘మగపిల్లాడే కదా.. వాడికేం భయం?!’ అన్న ధీమాతో వారికి అడ్డు చెప్పట్లేదు. అయితే ఇలా ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులు అతి చేయడం వల్ల.. దీని ప్రభావం వారి భవిష్యత్తుపై పడుతుంది. వారిని ఇంటికే పరిమితం చేయడం లేదంటే వారిపై పరిమితులు విధించడం వల్ల వారు లోకం పోకడ తెలుసుకోలేకపోతారు.. కొన్ని కేసుల్లో వారికి నచ్చిన అంశాల్లోనూ సరైన ప్రోత్సాహం ఉండకపోవచ్చు. కాబట్టి అతి జాగ్రత్త వల్ల ఎటు నుంచి చూసినా ఆడపిల్లలకు మేలు జరగదన్న విషయం అర్థమవుతుంది. అందుకే అన్ని విషయాల్లో వారిని ప్రోత్సహిస్తూ.. ఆపద వస్తే తమను తామే రక్షించుకునేలా వారిని తయారుచేయడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.

రోల్‌మోడల్‌ మీరే!

‘ఈ అమ్మాయి ఎంత చక్కగా, ధైర్యంగా మాట్లాడుతోంది.. పెంపకం అలాంటిది మరి!’ కొంతమంది ఆడపిల్లల్ని చూసి ఇలా అనుకోవడం సహజమే! అవును.. ఇంట్లో తల్లిదండ్రులు మెలిగే విధానం పైనే పిల్లల ప్రవర్తన ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. అందుకే తల్లిదండ్రులు ధైర్యం, ఆత్మవిశ్వాసం, సత్ప్రవర్తన, ఉన్నతమైన ఆలోచనలతో పిల్లలకు రోల్‌మోడల్‌గా నిలవమంటున్నారు. ఈ క్రమంలో నలుగురికీ ఉపయోగపడే పనులు చేయడం, తరచూ గొడవ పడకుండా దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉండడం, వృత్తి ఉద్యోగాలకు ఎంత ప్రాధాన్యమిస్తున్నారో.. పిల్లలకూ తగిన సమయం కేటాయించేలా ప్రణాళిక వేసుకోవడం, ఇల్లు-ఆఫీస్‌ను సమన్వయం చేసుకోవడం.. ఇవన్నీ ముఖ్యమే! మిమ్మల్ని ప్రత్యక్షంగా చూస్తూనే ఈ విషయాలన్నీ పిల్లలు చక్కగా నేర్చేసుకుంటారు. భవిష్యత్తులో వారు వ్యక్తిగతంగా, కెరీర్‌ పరంగా రాణించాలంటే ఇవన్నీ కీలకమే!

ఇద్దరినీ సమానంగా..!

ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే (ఆడ, మగ).. వాళ్ల పెంపకం విషయంలో వ్యత్యాసం చూపిస్తుంటారు కొందరు తల్లిదండ్రులు. ఉదాహరణకు.. అబ్బాయిలకు ఒక రకమైన, అమ్మాయిలకు మరో రకమైన బొమ్మలు కొనివ్వడం, అమ్మాయిలు సవాళ్లతో కూడిన కెరీర్‌ను ఎంచుకుంటామంటే వద్దని వారించడం, నెలసరిని కళంకంగా భావించి ఆ సమయంలో వారిని కొన్ని పనులకు దూరంగా ఉంచడం, ఇంట్లో దీన్నో రహస్యంగా ఉంచడం.. ఇలాంటివన్నీ అమ్మాయిల ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయంటున్నారు నిపుణులు. అందుకే ఏది కొన్నా ఇద్దరికీ సమానంగా, భవిష్యత్తులో వారికి ఉపయోగపడేలా, వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేలా ఉండేవాటిని ఎంచుకోమంటున్నారు. అంతేకాదు.. కెరీర్‌ ఆప్షన్ల విషయంలోనూ వారికి పూర్తి స్వేచ్ఛనివ్వడం, సరైన మార్గనిర్దేశనం చేయడం కూడా తల్లిదండ్రుల బాధ్యతే!

ఆటలాడితే.. తప్పేంటి?

ఆటలు.. దీన్ని మొన్నటిదాకా అబ్బాయిల కెరీర్‌గా భావించేవారు. కానీ ఈతరం అమ్మాయిలు అన్ని ఆటల్లోనూ రాణిస్తుండడంతో.. ఈ విషయంలో చాలామంది తల్లిదండ్రుల దృష్టి కోణం మారుతోందని చెప్పచ్చు. అలాగని అందరూ అలా లేరు. ‘ఆటలా? అందులో సంపాదన ఏముంటుంది? నూటికో, కోటికో ఎవరో ఒకరు క్లిక్‌ అవుతారు అంతే?’ అన్న ఆలోచన ఉన్న వారూ ఈ రోజుల్లో లేకపోలేదు. అయితే మనం మనకు నచ్చిన రంగంలో ఆరితేరితే.. ఆ నైపుణ్యాల్ని మన భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఎలాగైనా మార్చుకోవచ్చంటున్నారు నిపుణులు. ఉదాహరణకు.. ఒక ఆటలో రాణిస్తే.. దాన్నే ఉపాధి మార్గంగా మలచుకోవచ్చు.. మనకున్న నైపుణ్యాలతో నలుగురికీ దానిలో శిక్షణనివ్వచ్చు.. కాబట్టి ఈ సృష్టిలో ఏదీ వృథా కాదన్నట్లుగా.. మన నైపుణ్యాలు కూడా ఏదో ఒక విధంగా మన భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. కాబట్టి పేరెంట్స్‌ తమ ఆడపిల్లల కలల్ని కొట్టిపారేయకుండా.. వారికి నచ్చిన రంగంలో ప్రోత్సహిస్తే.. అందులో అద్భుతాలు సృష్టించగలుగుతారు. ఇది ప్రత్యక్షంగా వారికే కాదు.. పరోక్షంగా మీకూ మంచి పేరు తీసుకొస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్