Teenage Love: బ్రేకప్‌ బాధను పోగొట్టాలంటే..!

టీనేజ్‌లో ఉండే పిల్లలు దేనికైనా ఇట్టే ఆకర్షితులవుతారు. ప్రేమ విషయంలోనూ అంతే! అయితే ఈ వయసులో పుట్టేది ప్రేమ కాదు.. ఆకర్షణ అనేది చాలామంది భావన. కానీ కొంతమంది టీనేజీ పిల్లలు మాత్రం సీరియస్‌గానే ప్రేమలో పడతారు. ఒకవేళ ఏదైనా కారణంతో విడిపోయినా.. అంతకంటే ఎక్కువగా బాధపడతారు.

Updated : 22 Apr 2024 18:32 IST

టీనేజ్‌లో ఉండే పిల్లలు దేనికైనా ఇట్టే ఆకర్షితులవుతారు. ప్రేమ విషయంలోనూ అంతే! అయితే ఈ వయసులో పుట్టేది ప్రేమ కాదు.. ఆకర్షణ అనేది చాలామంది భావన. కానీ కొంతమంది టీనేజీ పిల్లలు మాత్రం సీరియస్‌గానే ప్రేమలో పడతారు. ఒకవేళ ఏదైనా కారణంతో విడిపోయినా.. అంతకంటే ఎక్కువగా బాధపడతారు. ఇలాంటి సమయంలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని మందలించడం చూస్తుంటాం. కానీ ‘పుండు మీద కారం చల్లినట్లు’ ఈ సమయంలో వాళ్లను మరింత బాధపెట్టడం సరికాదంటున్నారు నిపుణులు. వాళ్ల మనసును అర్థం చేసుకొని.. వాళ్లకు అండగా నిలిచి.. బ్రేకప్‌ బాధ నుంచి వాళ్లను బయటపడేయాల్సిన బాధ్యత పేరెంట్స్‌దే అంటున్నారు. ఈ క్రమంలో కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవడం వల్ల ఫలితం ఉంటుందంటున్నారు. మరి, అవేంటో తెలుసుకుందాం రండి..

ప్రేమ ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద పుడుతుందో చెప్పలేం. యుక్త వయసులో ఉన్న వారు కూడా తొలి చూపులోనే ప్రేమకు ఆకర్షితులవడం చూస్తుంటాం. అయితే దీన్ని ఎంతవరకు తీసుకెళ్తారనేది వారిద్దరి మానసిక పరిణతి, ఒకరినొకరు అర్థం చేసుకునే తీరుపై ఆధారపడి ఉంటుంది. ఇక పలు కారణాల వల్ల ఇద్దరూ విడిపోయినా.. వాళ్లు ఆ బాధ నుంచి బయటపడే క్రమంలో తల్లిదండ్రులు అండగా నిలవడం ముఖ్యమంటున్నారు నిపుణులు.

ఓదార్చే మాటలు!

యుక్త వయసులో ప్రేమన్నా, బ్రేకప్‌ అన్నా.. చాలామంది తల్లిదండ్రులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేరు.. అంగీకరించరు కూడా! పైగా ఈ క్రమంలో వాళ్లేదో తప్పు చేసినట్లుగా భావిస్తారు. అందుకే ప్రేమలో విఫలమయ్యారని తెలిసినా, పిల్లలే నోరు తెరిచి చెప్పినా చీవాట్లు పెడతారు. నిజానికి ఇలా చేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఇలాంటి సమయంలో పిల్లలతో ఎంత స్నేహంగా ఉంటే.. వాళ్లు తమ బాధను అంత సునాయాసంగా పంచుకోగలుగుతారని, తద్వారా ఆ మానసిక వేదన నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంటుందంటున్నారు. కాబట్టి పేరెంట్స్ ఇలాంటి పిల్లలతో ఓదార్పునిచ్చే మాటలు మాట్లాడాలి. ‘బ్రేకప్‌ నుంచి బయటపడడం కష్టమే.. అయినా దీన్నుంచి ఎంత త్వరగా బయటపడితే నీ కెరీర్‌పై అంత ఎక్కువగా దృష్టి పెట్టగలవు. ఇలా నువ్వు జీవితంలో మంచి స్థాయిలో ఉంటే నిన్ను నిన్నుగా కోరుకునే ప్రేమ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది..’ అంటూ వాళ్లలో ధైర్యం నింపే మాటలు చెప్పాలి. టీనేజ్‌ పిల్లలు ప్రేమకే కాదు.. ఇలాంటి మంచి మాటలకూ ఇట్టే ఆకర్షితులవుతారు. తద్వారా బ్రేకప్‌ బాధ నుంచి త్వరగా బయటపడి తమ భవిష్యత్తుపై తిరిగి దృష్టి పెట్టగలుగుతారు.

ముందు వినండి!

మనసులోని బాధను పంచుకున్నప్పుడే గుండె భారం దిగుతుందంటారు. అయితే పిల్లలు తమ మనసులోని మాటలు చెబుతున్నప్పుడు చాలామంది తల్లిదండ్రులకు వినే ఓపిక ఉండదు. వాళ్ల మాటలు వినేదేంటన్న ఉద్దేశంతో మధ్యలోనే ఆ టాపిక్‌ కట్‌ చేయడం, లేనిపోని నియమాలన్నీ వారిపై రుద్దడం చేస్తుంటారు. అయితే అసలే బ్రేకప్‌ బాధలో ఉన్న పిల్లలతో ఇలాంటి ప్రవర్తన తగదంటున్నారు నిపుణులు. తమ ప్రేమ, బ్రేకప్‌కు దారి తీసిన కారణాల గురించి అసలు వాళ్లేం చెప్పాలనుకుంటున్నారో ముందు ఓపికతో వినడం మంచిది. తద్వారా వాళ్లు ఏదీ దాచుకోకుండా అన్ని విషయాలు మీతో పంచుకునే అవకాశం వారికి దొరుకుతుంది. ఇలా వాళ్లు మాట్లాడడం పూర్తయ్యాక.. ప్రేమ విషయంలో వాళ్లు చేసిన పొరపాట్లేంటి? ఇకపై అలా జరగకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వంటి వాటి గురించి వివరంగా తెలియజేయాలి. ఇలా సున్నితంగా చెప్తే తప్పకుండా వాళ్లు మీ మాట వింటారు.

‘సోషల్’కు దూరంగా..!

ఈకాలం పిల్లలు సోషల్‌ మీడియాకు బాగా అలవాటు పడిపోతున్నారు. తమకు సంబంధించిన విషయాలు, ఫొటోలు.. వంటివన్నీ ఎప్పటికప్పుడు ఈ వేదికపై పోస్ట్‌ చేయడం ఓ ట్రెండ్‌గా ఫీలవుతున్నారు. ఈ క్రమంలో టీనేజ్ పిల్లలు తమ ప్రేమ, బ్రేకప్‌.. వంటి అంశాల గురించీ ఈ వేదికగా పంచుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ఈ పొరపాటును చేయకుండా తల్లిదండ్రులే తమ పిల్లల్ని అదుపు చేయాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇలా వీళ్లు చేసే పోస్టులకు ఇతరులు చేసే కామెంట్లు, విమర్శలు వీళ్లను మానసికంగా మరింత కుంగదీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని వారికి అర్థమయ్యేలా వివరించండి.. తద్వారా వాళ్ల సోషల్‌ మీడియా ఉపయోగాన్ని కొంతవరకు నియంత్రించచ్చు.. అలాగే దీనివల్ల వాళ్లు బ్రేకప్‌ బాధ నుంచి త్వరగా బయటపడే అవకాశమూ ఉంటుంది.

మనసు మళ్లించండి!

కెరీర్‌, ఇతర బాధ్యతల రీత్యా చాలామంది తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నారు. కానీ బ్రేకప్‌ బాధలో కూరుకుపోయిన టీనేజ్‌ పిల్లల విషయంలోనూ ఇలాంటి నిర్లక్ష్యం తగదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో వాళ్లకు మరింత సమయం కేటాయించి.. ఆ బాధ నుంచి వాళ్ల మనసు మళ్లించే ప్రయత్నం చేయడం మంచిది. ఇందులో భాగంగా.. వీలైతే కుటుంబమంతా కలిసి వెకేషన్‌కు వెళ్లడం, పిల్లల్ని తమకు నచ్చిన అంశాల్లో ప్రోత్సహించడం, యోగా-మెడిటేషన్‌కు సంబంధించిన తరగతుల్లో వారిని చేర్పించడం.. వంటివి చేయాలి. ఇవన్నీ వారికి మానసికోల్లాసాన్ని కలిగించేవే!

అయితే బ్రేకప్‌ బాధ నుంచి పిల్లలు త్వరగా బయటపడేందుకు వారికి అన్ని విషయాల్లో అండగా ఉన్నప్పటికీ.. వాళ్లు ఒంటరిగా, ముభావంగా కనిపించడం.. ఎవరితోనూ కలవడానికి ఆసక్తి చూపకపోవడం.. వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం మానసిక నిపుణుల వద్ద వారికి కౌన్సెలింగ్‌ ఇప్పించడం మంచిది. తద్వారా వారిలో సానుకూల మార్పులు తీసుకురావచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్