బంధాలు దూరమవుతున్నాయా? ఈ అలవాట్లను మార్చుకోండి..!

వ్యక్తిగతంగా అయినా సరే, వృత్తి ఉద్యోగాల్లో అయినా సరే- మనిషి మనుగడకు మూలం ఇతరులతో ఉండే సంబంధబాంధవ్యాలే. ఒకరకంగా మన ఉన్నతికి కూడా ఇవే కారణమవుతాయి. అయితే- నిత్య జీవితంలో మనం ఇతరులతో బంధాలను దృఢపరచుకోవడానికి ఎంతవరకు ప్రయత్నిస్తున్నామంటే సందేహమే. ఈ క్రమంలో వ్యక్తిగతంగా కొన్ని....

Published : 29 Apr 2022 19:10 IST

వ్యక్తిగతంగా అయినా సరే, వృత్తి ఉద్యోగాల్లో అయినా సరే- మనిషి మనుగడకు మూలం ఇతరులతో ఉండే సంబంధబాంధవ్యాలే. ఒకరకంగా మన ఉన్నతికి కూడా ఇవే కారణమవుతాయి. అయితే- నిత్య జీవితంలో మనం ఇతరులతో బంధాలను దృఢపరచుకోవడానికి ఎంతవరకు ప్రయత్నిస్తున్నామంటే సందేహమే. ఈ క్రమంలో వ్యక్తిగతంగా కొన్ని ప్రవర్తనాపరమైన లోపాలు, అలవాట్లు కూడా బంధాల విచ్చిన్నానికి కారణమవుతాయి. మరి ఇతరులతో బంధాలను బలపరచుకోవడానికి మన వంతుగా ఎలాంటి అలవాట్లను దూరం చేసుకోవాలో తెలుసుకుందామా...

ఆ కోపాన్ని చూపించద్దు..

ఇద్దరి అభిప్రాయాలు కలవడం అన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోవచ్చు. దాంతో వారి మధ్య భేదాభిప్రాయాలు రావడం సహజమే. అయితే చాలామంది దానిని వ్యక్తిగతంగా తీసుకుంటారు. దాంతో అవతలి వ్యక్తిపై కోపం వ్యక్తం చేస్తుంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. దీనివల్ల తాత్కాలికంగా విజయం సాధించినా అవతలి వ్యక్తితో ఉన్న సంబంధం దూరమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఎదుటి వ్యక్తి అభిప్రాయం నచ్చకపోతే మౌనంగా ఉండాలి తప్ప, దానిని అవతలి వ్యక్తిపై చూపించడం, వ్యక్తిగతంగా తీసుకోవడం మంచిది కాదంటున్నారు నిపుణులు.

పంతం నీదా? నాదా?

తన మాటే నెగ్గాలనే స్వభావం ఉన్న వారిని మనం చాలామందినే చూస్తుంటాం. ఇలాంటి వారు ఎవరితో మాట్లాడినా తమదే పైచేయి కావాలని చూస్తుంటారు. పంతానికి పోయి అవతలి వ్యక్తికి ఎలాంటి అవకాశం ఇవ్వరు. ఇలాంటి ధోరణి వల్ల తాత్కాలికంగా ఆనందం పొందవచ్చు. కానీ దీర్ఘకాలంలో ఇతరులతో ఉన్న సంబంధాలు దూరమయ్యే అవకాశం ఉంటుంది.

వ్యతిరేక ఆలోచనలొద్దు...

బంధాలు దూరం కావడానికి ఇతరులతో మాట్లాడే విధానం ఒక్కటే కారణం కాదు. మనకు మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో కూడా ముఖ్యమే. కొంతమంది మదిలో ఎప్పుడూ వ్యతిరేక ఆలోచనలే ఉంటాయి. వారు ఏ విషయాన్నైనా ప్రతికూల ధోరణితోనే ఆలోచిస్తుంటారు. ఇలాంటి వారితో ఇతరులు సన్నిహితంగా ఉన్నా కొంతకాలానికి ఆ వ్యతిరేక ధోరణి వల్ల వారిని దూరం పెట్టే అవకాశం ఉంటుంది. దానివల్ల ఇతరులతో సంబంధాలు దూరమవడమే కాకుండా తమకి తాము మానసిక సమస్యలను కొని తెచ్చుకునే అవకాశమూ లేకపోలేదు.

అలా చేయకండి...

చాలామంది తమ పరిమితులను, అవకాశాలను మర్చిపోయి ఇతరులతో పోల్చుకుంటారు. దీనివల్ల వ్యతిరేక ఆలోచనలు వస్తుంటాయి. ఫలితంగా ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలకు గురవుతుంటారు. దాంతో ఆ బాధను కొంతమంది ఇతరులపై చూపిస్తుంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. ఇది మీకు వ్యక్తిగతంగా నష్టం చేకూర్చడమే కాకుండా ఇతరులతో ఉండే సంబంధాలను కూడా దూరం చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్