అతనితో అక్క సహజీవనం.. నాన్నకెలా చెప్పాలి?

మేము ముగ్గురం ఆడపిల్లలం. కొన్నేళ్ల క్రితం అమ్మ చనిపోయింది. నాన్నే మా బాధ్యతలు చూస్తున్నారు. మా అక్క బెంగళూరులో జాబ్‌ చేస్తోంది. నేను, చెల్లి చదువుకుంటున్నాం. నాన్న అక్కకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు....

Published : 28 May 2024 17:44 IST

(Image For Representation)

మేము ముగ్గురం ఆడపిల్లలం. కొన్నేళ్ల క్రితం అమ్మ చనిపోయింది. నాన్నే మా బాధ్యతలు చూస్తున్నారు. మా అక్క బెంగళూరులో జాబ్‌ చేస్తోంది. నేను, చెల్లి చదువుకుంటున్నాం. నాన్న అక్కకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే పెళ్లి చూపులకు రమ్మని ఎప్పుడు అడిగినా అక్క ఏదో ఒక వంక చెప్పి రావడం లేదు. నాన్న బాధపడుతున్నారని నేను గట్టిగా అడిగితే తన ఆఫీసులో పని చేసే వ్యక్తితో లివ్‌ ఇన్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్నానని చెప్పింది. ఈ విషయం నాన్నకు చెబితే చాలా గొడవవుతుంది. అసలు ఆయన ఏమైపోతారోనని భయంగా ఉంది. మా నాన్న తన పెంపకం గురించి అందరితోనూ గొప్పగా చెప్పుకుంటుంటారు. నిజానికి అమ్మ లేకపోయినా.. నాన్న మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. అలాంటిది ఇప్పుడు అక్క ఇలా చేస్తుందని ఊహించలేదు. ఈ విషయం నాన్నకు ఎలా చెప్పాలో తెలియడం లేదు.. ఇప్పుడు నేనేం చేయాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. ఈ రోజుల్లో ఇలాంటి సంఘటనలు చాలా కుటుంబాల్లో జరుగుతున్నాయి. నిజానికి తల్లిదండ్రులు పిల్లలపై ఎంతో నమ్మకం పెట్టుకుంటారు. దీనికి తమ పెంపకం.. నేర్పించిన క్రమశిక్షణ.. విలువలు.. అందించిన చదువు.. మొదలైన వాటిపై వారికి విశ్వాసం ఉండడమే. ఒకవేళ బయటివాళ్లు తమ పిల్లల గురించి వేరేగా చెప్పినా నమ్మడానికి సిద్ధంగా ఉండరు. కానీ వాళ్లు అనుకున్న దానికి భిన్నంగా జరిగిందని తెలిస్తే మాత్రం కచ్చితంగా షాక్‌కు లోనవుతుంటారు. వారి ప్రతిస్పందన ఎలా ఉంటుందనేది కూడా ఊహించలేం. అలాగని ఈ విషయాన్ని ఎక్కువ రోజులు దాచినా ప్రమాదమే. కాబట్టి, తప్పనిసరిగా చెప్పాలి.
పెద్దవారికి వివాహ బంధంపై గట్టి నమ్మకం ఉంటుంది. సాధారణంగా లివ్ ఇన్ రిలేషన్‌షిప్ వంటివి వారికి నచ్చవు. ఒకవేళ వేరేవారి గురించి చెబితే పెద్దగా పట్టించుకోరు. కానీ, ఇంట్లో వాళ్లే అలా చేస్తున్నారంటే వాళ్లు అస్సలు తట్టుకోలేరు. మీ నాన్నగారి విషయంలో కూడా ఇలా జరిగే అవకాశం లేకపోలేదు. కాబట్టి మీ అక్క సంగతి ఆయనకు ఏవిధంగా చెబితే బాగుంటుందో ఒక కూతురిగా మీరే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆయనకు ఒక్కసారిగా కాకుండా అసలు విషయం కొద్దికొద్దిగా చెప్పే ప్రయత్నం చేయండి.
ఈ క్రమంలో- మీ నాన్నగారికి చెప్పే ముందు మీ అక్కతో మరోసారి మాట్లాడండి. అతనితో ఉన్న బంధం గురించి ఒకటికి పదిసార్లు నిర్ధారించుకోమనండి. లివ్‌ ఇన్ రిలేషన్‌షిప్ కరెక్టేనా? అతను నిజాయతీపరుడేనా? వారి బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలనుకుంటున్నారా.. వంటి విషయాల గురించి స్పష్టమైన అభిప్రాయం తీసుకోండి. ఆ తర్వాత మీ నాన్నగారితో ఎలా చెప్పాలనే విషయం గురించి మీ అక్కతో.. మీ సన్నిహిత కుటుంబ సభ్యులతో కలిసి ఆలోచించడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్