ఈ విషయాలు అమ్మతో పంచుకుంటున్నారా?

ఎంత క్లోజ్ గా ఉన్నా కొన్ని విషయాలు అమ్మకు చెప్పడానికి సంకోచిస్తాం. అయితే అలాంటి విషయాలను ఇప్పటి నుంచీ తనతో పంచుకోవడం...

Updated : 07 Oct 2022 21:14 IST

ఎంత క్లోజ్ గా ఉన్నా కొన్ని విషయాలు అమ్మకు చెప్పడానికి సంకోచిస్తాం. అయితే అలాంటి విషయాలను ఇప్పటి నుంచీ తనతో పంచుకోవడం మొదలు పెట్టండి. అమ్మ ఇచ్చే ఎక్స్‌పర్ట్ సలహాలకి మీరే ఆశ్చర్య పోతారు.

అది అమ్మకే బాగా తెలుసు..!

వయసు పెరుగుతున్నకొద్దీ మన శరీరంలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. కొన్ని ఆశ్చర్యపరిస్తే కొన్ని ఆందోళనకు గురిచేస్తాయి. అలాంటి సమస్యలు ఎదురైనప్పుడు గూగుల్‌లో పరిష్కారం వెతకకుండా, అమ్మతో చెప్పి తన సలహా పాటించడం మంచిది. ఎందుకంటే మన శరీరతత్వం గురించీ, వంశపారంపర్యంగా వచ్చే లక్షణాల గురించీ గూగుల్ కన్నా అమ్మకే బాగా తెలుసు. కాబట్టి మన శరీరంలో వచ్చే మార్పుల గురించీ, తలెత్తే ఇబ్బందుల గురించీ అమ్మతో పంచుకోవాలి.

నాకు సరిపోతాడా ..!

అర్థం చేసుకోడంలో అమ్మ తర్వాతే ఎవరైనా! మీరు జీవిత భాగస్వామిగా ఎన్నుకునే వ్యక్తి గురించి ముందు మీ అమ్మకే చెప్పండి. ఏ వయసులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో మనకన్నా అమ్మకే బాగా తెలుసు. అంతేకాదు మీ వ్యక్తిత్వానికి అతను సరిపోతాడో లేదో అన్న విషయం తెలుసుకోవడానికి అమ్మ సలహా ఎంతో ఉపయోగపడుతుంది. అతనిని మీ అమ్మకు పరిచయం చేయడం వల్ల మీ పట్ల మరింత బాధ్యతగా వ్యవహరిస్తాడు. ఒకవేళ ఏదైనా దురుద్దేశంతో మిమ్మల్ని ప్రేమలోకి దించిన వాళ్ళైతే మీనుంచి దూరంగా వెళ్తారు. కాబట్టి మీ జీవిత భాగస్వామి గురించి నిర్ణయం తీసుకునే సమయంలో అమ్మ సలహా తీసుకోడానికి ఏమాత్రం సంకోచించకండి.

మనసులోని మర్మమును తెలుసుకో..!

కార్పొరేట్ ప్రపంచంలో ఏ మాటల వెనుక ఏ మర్మం ఉందో, ఎవరు ఏ ఉద్దేశంతో పొగుడుతున్నారో, ఎవరెందుకు విమర్శిస్తున్నారో తెలుసుకోవడం చాలా కష్టం. ఎవరితో ఎలాంటి విషయాలు పంచుకోవాలో అర్థం కాక ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటాం. మీరు పని చేసే చోట మీకు ఎదురయ్యే వ్యక్తుల గురించి మీ అమ్మతో మాట్లాడి చూడండి. ఎవరితో ఎలా మెలగాలో చెప్పడంలో అమ్మ కార్పొరేట్ గురువులకే పాఠాలు చెప్పగలదని మీరే అంటారు.

ఆ విషయాన్ని దాచకండి..

చదువుకునే చోట, ఆఫీసులో, ఆన్‌లైన్‌లో ఎక్కడైనా ఎవరైనా మిమ్మల్ని లైంగికంగా వేధిస్తే ఆ విషయాన్ని అమ్మ దగ్గర దాచకండి. కొంతమంది అమ్మాయిలు ఇలాంటి వాటి గురించి ఇంట్లో చెప్పకుండా తమలో తామే మధనపడుతుంటారు. ఇలాంటి పరిస్థితులలో అటువంటి విషయాలను అమ్మ దగ్గర ధైర్యంగా బయట పెట్టండి. అప్పుడు ఏం చేయాలో అమ్మే చెబుతుంది. తన సహకారంతో ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి ప్రశాంతంగా ఆలోచించే అవకాశం ఉంటుంది.

మ్యాజిక్ టచ్‌తో..

స్పీడ్‌గా బండి నడిపి దెబ్బలు తగిలించుకున్నా, పార్టీ నుంచి ఆలస్యంగా వచ్చినా, అతిగా నమ్మిన స్నేహితులు మోసం చేసినా.... ఇలా శరీరానికో, మనసుకో ఎలాంటి గాయమైనా సరే అమ్మ మనల్ని దగ్గరకు తీసుకుని, ఓదార్చి తన మ్యాజిక్ టచ్‌తో ఇట్టే నయం చేస్తుంది.

ఆ సమస్యల గురించి..

అలాగే పెళ్లయ్యాక దాంపత్య బంధంలో, ప్రత్యేకించి లైంగిక విషయాలలో ఎలాంటి సమస్యలు, అనుమానాలు ఉన్నా వాటి గురించి ముందు అమ్మతోనే పంచుకోవాలి. తన అనుభవాలను జోడించి మానసిక పరిణతితో తనిచ్చే సూచనలు, సలహాలు మన సమస్యలను ఇట్టే పరిష్కరించేస్తాయ్..! అప్పటికీ మన ప్రాబ్లమ్స్ సాల్వ్ కాకపోతే నిపుణులను సంప్రదించాలన్న విషయం తెలిసిందే.

కరుణించే కోపం అమ్మ!

మనకన్నా ముందే ప్రపంచాన్నీ, జీవితాన్నీ చూసిన అనుభవం అమ్మ సొంతం. మనం ఎదుర్కొనే సమస్యలని తాను ఇదివరకే చవిచూసి ఎన్నో పాఠాలు నేర్చుకుంది. అందుకే అమ్మకు అన్ని విషయాలూ తెలుసు. మనకేదైనా కొన్ని సందర్భాలలో ఆపద కలుగుతుందేమోనని భయంతో కోప్పడ్డా, మన ప్రతి కష్టంలోనూ తోడుండే అసలైన నేస్తం అమ్మే..! అందుకే ఇక నుంచి మన సంతోషాన్ని మాత్రమే కాదు పొరపాట్లను కూడా అమ్మతో పంచుకుందాం..!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్