రాజీ పడడానికీ ఉందో లెక్క..!

ఒక్కో మనిషి ప్రవర్తన ఒక్కోలా ఉంటుంది. కానీ దాంపత్య బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత ఒకరి అభిప్రాయాలకు మరొకరు గౌరవం ఇచ్చుకోవాలి. అలా ఉంటేనే ఇద్దరి మధ్య అనుబంధం కలకాలం కొనసాగుతుంటుంది. అయితే దంపతులకు వివిధ సందర్భాల్లో పలు....

Published : 05 Mar 2023 14:07 IST

ఒక్కో మనిషి ప్రవర్తన ఒక్కోలా ఉంటుంది. కానీ దాంపత్య బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత ఒకరి అభిప్రాయాలకు మరొకరు గౌరవం ఇచ్చుకోవాలి. అలా ఉంటేనే ఇద్దరి మధ్య అనుబంధం కలకాలం కొనసాగుతుంటుంది. అయితే దంపతులకు వివిధ సందర్భాల్లో పలు అంశాలపై భిన్నాభిప్రాయాలు వస్తుంటాయి. చివరికి ఎవరో ఒకరు సర్దుకుపోతే కానీ సమస్య పరిష్కారం కాదు. కానీ చాలామంది సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించకుండా తమ మాటే చెల్లుబాటు కావాలని చూస్తుంటారని రిలేషన్‌షిప్‌ నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఎలాంటి సందర్భాల్లో కాంప్రమైజ్‌ కావాలి.. ఎలాంటి సందర్భాల్లో కాకూడదో వివరిస్తున్నారు. అవేంటో తెలుసుకుందామా...

ఇలాంటప్పుడు సర్దుకుపోవాల్సిందే..!

ఆత్మగౌరవానికి భంగం కలగకుండా...

రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్టు.. దాంపత్య బంధం కలకాలం ఆనందంగా ఉండాలంటే దానికి ఇద్దరి తోడ్పాటూ ఉండాలి. అయితే కొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వామి అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవించలేని పరిస్థితులు వస్తుంటాయి. ఇలాంటప్పుడు ఎవరి వైపు నుంచి చూసినా అది కరక్టే అన్న భావన కలుగుతుంటుంది. అయితే సమస్య పరిష్కారం కావాలంటే ఎవరో ఒకరు సర్దుకుపోవాల్సిందే. అయితే ఈ క్రమంలో- ఆత్మగౌరవానికి భంగం వాటిల్లకుండా, కలిగించకుండా చూసుకోవాలి.

అలాంటి విషయాల్లో..

ఈ రోజుల్లో చాలామంది దంపతులు ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరికీ ఒకేసారి సెలవులు పెట్టే అవకాశం చాలా తక్కువ సందర్భాల్లోనే లభిస్తుంటుంది. అయితే కొంతమంది తమ జీవిత భాగస్వామి అభిప్రాయాన్ని తీసుకోకుండానే వెకేషన్ ప్లాన్ చేస్తుంటారు. దీనివల్ల అవతలి వ్యక్తికి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఫలితంగా ఇద్దరి మధ్య గొడవలు వస్తుంటాయి. ఇలాంటి విషయాల్లో ఒకటి, రెండుసార్లు సర్దుకుపోవడం వల్ల పెద్దగా నష్టం ఉండదు. కానీ, ప్రతిసారీ అయితే ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కాబట్టి, ఇలాంటి విషయాల్లో ముందు జీవిత భాగస్వామి అభిప్రాయం తీసుకుంటే ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

ఇలాంటప్పుడు నో చెప్పాల్సిందే..!

కెరీర్‌ విషయంలో..

ప్రతి ఒక్కరికీ తమ జీవితంలో ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. కానీ, చాలామంది వివిధ కారణాల వల్ల వాటిని చేరుకోలేకపోతుంటారు. కొంతమంది పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు తమ లక్ష్యాలను తిరిగి చేరుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే అది జీవిత భాగస్వామికి ఆమోదయోగ్యం అయితే ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ, భాగస్వామికి నచ్చకపోతే ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వస్తుంటాయి. ఈ క్రమంలో ప్రత్యేకించి కెరీర్‌ విషయంలో మాత్రం కాంప్రమైజ్‌ కావద్దంటున్నారు నిపుణులు. జీవిత భాగస్వామిగా ప్రేమను పంచుకున్నట్టే లక్ష్యాలను కూడా పంచుకోవాలని సూచిస్తున్నారు.

ఉనికే ప్రశ్నార్థకమైతే..!

అలవాట్లు ప్రతి మనిషికి వేరు వేరుగా ఉంటాయి. కొంతమంది వస పిట్టలాగా మాట్లాడితే మరికొంతముంది మౌన మునిలాగా వ్యవహరిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఒకరు మరొకరిలాగా మారాలంటే చాలా కష్టం. కానీ, కొంతమంది తమ జీవిత భాగస్వామిపై ఇలాంటి ఒత్తిళ్లే తెస్తుంటారు. వేషధారణ తనకు నచ్చినట్లే ఉండాలని, తనకు ఇష్టమైన పద్ధతులే పాటించాలని, ఇతరులతో మాట్లాడకూడదని, తను చెప్పినట్లే వినాలని.. ఇలా పలు ఆంక్షలు పెడుతుంటారు. వీటివల్ల అవతలి వారు ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి విషయాల్లో కొన్ని సందర్భాల్లో అయితే సర్దుకుపోవచ్చు. కానీ, ప్రత్యేకించి తమ ఉనికే ప్రశ్నార్థకంగా మారే సందర్భాలలో మాత్రం రాజీ పడడం మంచిది కాదంటున్నారు నిపుణులు.

ప్రతిసారీ వద్దు..

దంపతుల మధ్య పలు విషయాల్లో విభేదాలు రావడం సహజం. అనుబంధం దృఢంగా ఉండాలంటే ఎవరో ఒకరు సర్దుకుపోవాలి. అయితే కొంతమందిలో వచ్చిన సమస్యే మళ్లీ మళ్లీ రావడం.. ఒక వ్యక్తే తరచుగా సర్దుకుపోవడం జరుగుతుంటుంది. ఇలా చేయడం వల్ల ఆ సమస్య పరిష్కారం కాకపోగా పెద్దదిగా మారుతుంటుంది. ఇలాంటి పద్ధతి దంపతులిద్దరికీ మంచిది కాదంటున్నారు నిపుణులు. కాబట్టి, ఇలాంటి విషయాల్లో ప్రతిసారీ రాజీ ధోరణి మంచిది కాదంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్