ఒక్క వీడియో.. వారంలో 116 కోట్ల సంపాదన!

ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వీడియోలు చూసే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీన్ని అవకాశంగా తీసుకొని చాలామంది యువత సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లుగా రాణిస్తున్నారు.

Published : 14 Feb 2024 12:52 IST

(Photos: Instagram)

ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వీడియోలు చూసే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీన్ని అవకాశంగా తీసుకొని చాలామంది యువత సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లుగా రాణిస్తున్నారు. తద్వారా ఈ వేదికలను తమ ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారు. అయితే, వీరిలో పాపులర్ అయ్యే వారు కొంతమంది మాత్రమే ఉంటారు. వారిలో చైనాకు చెందిన జెంగ్ జియాంగ్ కూడా ఒకరు. ఆమె వినూత్న ఆలోచన ఆమెకు సోషల్‌ మీడియాలో పాపులారిటీనే కాదు.. వారం రోజుల్లోనే దాదాపు 116 కోట్లు సంపాదించి పెట్టింది. ఇంతకీ ఏంటా ఐడియా? తెలుసుకుందాం రండి..

మూడు సెకన్లలో..

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఒక్కొక్కరు ఒక్కో అంశంపై వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. చైనాకు చెందిన జెంగ్ జియాంగ్ అనే మహిళ ప్రొడక్ట్ మార్కెటింగ్ అంశాన్ని ఎంచుకొని ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారింది. అయితే, మిగతా వారి కంటే జెంగ్ జియాంగ్ రూటే సెపరేటు! ఎందుకంటే, సాధారణంగా ప్రొడక్ట్ మార్కెటింగ్ చేసే వారు ఆయా ఉత్పత్తుల గురించి పూర్తి వివరాలు చెబుతూ సుదీర్ఘ వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. కానీ, జెంగ్ జియాంగ్ మాత్రం ఉత్పత్తిని కేవలం మూడు సెకన్లలో మాత్రమే ప్రజెంట్‌ చేస్తోంది. అంత తక్కువ నిడివిలోనే వాటిని ప్రేక్షకులకు చూపించి, ఉత్పత్తి ధరను చెబుతోంది. అలా వేగంగా నిమిషాల వ్యవధిలోనే ఎక్కువ ఉత్పత్తులను అడ్వర్టైజ్‌ చేస్తోంది. వీటిని చైనా టిక్‌టాక్ వెర్షన్ Douyinలో పోస్ట్ చేస్తుంది. నెటిజన్లకు జియాంగ్ ఆలోచన నచ్చడంతో, ఆమెను చాలా మంది ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం, ఆమె ఖాతాను 50 లక్షల మంది అనుసరిస్తున్నారు.

లైవ్‌ స్ట్రీమ్‌లోనే...

చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్లు ముందుగా రికార్డ్ చేసిన వీడియోలను పోస్ట్ చేస్తుంటారు. కానీ, జెంగ్ జియాంగ్ మాత్రం లైవ్ స్ట్రీమ్‌లోనే ప్రొడక్ట్ మార్కెటింగ్ చేస్తోంది. ఈ క్రమంలో తను చూపించే ఉత్పత్తులన్నీ ముందుగానే ఆరెంజ్ బాక్సుల్లో సిద్ధం చేసుకుంటుంది. వాటిని ఇలా తీసుకొని అలా వినియోగదారులకు పరిచయం చేస్తుంది. ఇలా వేగంగా ఉత్పత్తులను చూపించడం కోసం ప్రత్యేక సిబ్బంది కూడా ఆమెకు సహకరిస్తుంటారట! ఇలా ఎన్నో ఉత్పత్తులకు సంబంధించిన ధరలను ఏమాత్రం తడబాటు లేకుండా టకటకా చెబుతుండడంతో ఆమె జ్ఞాపకశక్తికీ నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఒక్క వీడియోతో..

జెంగ్ జియాంగ్ 2017 నుంచి ఇలాంటి షార్ట్ వీడియోలు చేస్తోంది. మొన్నటివరకు ఆమెకు పెద్దగా ప్రాచుర్యం దక్కలేదనే చెప్పాలి. గతేడాది నవంబర్‌లో పెట్టిన ఇలాంటి ఓ అడ్వర్టైజ్‌మెంట్‌ పోస్ట్‌తో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిందామె. ఆ పోస్ట్‌తో ఆమె ఫాలోవర్ల సంఖ్య 10 లక్షలకు పైగా పెరిగింది. దాంతో ఈ-కామర్స్ రంగంలో జెంగ్ జియాంగ్ ఒక సెలబ్రిటీగా మారింది. ఈ క్రమంలో ఆమె చూపించే ఒక్కో ఉత్పత్తికి 10 యువాన్లు (116 రూపాయలు)ను తీసుకుంటోంది. అలా ఆ వీడియోతో ఒక వారంలో ఆమె దాదాపు 116 కోట్ల రూపాయలను ఆర్జించింది. అప్పట్నుంచి జెంగ్‌ పాపులారిటీ, సంపాదన పెరుగుతూనే ఉన్నాయి.

ఇతరులకు భిన్నంగా, ప్రత్యేకంగా ప్రొడక్ట్ మార్కెటింగ్ చేస్తుండడంతో నెటిజన్ల నుంచి జెంగ్‌కు, ఆమె వీడియోలకు మంచి ఆదరణ లభిస్తోంది. అలాగే వేగంగా ఉత్పత్తులను చూపించడంతో ఆమెపై మీమ్స్ కూడా రూపొందిస్తున్నారు పలువురు నెటిజన్లు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్