ఇలాంటి సందర్భాల్లో ఏకాంతంగా వదిలేయాల్సిందే!

ఏదైనా అనుకోని సంఘటన ఎదురైనప్పుడు కొంతమంది ‘ఐ నీడ్ సమ్‌ స్పేస్’ అంటుండడం వినే ఉంటాం.  నిజానికి ఇలాంటి సందర్భాల్లో ఏకాంతంగా ఉండడం వల్ల కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. కానీ, చాలామంది ఆ విషయాన్ని తమ జీవిత భాగస్వామికి చెప్పకుండా వివిధ రకాలుగా...

Published : 01 Mar 2023 15:52 IST

ఏదైనా అనుకోని సంఘటన ఎదురైనప్పుడు కొంతమంది ‘ఐ నీడ్ సమ్‌ స్పేస్’ అంటుండడం వినే ఉంటాం.  నిజానికి ఇలాంటి సందర్భాల్లో ఏకాంతంగా ఉండడం వల్ల కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. కానీ, చాలామంది ఆ విషయాన్ని తమ జీవిత భాగస్వామికి చెప్పకుండా వివిధ రకాలుగా ప్రవర్తిస్తుంటారు. అవతలి వ్యక్తికి అసలు విషయం తెలియక గొడవ పడుతుంటారు. ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వామికి ఏకాంత సమయం ఇవ్వాలంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు.

ఆ విషయాలు చెప్పడం లేదా?

సాధారణంగా చాలామంది ఆఫీసుకు వెళ్లొచ్చిన తర్వాత తమ భాగస్వామితో సరదాగా గడుపుతుంటారు. ఈ క్రమంలో రకరకాల విషయాల గురించి చర్చిస్తుంటారు. కొన్నిసార్లు జీవిత భాగస్వామితో చెప్పుకోలేని సమస్యలు వస్తుంటాయి. ఇలాంటప్పుడు వారితో మాట్లాడకుండా ఇంట్లో ముభావంగా ఉంటారు. అయితే అవతలి వ్యక్తికి ముభావంగా ఉండడం నచ్చక ఎందుకు మాట్లాడడం లేదంటూ సతాయిస్తుంటారు. అది చినికి చినికి గాలి వానలా మారుతుంటుంది. మీకు కూడా ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు వారికి కొంత ఏకాంత సమయం ఇవ్వడం అవసరం. ఒకవేళ అసలు సమస్యేంటో మీకు చెబితే దాని పరిష్కారానికి మీ వంతు సహకారం అందించే ప్రయత్నం చేయండి. అంతేకానీ, సమస్య గురించి పదే పదే ప్రస్తావిస్తూ దానిని పెద్దది చేయకండి.

అక్కడిది ఇక్కడ చూపిస్తున్నారా?

కొంతమంది పని ప్రదేశంలో సహోద్యోగులు, బాస్‌ వల్ల తీవ్ర నిరుత్సాహా నికి గురవుతుంటారు. వారిపై ఎంత కోపం ఉన్నా చూపించలేని పరిస్థితులు నెలకొంటాయి. ఇలాంటి వారు ఇంటికి వచ్చిన తర్వాత చిన్న చిన్న విషయాలకే ఫ్రస్టేట్‌ అయ్యి అక్కడి కోపాన్ని జీవిత భాగస్వామి మీద ప్రదర్శిస్తుంటారు. దాంతో ఇద్దరి మధ్య గొడవ మొదలవుతుంటుంది. ఇలాంటి సంఘటనలు చాలా కుటుంబాల్లో తరచుగా జరుగుతుంటాయి. అయితే ఈ క్రమంలో తమ భాగస్వామితో వాదనకు దిగకుండా అసలు విషయం అడిగి వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేయడం మంచిది. ఒకవేళ అది సాధ్యం కాకపోతే ఏకాంతంగా వదిలేయండి.

అవి రద్దవుతున్నాయా?

కొంతమంది తమ భాగస్వామితో డిన్నర్‌కు వెళ్లాలనో, బయటికి వెళ్లాలనో ప్రణాళిక వేసుకుంటుంటారు. అయితే కొన్నిసార్లు పని ఒత్తిడి వల్ల, ఆరోగ్య సమస్యల వల్ల వాయిదా వేసుకుంటారు. ఇలా ఏదైనా అనుకోని సందర్భాలలో అరుదుగా ఇలా జరిగితే అర్ధం చేసుకోవచ్చు. కానీ ఏవేవో సాకులు చెబుతూ తరచుగా ఇలా చేస్తున్నట్లయితే- మీ భాగస్వామి ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్టే భావించాలి. ఇలాంటి సందర్భాలలో- ఎందుకిలా చేస్తున్నారంటూ గొడవపడకుండా వారిని అర్ధం చేసుకుని, వారు కోలుకోవడానికి తగినంత సమయం ఇవ్వాలి. అలాగే వారి అసలు సమస్య ఏమిటో నిదానంగా తెలుసుకుని దాని నుంచి బయటపడడానికి వీలైనంత సాయం చేయాలి.

అకారణంగా గొడవ పడుతున్నారా?

కొంతమంది తమ అసహనాన్ని ఇతరుల మీద వ్యక్తం చేయలేక భాగస్వామి మీద చూపిస్తుంటారు. ఈ క్రమంలో వారు చేసే ప్రతి పనిలోనూ తప్పులు వెతుకుతూ గొడవ పడుతుంటారు. మీ భాగస్వామి కూడా ఇలాగే చేస్తుంటే వారు ఏదో సమస్యతో ఇబ్బంది పడుతున్నారని భావించాలి. ఇలాంటి సందర్భాలలో మీరు కూడా వెంటనే తిరిగి వారితో గొడవ పడడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. పైగా అనర్ధాలే ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మీరు వారికి కొంత సమయం ఇవ్వండి. అంతకంటే ముందు వారి అసలు సమస్యను అడిగి తెలుసుకోండి. దానిని బట్టి వారికి కొంత సమయం కేటాయించి సమస్య పరిష్కారానికి మీ వంతు సహాయం అందించే ప్రయత్నం చేయండి.

కారణమేదైనా సరే - దంపతుల మధ్య ఒక్కోసారి దూరం దగ్గర చేస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. అందువల్ల ఎలాంటి పరిస్థితుల్లోనూ తొందర పడకుండా, దాంపత్య బంధంలో ఎదురయ్యే సమస్యలను ఓపికతో, సామరస్య ధోరణితో పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్