China: నిరుద్యోగం, ఆర్థిక కుంగుబాటు వేళ చైనాలో కీలక సమావేశం

చైనాలో అత్యంత కీలకమైన కమ్యూనిస్టు పార్టీ సమావేశాలు మొదలయ్యాయి. బీజింగ్‌ మొత్తం భద్రతా వలయంలో ఉంది. 

Published : 04 Mar 2024 12:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా కమ్యూనిస్టు పార్టీ అత్యంత కీలక వార్షిక రాజకీయ సమావేశం నేడు బీజింగ్‌లో మొదలైంది. నిరుద్యోగ తీవ్రత, ఆర్థిక కుంగుబాటు పరిస్థితుల్లో జరుగుతున్న ఈ సమావేశానికి ప్రాధాన్యం పెరిగింది. రానున్న కాలంలో చైనా అనుసరించాల్సిన ఆర్థిక విధానాలను ఈ భేటీలో చర్చించనున్నారు. ఇప్పటికే బీజింగ్‌ మొత్తం భద్రతా వలయంలో ఉంది. వేలమంది పార్టీ నేతలు ఒక్కచోటుకి రానుండటంతో సాయుధ పోలీసులు వీధుల్లో పహారా కాస్తున్నారు. 

స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 3 గంటలకు చైనా పీపుల్స్‌ పొలిటికల్‌ కన్సల్టేటీవ్‌ కాన్ఫరెన్స్‌ (సీపీపీసీసీ) మొదలైంది. దీనికి పార్టీ అధినేత, దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌ సహా దాదాపు 2 వేల మంది కీలక నేతలు హాజరయ్యారు. ఈ సమావేశాలు మార్చి 10వ తేదీ వరకు కొనసాగనున్నాయి. వీటిపై నిన్ననే సీసీపీ ప్రతినిధి లియూ జైయీ మాట్లాడుతూ ‘‘ఆర్థిక అంశాలపై తీవ్ర ఆందోళన నెలకొంది. దీనికి తోడు కొత్త డిగ్రీలు పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు మందగించాయి. అయితే దేశంలో సవాళ్లతో పోలిస్తే.. అనుకూల పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి. దీర్ఘకాలిక ఆర్థికవృద్ధికి సంబంధించిన అంశాలు స్థిరంగా ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. 

గడ్డకట్టిన కాలిఫోర్నియా.. జనజీవనానికి ఆటంకం

రేపటి నుంచి చైనా నేషనల్‌ పీపుల్స్ కాంగ్రెస్‌ సమావేశాలు కూడా మొదలై.. మార్చి 11 వరకు కొనసాగుతాయి. ఈ సారి దేశ ప్రీమియర్‌ లీ కికియాంగ్‌ మాత్రం ఎన్‌పీసీ సమావేశాల చివరి రోజు ప్రెస్‌మీట్‌ నిర్వహించరని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. గత పదేళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి. 2023 సంవత్సరంలో చైనా 15శాతం నిరుద్యోగ రేటును నమోదు చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని