Donald Trump: ట్రంప్‌నకు మరో షాక్‌.. మోసం కేసులో రూ.3వేల కోట్ల జరిమానా

Donald Trump: సివిల్‌ మోసం వ్యవహారంలో ట్రంప్‌నకు గట్టి షాక్‌ తగిలింది. న్యూయార్క్‌ కోర్టు ఆయనకు రూ.3వేల కోట్ల జరిమానా విధించింది.

Updated : 17 Feb 2024 11:23 IST

న్యూయార్క్‌: అమెరికా (USA) అధికార పీఠాన్ని రెండోసారి దక్కించుకోవాలని కలల కంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)నకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలు కేసుల్లో నేరాభియోగాలు ఎదుర్కొంటున్న ఆయనకు తాజాగా న్యూయార్క్‌ కోర్టు మరో గట్టి షాకిచ్చింది. పలు బ్యాంకులను మోసం చేసిన కేసులో 364 మిలియన్‌ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.3వేల కోట్లకు పైమాటే) పెనాల్టీ విధించింది.

ట్రంప్‌ తన ఆస్తుల మొత్తాన్ని వాస్తవిక విలువ కంటే అధికంగా చూపి బ్యాంకులను, బీమా సంస్థలను మోసం చేశారని ఆరోపణలు వచ్చాయి. కొన్నేళ్ల పాటు ఇలా మోసపూరితంగా వ్యాపార రుణాలు, బీమా పొందారన్న అభియోగాలపై కేసు నమోదైంది. న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌, డెమోక్రాట్‌ నేత లెటిటియా జేమ్స్‌ ఈ దావా వేయగా.. దీనిపై ఇటీవల రెండున్నర నెలల పాటు న్యాయస్థానం విచారణ జరిపింది.

ఇందులో ట్రంప్‌పై అభియోగాలు రుజువవడంతో 365 మిలియన్‌ డాలర్ల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి శుక్రవారం తీర్పు వెలువరించారు. అంతేగాక, మూడేళ్ల పాటు న్యూయార్క్‌కు చెందిన ఏ సంస్థలోనూ ఆయన ఆఫీసర్‌ లేదా డైరెక్టర్‌గా ఉండకూడదంటూ నిషేధం విధించారు. ఇది సివిల్‌ కేసు కావడంతో జైలు శిక్ష వేయట్లేదని తెలిపారు. ఈ తీర్పుపై తాము అప్పీల్‌కు వెళ్తామని ట్రంప్‌ తరఫు న్యాయవాదులు వెల్లడించారు.

రెండోసారి వైట్‌హౌస్‌కు వెళ్లేందుకు అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ట్రంప్‌నకు గత కొంతకాలంగా న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు కేసుల్లో ఆయనపై నేరాభియోగాలు నమోదయ్యాయి. ఇటీవల లైంగిక వేధింపులకు సంబంధించిన పరువునష్టం కేసులో అమెరికన్‌ మాజీ కాలమిస్ట్‌ జీన్‌ కరోల్‌ (80)కు 83.3 మిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో రూ.692.4 కోట్లు) అదనంగా చెల్లించాలని మాన్‌హటన్‌ ఫెడరల్ కోర్టు ఆదేశించింది. ఇదే కేసులో అంతకుముందు ఆయనకు 5 మిలియన్‌ డాలర్ల జరిమానా పడింది. ఇక, 2022లో పన్ను చెల్లింపులకు సంబంధించిన మోసం కేసులో ట్రంప్‌ ఆర్గనైజేషన్‌కు 1.6 మిలియన్ డాలర్ల పెనాల్టీ విధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని