Russia: అలెగ్జాండర్‌ నుంచి నావల్నీ దాకా.. అంతుచిక్కని పుతిన్‌ విమర్శకుల మరణాలు

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను విమర్శించినవారు హఠాత్తుగా మృతి చెందుతుండటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

Published : 18 Feb 2024 14:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రష్యా (Russia) ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ (Alexey Navalny) మృతి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆయన మృతికి  పుతిన్‌ (Vladimir Putin) కారణమని ఆయన భార్య, మద్దతుదారులు సహా అమెరికా, కెనడాలు ఆరోపించాయి. మరోవైపు రష్యాలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు వరుసగా ప్రాణాలు కోల్పోవడం మిస్టరీగా మారింది. పుతిన్‌ హయాంలో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన వారి వివరాలను చూద్దాం. 

అలెగ్జాండర్‌ లిట్వినెంకో (Alexander Litvinenko)

అలెగ్జాండర్‌ రష్యన్‌ ఫెడరల్‌ సెక్యూరిటీ ఏజెంట్‌గా పనిచేసేవారు. 1999 మాస్కో అపార్ట్‌మెంట్‌ బాంబు దాడులకు పుతిన్‌ కారణమని ఆరోపిస్తూ, ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించేవారు. 2006లో లండన్‌లో ఇద్దరు రష్యన్‌ ఏజెంట్లతో కలిసి టీ తాగిన తర్వాత ఆయన మరణించారు. అలెగ్జాండర్‌ తాగిన టీలో విషం కలిపారనే వాదనలు అప్పట్లో వినిపించాయి.

ప్రిగోజిన్‌ (Yevgeny Prigozhin)

కిరాయి సైన్యంగా పేర్కొందిన వాగ్నర్‌ గ్రూప్‌నకు ప్రిగోజిన్‌ నాయకత్వం వహించాడు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో ఈ గ్రూప్‌ కీలకంగా వ్యవహరించింది. గతేడాది చివర్లో రష్యా సైనిక నాయకత్వంపై ప్రిగోజిన్‌ తిరుగుబాటు చేయడం సంచలనం సృష్టించింది. అయితే, దీనిపై వెనక్కి తగ్గిన ఆయన, బెలారస్‌లో ఆశ్రయం పొందారు. పుతిన్‌, ప్రిగోజిన్‌ మధ్య గొడవ సద్దుమణిగిందని బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకో అప్పట్లో వెల్లడించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ప్రిగోజిన్‌ విమాన ప్రమాదంలో మరణించారు. పైలట్లు సహా అతడి అంగరక్షకులు 10 మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 

బోరిస్‌ నెమత్సోవ్‌ (Boris Nemtsov)

రష్యా ప్రధానిగా పనిచేసిన బోరిస్‌పై 2015లో క్రెమ్లిన్‌ దగ్గర్లోని మాస్కో వంతెన వద్ద కొంతమంది వ్యక్తులు కాల్పులు జరపడంతో మృతి చెందాడు. ఈ ఘటనలో చెచెన్‌కు చెందిన ఐదుగురిని రష్యా భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. అయితే, దీని వెనుక ఎవరున్నారనేది మాత్రం కనిపెట్టలేకపోయాయి. 2014లో క్రిమియాను ఉక్రెయిన్‌ నుంచి రష్యా స్వాధీనం చేసుకోవడంపై ప్రతిపక్షాలు చేపట్టిన నిరసనల్లో బోరిస్‌ పాల్గొన్నాడు. అంతేకాకుండా పుతిన్‌ నిర్ణయాలపై తరచుగా విమర్శలు చేసేవాడు. 

అన్నా పొలిట్‌కోవ్‌స్కాయ  (Anna Politkovskaya)

రష్యన్‌ జర్నలిస్ట్‌ అన్నాను 2006లో ఆమె అపార్ట్‌మెంట్‌లో కొందరు దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. దేశాధ్యక్షుడు పుతిన్, చెచెన్ నాయకుడు రంజాన్ కదిరోవ్‌లపై తరచూ విమర్శలు చేసేవారు. అప్పట్లో అన్నా మృతి తర్వాత రష్యాలో ప్రతికా స్వేచ్ఛపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. 

వీళ్లే కాకుండా మరికొందరు నాయకులు, వ్యాపారవేత్తలు అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడగా.. మరికొందరు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. రష్యా వ్యాపారవేత్త, ఎంపీ ఆంటోవ్‌ 2022 డిసెంబరులో ఒడిశాలోని రాయగడ హోటల్‌లో మరణించారు. అంతకు కొద్దిరోజుల ముందు నౌకా రంగ దిగ్గజ వ్యాపారవేత్త అలెగ్జాండర్‌ బుజెకోవ్‌ ఒక సబ్‌మెరైన్‌ ఫ్లోటింగ్‌ ఫంక్షన్‌లో హఠాత్తుగా మృతి చెందారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన లుక్‌ ఆయిల్‌ ఛైర్మన్‌ రావిల్‌ మాగ్నోవ్‌.. గది కిటికీ నుంచి దూకి  ప్రాణాలు తీసుకున్నాడు. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైన రెండో రోజే గ్యాజ్‌ప్రామ్‌ యూనిఫైడ్‌ సెటిల్మెంట్‌ సెంటర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ అలెగ్జాండర్‌ ట్యూల్కోవ్‌ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. 

ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైన నాటి నుంచి పుతిన్‌ విమర్శకుల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. రష్యా అధికారులు వీటిని ఆత్మహత్యలు, ప్రమాదాలుగా చెబుతున్నారు. ఇప్పటి వరకు అనుమానాస్పద రీతిలో లేదా హఠాత్తుగా వివిధ కారణాలతో మరణించిన రష్యా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఏదో ఒక సందర్భంలో పుతిన్‌పై విమర్శలు చేసిన వారు కావడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు