ఇటలీ ప్రధానిగా జార్జియా మెలోని

ఇటలీ చరిత్రలో తొలిసారిగా ఓ మహిళా నేత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. బ్రదర్స్‌ ఆఫ్‌ ఇటలీ పార్టీకి చెందిన అతివాద నేత జార్జియా మెలోని (45) ఇటీవల జరిగిన జాతీయ ఎన్నికల్లో 26.37 శాతం ఓట్లు సాధించారు

Published : 27 Sep 2022 04:53 IST

తొలిసారిగా మహిళా నేతకు పగ్గాలు

రోమ్‌: ఇటలీ చరిత్రలో తొలిసారిగా ఓ మహిళా నేత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. బ్రదర్స్‌ ఆఫ్‌ ఇటలీ పార్టీకి చెందిన అతివాద నేత జార్జియా మెలోని (45) ఇటీవల జరిగిన జాతీయ ఎన్నికల్లో 26.37 శాతం ఓట్లు సాధించారు. సోమవారం వెల్లడైన తుది ఫలితాల్లో ఈమె నేతృత్వంలోని కూటమి 43 శాతానికి పైగా ఓట్లతో విజయఢంకా మోగించింది. రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఇటలీలో ఏర్పడే పూర్తి అతివాద ప్రభుత్వం కూడా ఇదే అవుతుంది. వివాదాస్పదమైన ‘గాడ్‌, ఫాదర్‌ల్యాండ్‌ అండ్‌ ఫ్యామిలీ’ నినాదంతో మెలోని ముందుకు సాగారు. ఎల్‌జీబీటీ హక్కులకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఇటలీ నౌకాదళం లిబియా సముద్రమార్గాన్ని మూసివేయాలని ఆమె కోరుకుంటున్నారు. అదే సమయంలో దేశంలోని ముస్లిం వర్గాలకు వ్యతిరేకంగా తరచూ హెచ్చరికలు జారీ చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో పుతిన్‌ను విమర్శించేందుకు మెలోని పెద్దగా ఆసక్తి చూపలేదు. నాటోకు, ఉక్రెయిన్‌కు ఆమె నుంచి అనుకొన్న స్థాయిలో మద్దతు లభించలేదు. గత ఎన్నికల్లో మెలోని పార్టీకి కేవలం 4 శాతం ఓట్లు లభించాయి. మారియో డ్రాఘీ నేతృత్వంలోని కూటమిలో చేరడానికి నిరాకరించి, ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆమె కొనసాగారు. గ్రాబ్టెల్లాలోని ఓ కార్మిక కుటుంబంలో మెలోని జన్మించారు. చిన్నతనంలోనే తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్లిపోవడంతో తల్లి వద్దే పెరిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని