icon icon icon
icon icon icon

భూచోడు మన భూములపై కన్నేశాడు!

‘జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తే మీ భూమికి రికార్డులు, పాసు పుస్తకం, అడంగల్‌ ఉండవు.. మీ ఆస్తిపత్రాలను జగన్‌ లాక్కుని మీకు జిరాక్సు కాపీలు ఇస్తారు.

Updated : 05 May 2024 07:18 IST

జగన్‌ మళ్లీ వస్తే మీ ఆస్తిపత్రాలు లాక్కుంటారు
మేం అధికారంలోకి రాగానే ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని రద్దు చేస్తాం
వైకాపా ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తిన చంద్రబాబు
నేను సంక్షేమం చేసేవాడినే కానీ.. తీసేసేవాడిని కాదు
నూజివీడు, దర్శి, కాకినాడ ప్రజాగళం సభల్లో చంద్రబాబు ధ్వజం

ఈనాడు, ఏలూరు, ఒంగోలు, కాకినాడ: ‘జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తే మీ భూమికి రికార్డులు, పాసు పుస్తకం, అడంగల్‌ ఉండవు.. మీ ఆస్తిపత్రాలను జగన్‌ లాక్కుని మీకు జిరాక్సు కాపీలు ఇస్తారు. అసలు పత్రాలన్నీ అమెరికాలోని క్రిటికల్‌ రివర్‌ టెక్నాలజీస్‌ అనే తన బినామీ కంపెనీ నిర్వహిస్తుందంటున్నారు.. జగన్‌ అనే భూచోడు మన భూములపై కన్నేశాడు.. మీ జుట్టును ఆయన చేతిలో పెట్టుకోవాలని చూస్తున్నారు. అందుకే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను తెస్తున్నారు. దాన్ని చెత్తబుట్టలో వేయండి.. మేం అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డీఎస్సీపై.. రెండో సంతకం ఈ నల్లచట్టాన్ని రద్దు చేసేందుకే చేస్తా’ అంటూ తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఏలూరు జిల్లా నూజివీడు, ప్రకాశం జిల్లా దర్శి, కాకినాడ నగరంలో శనివారం నిర్వహించిన ప్రజాగళం సభల్లో ఆయన ప్రసంగించారు. అంతకుముందు కాకినాడ నగరం, కాకినాడ గ్రామీణ నియోజకవర్గాల్లో రోడ్‌షో చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ.. ‘వైకాపా ప్రభుత్వం ఇస్తున్న పట్టాదారు పాసు పుస్తకంపై ఎవరి ఫొటో ఉందో చూశారా? మీ తాతలు, తండ్రులిచ్చిన భూముల పత్రాలపై జగన్‌ ఫొటో ఉండటమేంటి? మీ ఆస్తులపై ఆయన పెత్తనమేంటి’ అంటూ నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా చంద్రబాబు ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ జీవో ప్రతులను, సీఎం జగన్‌ చిత్రంతో ఉన్న పాసు పుస్తకాల్ని చించటంతో ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చింది. చప్పట్లు కొడుతూ, ఈలలు వేసి స్వాగతించారు.

‘జగన్‌ నవరత్నాలంటూ ప్రజలను నమ్మించి.. ఆ పేరుతో తొమ్మిది మాఫియా సామ్రాజ్యాలు నెలకొల్పారు. వాటిలో మొదటిది ఇసుక, రెండు మద్యం, మూడు భూఅక్రమాలు, నాలుగు మైనింగ్‌, అయిదు హత్యలు, ఆరు ప్రజల ఆస్తుల కబ్జా, ఏడు ఎర్రచందనం, గంజాయి స్మగ్లింగ్‌, ఎనిమిది దాడులు, కేసులు, తొమ్మిది శవ రాజకీయాలు’ అని ఎద్దేవా చేశారు. ‘జగన్‌ ప్రతి ఎన్నికలకూ శవ రాజకీయాలు చేస్తున్నారు. గతంలో బాబాయి హత్య, కోడికత్తి డ్రామాలాడారు. ఈసారి గులకరాయి, ఇళ్ల వద్ద పింఛన్ల పంపిణీ చేయకుండా వృద్ధులను చంపి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. జగన్‌ ఓ మాయల మాంత్రికుడు. అంతా జాగ్రత్తగా ఉండండి. మే 13న తెదేపా కూటమి అభ్యర్థులకు ఓటేయండి. జూన్‌ 4న నరకాసుర వధతో రాష్ట్రంలో దీపావళి చేసుకుందాం’ అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.
‘వివేకా హత్య కేసులో నిందితుడైన అవినాష్‌రెడ్డిని జగన్‌ తన పక్కన పెట్టుకుని అమాయకుడు, పిల్లోడు అంటున్నారు. పిల్లోడైతే బడికి పంపకుండా పార్లమెంట్‌కు ఎందుకు’ అని ఎద్దేవా చేశారు. నూజివీడు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో విలీనం చేస్తానని, ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.


వైకాపా నాయకులు అర్చకుల్నీ కొడుతున్నారు

‘విశాఖలోనే రూ.40 వేల కోట్ల విలువైన ఆస్తుల్ని కొట్టేసిన దుర్మార్గుడు జగన్‌. కాకినాడ పోర్టు అసలు యజమాని దగ్గర ఉందా..? 40-45 ఏళ్లు కష్టపడి సంపాదించిన ఆ ఆస్తిని మెడపై కత్తిపెట్టి రాయించుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భూ యజమానుల ఫొటోతో పాసుపుస్తకాలు ఇచ్చే బాధ్యత నాది. వైకాపా ప్రభుత్వ హయాంలో దాడులకు గురైన ప్రతి దేవాలయంపైనా విచారణ జరిపిస్తాం. రాముడి తల ధ్వంసం చేసిన వారిని, తితిదేను అపవిత్రం చేసిన వారిని శిక్షిస్తాం. వైకాపా నాయకులు గుడిలో అర్చకుల్ని, మసీదులో ఇమాముల్ని కొడుతున్నారు. మేం వచ్చిన తర్వాత.. వాళ్లను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతా’ అని చంద్రబాబు హెచ్చరించారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, ఆయన తండ్రి, తమ్ముడు 15 వేల కోట్ల విలువైన బియ్యాన్ని పోర్టు ద్వారా అక్రమంగా విదేశాలకు తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


సంపద సృష్టిస్తాం.. అందరికీ పంచుతాం

‘జగన్‌ ప్రజలకు రూ.10 ఇచ్చి.. రూ.100 దోపిడీ చేస్తున్నారు. మా మ్యానిఫెస్టోలో చెప్పినట్లుగా సంపద సృష్టించి.. పేదలకు పంచుతాం. నేను సంక్షేమం చేసేవాడినే కానీ.. తీసేవాడిని కాదు.. రూ.200 ఉన్న పింఛన్‌ రూ.2 వేలు చేసింది నేనే. మేం అధికారంలోకి రాగానే రూ.4 వేలకు పెంచి ఏప్రిల్‌ నుంచి అమలు చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులందరినీ ఆదుకుంటాం. ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు, పింఛన్లు అందిస్తాం. పోలీసులకు మెరుగైన వేతనాలు, బకాయిలు చెల్లిస్తాం’ అంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img