China: పవర్‌ బ్యాంక్‌లు, యూఎస్‌బీ పోర్టులు.. చైనా గూఢచర్యం ఇలా కూడా..!

చైనాకు చెందిన ఐ-సూన్‌ సంస్థ గూఢచర్యం కోసం వాడుతున్న పరికరాల సమాచారం వెలుగులోకి వచ్చింది. రోజువారీ కార్యాలయాల్లో వాడే వస్తువులతోనే ఇది హ్యాకింగ్‌ చేస్తున్నట్లు తేలింది. 

Updated : 27 Feb 2024 16:23 IST

ఇంటర్నెట్‌డెస్క్: ప్రత్యర్థి దేశాలపై గూఢచర్యం కోసం చైనా (China) కొత్త ఎత్తుగడలు వేస్తోంది. ఇటీవల ఆ దేశానికి చెందిన వ్యూహాలను వెల్లడించే పత్రాలు లీకయ్యాయి. డ్రాగన్‌ తన గూఢచర్యానికి రోజువారీ వినియోగించే పరికరాల్లో మార్పులు చేసి ప్రయోగిస్తున్నట్లు తేలింది. చైనాకు చెందిన ఐ-సూన్‌ సంస్థ ఈ వ్యవహారాలను చూస్తున్నట్లు తెలుస్తోంది. గత వారం ఐ-సూన్‌ సంస్థకు చెందిన దాదాపు 517 పత్రాలను గిట్‌హబ్‌ అనే సంస్థ చేజిక్కించుకొని ఆన్‌లైన్‌లో పోస్టు చేసింది. హ్యాకింగ్‌ ప్రపంచంలో ఉండే అరుదైన పరిస్థితులను ఈ పత్రాలు వెల్లడిస్తున్నాయి. 

ఈ సంస్థ మార్పులు చేసిన పాపులర్‌ పవర్‌ బ్యాంక్‌లు, యూఎస్‌బీ పోర్టులు, ఇంటర్నెట్‌ రౌటర్లు అటాక్‌ సిస్టమ్స్‌గా వినియోగిస్తోంది. వీటిని తమ వినియోగదారులకు అందజేస్తోంది. ఒక్కసారి వీటిని ఇన్‌స్టాల్‌ చేసి లోకల్‌ నెట్‌వర్క్‌కు కనెక్ట్‌ చేస్తే ఇవి సమాచార సేకరణను ప్రారంభిస్తాయి. సున్నితమైన డేటా, మేధోసంపత్తి చౌర్యం మొదలుపెడతాయి. ఐ-సూన్‌ సంస్థ నెట్‌వర్క్‌ను భారత్‌పై సైబర్‌ గూఢచర్యం కోసం చైనా నియమించుకొంది. 

మన ప్రభుత్వ కార్యాలయాలను హ్యాక్‌ చేసిందా..?

భారత్‌లోని పలు ప్రభుత్వ కార్యాలయాలను, మంత్రిత్వ శాఖలను, వ్యాపార సంస్థలను ఇది లక్ష్యంగా చేసుకొన్నట్లు లీకైన పత్రాలు వెల్లడిస్తున్నాయి. రోజువారీ ఆఫీసుల్లో వినియోగించే పవర్‌ బ్యాంక్‌లు, యూఎస్‌బీ పోర్టులు, ఇంటర్నెట్‌ రౌటర్లలో మార్పులు చేసి వైఫై ప్రాక్సిమిటీ అటాక్‌ సిస్టమ్‌ వంటి కోవర్ట్‌ ఎలక్ట్రానిక్‌ పరికరాలను వినియోగించినట్లు తేలింది. ఫలితంగా వైఫైకు కనెక్ట్‌ అయ్యే ఆండ్రాయిడ్‌ ఫోన్లపై ట్రోజన్‌ హార్స్‌లు, మాల్‌వేర్‌లు దాడి చేసేందుకు వీలు లభిస్తుంది. ఒక్కసారి ఈ పరికరాల ద్వారా చొరబడిన మాల్‌వేర్‌ వ్యక్తిగత డేటా, కాంటాక్ట్‌ నంబర్లు, ఫొటోలు, వీడియోలను దోచేస్తుంది. 

భారత్‌-బ్రిటన్‌ సముద్రగర్భ కమ్యూనికేషన్‌ కేబుల్‌పై హూతీల దాడి..!

అంతేకాదు.. ఎటువంటి అనుమానం రాకుండా డేటాను చోరీ చేయడం ఎలా అనే అంశాలను కూడా ఈ పత్రాల్లో వెల్లడించింది. ఇందుకోసం ఎక్స్‌ ఖాతాలను వాడటం, ఈమెయిల్స్‌, కస్టమ్‌ ర్యాట్స్‌ వినియోగం వంటివి చేస్తున్నాయి. ఔట్‌లుక్‌ ఈమెయిల్‌ ఖాతాలను హ్యాక్ చేయడానికి, ఐఫోన్‌ నుంచి డేటా, లొకేషన్లను సంపాదించడానికి అవసరమైన టెక్నిక్స్‌ ఐ-సూన్‌ వద్ద ఉన్నాయి. భారత్‌, యూకే, తైవాన్‌, మలేషియా సహా మొత్తం 20 దేశాల ప్రభుత్వాలను ఈ సంస్థ లక్ష్యంగా చేసుకున్నట్లు ఇటీవల తేలింది. ఈ పత్రాలు ఎలా లీక్‌ అయ్యాయన్న దానిపై ప్రస్తుతం చైనా పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ‘‘ఐసూన్‌ హ్యాకర్లు విదేశాల్లోని 80 టార్గెట్ల నుంచి డేటాను తస్కరించినట్లు ఆ పత్రాల్లో ఉంది. భారత్‌ నుంచి 95.2 గిగాబైట్ల ఇమిగ్రేషన్‌ డేటాను సేకరించారు. దక్షిణ కొరియా టెలికాం ప్రొవైడర్‌ నుంచి 3 టెరాబైట్ల కాల్‌ లాగ్స్‌ సమాచారాన్ని దొంగిలించారు’’ అని ఇటీవల వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనం వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని