Nikki Haley: భారత్‌ చాలా స్మార్ట్‌గా వ్యవహరిస్తోంది: నిక్కీ హేలీ

Nikki Haley: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల్లో భారత్‌ చాలా తెలివిగా వ్యవహరిస్తోందని రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న నిక్కీ హేలీ అన్నారు.

Published : 08 Feb 2024 08:08 IST

వాషింగ్టన్‌: రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న నిక్కీ హేలీ (Nikki Haley) భారత్‌పై బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా (USA)కు భారత్‌ భాగస్వామిగా ఉండాలనుకుంటుందన్నారు. కానీ, ఇప్పటికైతే అగ్రరాజ్యం పెద్దన్న పాత్ర పోషించటంపై మాత్రం వారికి విశ్వాసం లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల మధ్య భారత్‌ చాలా తెలివిగా వ్యవహరిస్తోందన్నారు. అందుకే రష్యాకు సన్నిహితంగా ఉంటూ వస్తోందని ఫాక్స్ బిజినెస్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

‘‘నేను అమెరికా (USA) తరఫున భారత వ్యవహారాలనూ చూశాను. ప్రధాని మోదీతో మాట్లాడాను. వారు రష్యాతో కాకుండా అమెరికాతో భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నారు. కానీ, ప్రస్తుతం వారికి మన నేతృత్వంపై నమ్మకం లేదు. మనం చాలా బలహీనంగా ఉన్నామనుకుంటున్నారు. భారత్‌ చాలా స్మార్ట్‌గా వ్యవహరిస్తోంది. అందుకే వారికి భారీ ఎత్తున సైనిక ఆయుధాలను అందించే రష్యాకు సన్నిహితంగా ఉంటూ వస్తోంది’’ అని హేలీ (Nikki Haley) అన్నారు.

అమెరికా ప్రస్తుతం మధ్యప్రాచ్య దేశాలపైనే అధికంగా దృష్టి సారిస్తోందని హేలీ చెప్పారు. అలా కాకుండా ఇతర భాగస్వాములతోనూ సత్సంబంధాలను నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే అమెరికాతో మిత్రదేశాలైన భారత్‌, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌, జపాన్‌, దక్షిణకొరియా, న్యూజిలాండ్‌ కలిసి వస్తాయని వివరించారు.ప్రస్తుతం చైనా ఆర్థిక పరిస్థితి బాగోలేదని హేలీ (Nikki Haley) అన్నారు. రానురానూ అక్కడి ప్రభుత్వం మరింత నియంతృత్వంగా మారుతోందని విమర్శించారు. గతకొన్నేళ్లుగా వారు అమెరికాతో యుద్ధానికి సన్నద్ధమవుతున్నారని.. అది వారి తప్పిదమని వ్యాఖ్యానించారు.

నెవడా రాష్ట్రంలో రిపబ్లికన్‌ ప్రైమరీలో నిక్కీ హేలీ మంగళవారం ఓటమి చవిచూశారు. రేసులో ఆమె కంటే ముందున్న డోనాల్డ్‌ ట్రంప్‌ దీంట్లో పోటీచేయలేదు. బ్యాలట్‌ పత్రంలో అభ్యర్థుల పేర్లతో పాటు నోటా తరహాలో ‘ఈ అభ్యర్థులెవరూ కారు’ అనే కాలమ్‌ను ఉంచారు. హేలీకి 31 శాతం ఓట్లు రాగా, నోటాకు 63 శాతం వచ్చాయి. నెవడాలో 1975లో నోటాను ప్రవేశపెట్టిన తరవాత ఓటమి చవిచూసిన అభ్యర్థి హేలీయే. ఆమె స్వరాష్ట్రం దక్షిణ కరోలినాలో ఈ నెల 24న ప్రైమరీ ఎన్నికలు జరుగుతాయి. అందులో ట్రంప్‌, హేలీలు పోటీపడనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని