Biden-Jinping: త్వరలో బైడెన్‌-జిన్‌పింగ్‌ భేటీ.. ఇజ్రాయెల్‌-హమాస్‌ పోరు తర్వాత తొలిసారి..!

Biden-Jinping: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ త్వరలో ముఖాముఖిగా భేటీ కానున్నారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్‌ ధ్రువీకరించింది.

Updated : 01 Nov 2023 11:21 IST

వాషింగ్టన్‌: అమెరికా (USA), చైనా (China) మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఈ నెలాఖరులో అగ్రరాజ్య అధినేత జో బైడెన్‌ (Joe Biden).. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ (Xi Jinping) సమావేశం కానున్నారు. ఈ భేటీని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ ధ్రువీకరించింది. కాగా.. ఇజ్రాయెల్-హమాస్‌ పోరు నేపథ్యంలో ఈ దేశాధినేతల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

నవంబరు చివర్లో శాన్‌ఫ్రాన్సిస్కో వేదికగా ఆసియా-పసిఫిక్‌ ఆర్థిక సహకార మండలి (APEC) శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ సదస్సులో భాగంగానే బైడెన్‌, జిన్‌పింగ్‌ భేటీ జరగనున్నట్లు శ్వేతసౌధం మీడియా కార్యదర్శి జీన్‌ పెర్రీ వెల్లడించారు. ‘‘జిన్‌పింగ్‌తో భేటీ కోసం తాను ఎదురుచూస్తున్నట్లు బైడెన్ తెలిపారు’’ అని పెర్రీ పేర్కొన్నారు. అయితే వీరిద్దరి మధ్య ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం అంశం చర్చకు వస్తుందా? లేదా అన్నదానిపై వైట్‌హౌస్‌ స్పష్టతనివ్వలేదు.

ఉద్రిక్త పరిస్థితుల వేళ.. చేతులు కలిపిన బైడెన్‌, జిన్‌పింగ్‌

ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌కు అమెరికా పూర్తి మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల బైడెన్‌.. టెల్‌ అవీవ్‌కు వెళ్లి ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుతో సమావేశమయ్యారు. మరోవైపు.. డ్రాగన్‌ పాలస్తీనీయులకు మద్దతుగా వ్యాఖ్యలు చేసింది. ‘‘ఇజ్రాయెల్‌కు తమ దేశాన్ని రక్షించుకునే హక్కు ఉంది. కానీ, అది అంతర్జాతీయ మానవతా చట్టాల పరిధికి లోబడి మాత్రమే ఉండాలి’’ చైనా ఇజ్రాయెల్‌కు సూచించింది. అంతేగాక, పాలస్తీనాను స్వతంత్ర దేశంగా మార్చడమే.. ఈ యుద్ధానికి ఏకైక పరిష్కారమని ఇటీవల డ్రాగన్‌ పునరుద్ఘాటించింది.

మోదీకి ఆహ్వానం..

మరోవైపు, శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగే అపెక్‌ సదస్సుకు భారత ప్రధాని నరేంద్రమోదీ (Modi)ని కూడా బైడెన్‌ ఆహ్వానించారు. అయితే, ఈ సదస్సుకు మోదీ స్థానంలో కేబినెట్ స్థాయి మంత్రి హాజరయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు