Kim Jong Un: ప్రజలు ఆత్మహత్య చేసుకొంటే మీరే బాధ్యులు : అధికారులకు కిమ్‌ ఆదేశాలు

ఉత్తరకొరియాలో ఆత్మహత్యలపై ఆ దేశాధినేత కిమ్‌ స్పందంచారు. వీటిని అడ్డుకోవాలని అధికారులకు హుకుం జారీ చేశారు. లేకపోతే చర్యలు తప్పవని పేర్కొన్నారు. 

Updated : 13 Jun 2023 16:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలోని ఆత్మహత్యలను అడ్డుకోవాలని ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ స్థానిక అధికారులను ఆదేశించారు. అక్కడ ఇటీవల కాలంలో ఆత్మహత్యల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్‌ లెక్కల ప్రకారం గతేడాదితో పోలిస్తే ఉత్తరకొరియాలో 40శాతం ఆత్మహత్యలు పెరిగాయి. ఈ నేపథ్యంలో కిమ్‌ దేశంలో ఆత్మహత్యలను సోషలిజానికి వ్యతిరేకంగా చేసే రాజద్రోహంగా అభివర్ణించారు. తమ పరిధిలోని వారు ఆత్మహత్యలకు పాల్పడకుండా అడ్డుకోవడంలో విఫలమైతే స్థానిక అధికారులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని కిమ్‌ పేర్కొన్నారు. 

ఉత్తరకొరియా ఈశాన్య ప్రాంతంలో హామ్‌యాంగ్‌ ప్రాంతానికి చెందిన ఓ అధికారి రేడియో ఫ్రీ ఆసియా (ఆర్‌ఎఫ్‌ఎఏ) సంస్థతో మాట్లాడుతూ ప్రతి ప్రావిన్స్‌ పార్టీ మీటింగ్‌లో వివిధ శ్రేణి నాయకులకు కిమ్‌ ఆదేశాలను తెలియజేస్తున్నారని వెల్లడించాడు. దీంతోపాటు ఆయా ప్రాంతాల్లో ఆత్మహత్యలు చేసుకొన్న వారి వివరాలు కూడా వెల్లడిస్తున్నారని పేర్కొన్నారు. ఈ వివరాలు తెలుసుకొని మీటింగ్‌కు హాజరైన వారు కూడా షాక్‌కు గురయ్యారని పేర్కొన్నారు. ఇక ర్యాంగాంగ్‌ ప్రావిన్స్‌లో ఆకలి చావుల కంటే ఆత్మహత్యలు పెరిగిపోయాయి. కిమ్‌ అదేశాలైతే జారీ చేశారు. కానీ, ఎలా అడ్డుకోవాలనే ప్రణాళికలు మాత్రం అధికారుల వద్ద లేవని ఆర్‌ఎఫ్‌ఏ పేర్కొంది. ఉత్తరకొరియాలో అత్యధిక మంది పేదరికం, ఆకలి కారణంగానే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని