కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు

చైనాలో వెలుగుచూసి ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్‌ సీక్వెన్స్‌ను తొలిసారి ప్రచురించిన శాస్త్రవేత్త ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నారు.

Updated : 01 May 2024 06:51 IST

ప్రయోగశాల వెలుపల నిరసనకు దిగిన జాంగ్‌ యోంగ్‌జెన్‌

షాంఘై: చైనాలో వెలుగుచూసి ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్‌ సీక్వెన్స్‌ను తొలిసారి ప్రచురించిన శాస్త్రవేత్త ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నారు. కొంతకాలంగా ఆ దేశ అధికారుల నుంచి వేధింపులను ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆయన పనిచేస్తున్న ప్రయోగశాల నుంచి వెళ్లిపోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. దాంతో అదే ప్రయోగశాల ఎదుట ఆయన నిరసనకు దిగారు. తనతోపాటు తన బృందాన్ని కూడా ప్రయోగశాల నుంచి బయటకు వెళ్లాలని అధికారులు ఆదేశించారని పేర్కొంటూ వైరాలజిస్టు జాంగ్‌ యోంగ్‌జెన్‌ సోమవారం సోషల్‌ మీడియా వేదిక ‘వేబో’లో పోస్టు చేశారు. వర్షం కురుస్తున్నా ఆదివారం నుంచి ప్రయోగశాల వెలుపల కూర్చొని నిరసన చేపట్టినట్లు అందులో పేర్కొన్నారు. అనంతరం ఆ పోస్టును ఆయన తొలగించినప్పటికీ.. కార్యాలయం బయటే ఆందోళన కొనసాగిస్తున్నట్లు తెలిసింది. దీనిపై స్పందించాలని మీడియా కోరగా.. మాట్లాడేందుకు అనువైన పరిస్థితులు లేవని జాంగ్‌ యోంగ్‌జెన్‌ బదులిచ్చారు. జనవరి 2020లో కొవిడ్‌-19కు కారణమైన వైరస్‌ సీక్వెన్స్‌ను ప్రచురించిన తొలి చైనా శాస్త్రవేత్తగా జాంగ్‌ నిలిచారు. నాటి నుంచి ఆయనపై వేధింపులు మొదలైనట్లు సమాచారం. డిమోషన్లతోపాటు పలు కార్యక్రమాల్లో బహిష్కరణలు వంటివి ఎదుర్కొంటున్న క్రమంలోనే తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని