కోర్టు ధిక్కరణకు పాల్పడిన ట్రంప్‌.. 9వేల డాలర్ల జరిమానా

అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ నేత డొనాల్డ్‌ ట్రంప్‌నకు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాగ్‌ ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించి కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడ్డారని న్యూయార్క్‌ కోర్టు జడ్జి మంగళవారం నిర్ధారించారు.

Updated : 01 May 2024 05:21 IST

గాగ్‌ ఉత్తర్వులు మళ్లీ ఉల్లంఘిస్తే జైలుకే
రిపబ్లికన్‌ నేతకు న్యూయార్క్‌ జడ్జి హెచ్చరిక

న్యూయార్క్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ నేత డొనాల్డ్‌ ట్రంప్‌నకు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాగ్‌ ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించి కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడ్డారని న్యూయార్క్‌ కోర్టు జడ్జి మంగళవారం నిర్ధారించారు. దీనికి గాను 9వేల డాలర్ల జరిమానా విధిస్తున్నట్లు జడ్జి వాన్‌ మర్చెన్‌ తీర్పులో స్పష్టం చేశారు. మరోసారి ఉల్లంఘనకు పాల్పడితే జైలుకు పంపిస్తామని గట్టిగా హెచ్చరించారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో తనకు వ్యతిరేకంగా వార్తా కథనాలు వెలువడకుండా అడ్డుకోవడానికి ట్రంప్‌ అడ్డదారులు తొక్కారనే(హష్‌ మనీ) ఆరోపణలపై విచారణ జరుగుతున్న క్రమంలోనే ఈ తీర్పు వెలువడింది. హష్‌ మనీ కేసులో సాక్షులు, న్యాయమూర్తులు, ఇతరులను ట్రంప్‌ బహిరంగంగా విమర్శిస్తుండడంతో వారిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దంటూ జడ్జి గాగ్‌ ఆర్డర్‌ జారీ చేశారు. అయితే, ట్రంప్‌ దీనిని ఉల్లంఘించడం ద్వారా మొత్తం 10 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ప్రాసిక్యూషన్‌ వాదించింది. తొమ్మిది సందర్భాల్లో ట్రంప్‌ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డాడని తేల్చిన న్యాయస్థానం 9వేల డాలర్ల జరిమానా విధించింది. శుక్రవారం లోగా ఆ మొత్తాన్ని ట్రంప్‌ చెల్లించాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా...ట్రంప్‌ తన సామాజిక మాధ్యమం ‘ట్రూత్‌ సోషల్‌ అకౌంట్‌’లో ఉంచిన ఏడు వివాదాస్పద పోస్టులను వెంటనే తొలగించాలని ఆదేశించింది. మరికొన్ని కోర్టు ఉల్లంఘన ఆరోపణలపై జడ్జి వాన్‌ మర్చెన్‌ గురువారం విచారణ కొనసాగించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని