Israel: మాటలకందని విషాదమే.. రఫాలో ఇజ్రాయెల్‌ దాడులపై ఐరాస ఆందోళన

Israel: రఫాపై దాడులకు ఇజ్రాయెల్‌ సిద్ధమవుతున్న వేళ దాని పరిణామాలపై ఐరాస తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎలాగైనా దీన్ని ఆపేందుకు కృషి చేయాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది.

Published : 01 May 2024 07:54 IST

ఐరాస: గాజాలోని రఫా ప్రాంతంపై దాడికి ఇజ్రాయెల్‌ (Israel) సిద్ధంగా ఉందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. ఇది తీవ్ర విషాదానికి దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. గాజాలోకి మానవతా సాయాన్ని అనుమతిస్తున్న ఇజ్రాయెల్‌.. రఫాపై దాడిని దానితో సమర్థించుకోవద్దని సూచించింది.

కాల్పుల విరమణపై ఈజిప్టు రాజధాని కైరోలో ఒప్పందంతో నిమిత్తం లేకుండా రఫాపై దండయాత్ర ఖాయమని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu) స్పష్టం చేశారు. అక్కడ ఉన్న హమాస్‌ బెటాలియన్లను నాశనం చేసేవరకు తాము విశ్రమించబోమని అన్నారు. ఈ యుద్ధంలో సంపూర్ణ విజయమే తమ అంతిమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది.

చేయగలిగిందంతా చేయండి..

ఈ యుద్ధాన్ని ఆపేందుకు ప్రపంచ దేశాలు కృషి చేయాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ విజ్ఞప్తి చేశారు. ఇజ్రాయెల్‌ను (Israel) ప్రభావితం చేయగల దేశాలు ఈ విషయంలో చేయగలిగిందంతా చేయాలని కోరారు. దాదాపు 12 లక్షల మంది పాలస్తీనియన్లు రఫాలో తలదాచుకున్నారని తెలిపారు. ‘‘రఫాపై భూతల దాడులకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో సంయమనం పాటించాలని ఇజ్రాయెల్‌కు ప్రపంచ దేశాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఆ ప్రాంతంపై ఆపరేషన్‌ మాటల్లో చెప్పలేని విషాదాన్ని మిగిలిస్తుంది’’ అని ఐరాస మానవతా సాయ విభాగం చీఫ్‌ మార్టిన్‌ గ్రిఫిత్ వాపోయారు.

హమాస్‌ నాశనమే మా లక్ష్యం:ఇజ్రాయెల్‌

సాయాన్ని సాకుగా చూపొద్దు..

గాజాలో లక్షలాది మంది ఆకలితో అలమటిస్తున్నారని గుటెరస్‌ పునరుద్ఘాటించారు. వాళ్లకు మానవతా సాయాన్ని చేరవేసే విషయంలో పురోగతి కనిపిస్తోందని చెప్పారు. అందుకు ఇజ్రాయెల్‌ నుంచి సహకారం లభిస్తోందని చెప్పారు. కానీ, దీన్ని సాకుగా చూపి రఫాపై దాడులను సమర్థించుకునే ప్రయత్నం చేయొద్దని సూచించారు. అలాగే సాయం అందిస్తున్న సంస్థలు, కేంద్రాలు, సిబ్బందిని లక్ష్యంగా చేసుకోవద్దని కోరారు.

మరింత దయనీయ పరిస్థితులు..

మే నాటికి ఉత్తర గాజాలో (Gaza) దుర్భిక్ష పరిస్థితులు తప్పవని మార్చిలో ఐరాస నివేదిక ఒకటి హెచ్చరించింది. జులై నాటికి అది మొత్తం గాజాకు విస్తరిస్తుందని తెలిపింది. ఉత్తర ప్రాంతంలో ఇప్పటికే ఆకలి, వ్యాధులతో మరణిస్తున్నారని గుటెరస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘోరాన్ని నిలువరించేందుకు ఇజ్రాయెల్‌పై అమెరికా ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఇజ్రాయెల్‌, హమాస్‌ వెంటనే ఒక ఒప్పందానికి రావాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే గాజాతో పాటు ప్రాంతీయంగా పరిస్థితులు మరింత దయనీయంగా మారుతాయని హెచ్చరించారు. గాజాలోకి మానవతా సాయాన్ని పెంచడంపై నెతన్యాహుతో బుధవారం చర్చిస్తానని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని