హమాస్‌ నాశనమే మా లక్ష్యం: ఇజ్రాయెల్‌

కాల్పుల విరమణపై ఈజిప్టు రాజధాని కైరోలో కీలక చర్చలు ప్రారంభమవుతున్న వేళ, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు.

Published : 01 May 2024 04:52 IST

జెరూసలెం: కాల్పుల విరమణపై ఈజిప్టు రాజధాని కైరోలో కీలక చర్చలు ప్రారంభమవుతున్న వేళ, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. కైరోలో ఒప్పందం కుదిరినా, కుదరకపోయినా రఫాపై దండయాత్ర ఖాయమని స్పష్టం చేశారు. అక్కడ ఉన్న హమాస్‌ బెటాలియన్లను నాశనం చేసేవరకు తాము విశ్రమించబోమని అన్నారు. ఈ యుద్ధంలో సంపూర్ణ విజయమే తమ అంతిమ లక్ష్యమని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణపై చర్చలు జరిపేందుకు మంగళవారం హమాస్‌ అధికారిక బృందం కైరోకు బయల్దేరింది. ఇందులో సీనియర్‌ హమాస్‌ అధికారి ఖలీల్‌ అల్‌ హయ్యా ఉన్నారు. చర్చలకు అమెరికా, ఈజిప్టు, ఖతార్‌ దేశాలు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నాయి. ఒప్పందం వివరాలు బయటికి వెల్లడి కాలేదు. 40 మంది బందీలను విడుదల చేయాలన్న డిమాండు నుంచి వెనక్కి తగ్గి 33 మందిని విడిచిపెట్టినా సరిపోతుందని ఇజ్రాయెల్‌ పేర్కొన్నట్లు తెలుస్తోంది. హమాస్‌ చెరలో 100 మందికి పైగా బందీలు ఉన్నారు. మరోవైపు గత 24 గంటల్లో ఇజ్రాయెల్‌ దాడిలో 47 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారని, 61 మందికి గాయాలయ్యాయని మంగళవారం గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో ఈ ఏడు నెలల యుద్ధంలో మృతుల సంఖ్య 34,536కి చేరుకుందని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని