King Charles-3: ఆస్పత్రిలో చేరిన కింగ్‌ ఛార్లెస్‌-3.. వారం తర్వాత సర్జరీ

Buckingham Palace| బ్రిటన్‌ రాజు ఛార్లెస్-3 ఆస్పత్రిలో చేరినట్లు బకింగ్‌హామ్‌ ప్యాలస్‌ ప్రకటన విడుదల చేసింది. వారం రోజుల తర్వాత వైద్యులు ఆయనకు ప్రొస్టేట్‌ గ్రంథి శస్త్రచికిత్స నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

Updated : 26 Jan 2024 20:47 IST

లండన్‌: బ్రిటన్‌ రాజు ఛార్లెస్-3 (King Charles-III )ఆసుపత్రిలో చేరినట్లు బకింగ్‌హామ్‌ ప్యాలస్‌ ప్రకటన విడుదల చేసింది. వారం రోజుల తర్వాత వైద్యులు ఆయన ప్రొస్టేట్‌ గ్రంథికి శస్త్రచికిత్స (Prostate Surgery) నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ‘‘ శుక్రవారం ఉదయం కింగ్‌ ఛార్లెస్‌-3 ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెంది, కోలుకోవాలని ఆకాంక్షించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమస్య ప్రజారోగ్యంపై తనకు అవగాహన కలిగిస్తుందన్నారు’’ అని ప్యాలస్‌ ప్రకటనలో పేర్కొంది.

75 ఏళ్ల కింగ్‌ ఛార్లెస్‌-3కి ప్రొస్టేట్‌గ్రంథి సమస్య ఉందని, అయితే అది అంత ప్రమాదకరమైనదేమీ కాదని గతవారం రాయల్‌ ఫ్యామిలీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. అంతకు ముందురోజే వేల్స్‌ యువరాణి కేథరిన్‌ పొత్తికడుపు శస్త్రచికిత్స చేసుకున్నట్లు ప్యాలస్‌ వెల్లడించింది. దీంతో రాజకుటుంబంలో వరుసగా ఆరోగ్య సమస్యలు తలెత్తడం చర్చనీయాంశమైంది. తాజాగా ఛార్లెస్‌-3 కూడా కేథరిన్‌కు శస్త్రచికిత్స జరిగిన ఆసుపత్రిలోనే చేరినట్లు బ్రిటన్‌ మీడియా పేర్కొంది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు కొనసాగుతున్నాయని తెలిపింది.

ఏంటీ సమస్య?

పురుషుల్లో మాత్రమే ప్రొస్టేట్‌ గ్రంథి ఉంటుంది. దీని పరిమాణం వయసుతో పాటు పెరుగుతుంది. దీనివల్ల మూత్ర విసర్జన సమయంలో సమస్య ఎదురవుతుంది. మూత్రం సాఫీగా రాకపోవటం, ధార తగ్గటం, ఆగకపోవటం, లీకవటం, మూత్రం పోసినా లోపల ఇంకా ఉందని అనిపించటం, తరచూ.. రాత్రిపూట ఎక్కువసార్లు మూత్రం పోయాల్సి వస్తుండటం లాంటి సమస్యలు ఎదురవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని