King Charles III: కింగ్‌ ఛార్లెస్‌-3కి అనూహ్య అనుభవం

యూనివర్సిటీ క్యాంపస్‌ వార్షికోత్సవానికి వెళ్లిన కింగ్‌ ఛార్లెస్‌-3కి అనూహ్య అనుభవం ఎదురైంది. ప్రిన్స్‌ హ్యారీని తిరిగి బ్రిటన్‌కు రప్పించాలంటూ ఓ విద్యార్థి ఆయన్ను అడిగాడు.

Published : 07 Jan 2024 18:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌-3కు (King Charles III) అనూహ్య అనుభవం ఎదురైంది. చిన్న కొడుకు ప్రిన్స్‌ హ్యారీ (Prince Harry), ఆయన భార్య మేఘన్‌ మార్కెల్‌ తిరిగి ప్యాలెస్‌కు వస్తారా?అని కొందరు విద్యార్థులు ఆయన్ని ప్రశ్నించారు. దీంతో ఒకింత అసౌకర్యానికి గురైన ఛార్లెస్‌-3 ‘అదే జరిగితే మంచిదే’ అంటూ బదులిచ్చారు. యూనివర్సిటీ ఆఫ్‌ ఈస్ట్‌ లండన్‌ స్ట్రాన్‌ఫోర్డ్‌ క్యాంపస్‌ 125వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులతో కరచాలనం చేస్తూ ముందుకు వెళ్తుండగా.. ఓ విద్యార్థి ‘దయచేసి హ్యారీని వెనక్కి తీసుకురాగలరా’ అంటూ గట్టిగా అరిచాడు. ఆ మాటలు తొలుత ఛార్లెస్‌కు సరిగ్గా వినిపించలేదు. ‘ఎవరు?’ అంటూ మళ్లీ అడిగారు.  ‘హ్యారీ.. మీ కుమారుడు’ అంటూ అవతలి విద్యార్థి బదులిచ్చాడు. ఈ ప్రశ్నతో ఒకింత ఇబ్బందికి గురైన కింగ్‌.. అలా జరిగితే మంచిదే అంటూ ముందుకు సాగిపోయారు.

2020లో ప్రిన్స్‌ హ్యారీ, మార్కెల్‌ రాచరిక హోదాను వదులుకున్న సంగతి తెలిసిందే. కుటుంబంలో చోటు చేసుకున్న విభేదాలతో వారు రాజభవనానికి దూరంగా తమ ఇద్దరి పిల్లలతో కలిసి అమెరికాలోని కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్నారు. 2022లో క్వీన్‌ ఎలిజబెత్‌ అంత్యక్రియలకు హాజరైనప్పుడు కూడా హ్యారీ.. వివాదంలో చిక్కుకున్నారు. రాజుకు గౌరవ సూచకంగా బ్రిటిషర్లు ఆలపించే ‘గాడ్‌ సేవ్‌ ది కింగ్‌’ జాతీయ గీతాన్ని హ్యారీ పాడలేదని కొందరు, మధ్యలోనే ఆపేశారని మరికొందరు ఆరోపించారు. ఆ తర్వాత వెస్ట్‌మినిస్టర్ అబేలో అట్టహాసంగా నిర్వహించిన కింగ్‌ ఛార్లెస్‌ పట్టాభిషేక కార్యక్రమంలోనూ హ్యారీ పాల్గొన్నారు. ఈ వేడుకలో తన కజిన్స్‌తో కలిసి నడిచిన హ్యారీ నవ్వుతూ కనిపించారు. అయితే ఈ కార్యక్రమానికి హ్యారీ ఒంటరిగానే వచ్చారు. అప్పుడు భార్య మేఘన్‌ మార్కెల్‌, ఆయన ఇద్దరు పిల్లలు అమెరికాలోనే ఉండిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని