Nikki Haley: ఆయన మానసికస్థితి సరిగా లేదు.. ట్రంప్‌పై నిక్కీ హేలీ విమర్శలు

డొనాల్డ్‌ ట్రంప్‌ మానసికస్థితి సరిగా లేదని, వయో భారంతో అధ్యక్ష పదవిని ఆయన సమర్థవంతంగా నిర్వహించలేరని నిక్కీ హేలీ ఆరోపించారు.

Updated : 21 Jan 2024 12:35 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న భారతీయ అమెరికన్‌ నిక్కీ హేలీ (Nikki Haley) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)పై ఎదురు దాడికి దిగారు. ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదని, వయో భారంతో అధ్యక్ష బాధ్యతలను నిర్వహించలేరని విమర్శించారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమెపై ట్రంప్ పరుష వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యక్ష పదవికీ ఆమె తగదంటూ, అమెరికా ‘క్యాపిటల్‌ హిల్‌’ భవనంపై జరిగిన దాడిని అడ్డుకోవడంలో విఫలమయ్యారని ఆరోపించారు. 

నిక్కీ హేలీని అమెరికా ప్రతినిధుల సభ మాజీ స్పీకర్‌ నాన్సీ పెలోసీగా ట్రంప్‌ పొరబడ్డారు. ఈ క్రమంలో పరుషంగా మాట్లాడారు. వీటికి స్పందించిన హేలీ.. ఆయన మానసికస్థితి సరిగా లేదని విమర్శించారు. ‘‘గత రాత్రి ఎన్నికల ర్యాలీలో ట్రంప్‌ నా పేరును పదే పదే ప్రస్తావించారు. క్యాపిటల్‌ భవనంపై దాడి సమయంలో సరైన భద్రతా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. వాస్తవానికి జనవరి 6న నేను వాషింగ్టన్‌లో లేను. దేశం, ప్రపంచంలో పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు 80 ఏళ్ల నిండిన వ్యక్తులు (బైడెన్‌, ట్రంప్‌ను ఉద్దేశించి) అధ్యక్షులుగా మనకు అవసరమా? ట్రంప్‌ గురించి నాకు బాగా తెలుసు. ఆయన అభద్రతా భావానికి గురైనప్పుడే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు’’ అని నిక్కీ విమర్శించారు. ఆయనకు ప్రపంచంలోని (చైనా, రష్యా, ఉత్తర కొరియా అధ్యక్షుల పేర్లు పరోక్షంగా ప్రస్తావిస్తూ) నియంతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.

నిక్కీ హేలీపై ట్రంప్‌ నోటిదురుసు

రిపబ్లికన్‌ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న అంతర్గత ఎన్నికల్లో ట్రంప్‌ ముందంజలో ఉన్నారు. తర్వాతి స్థానంలో నిక్కీ కొనసాగుతున్నారు. తాజా సర్వేల ప్రకారం వీరిద్దరి మధ్య వ్యత్యాసం కేవలం 10 శాతం మాత్రమేనని తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని