Nikki Haley: నిక్కీ హేలీకి తొలి విజయం.. డీసీ ప్రైమరీలో ట్రంప్‌పై గెలుపు

Nikki Haley: రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో దూసుకుపోతున్న ట్రంప్‌నకు బ్రేక్‌ పడింది. డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా ప్రైమరీలో ఆయనపై నిక్కి హేలీ గెలుపొందారు.

Updated : 04 Mar 2024 09:37 IST

వాషింగ్టన్‌: అమెరికాలో రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న భారత సంతతి నాయకురాలు నిక్కీ హేలీ (Nikki Haley) ఎట్టకేలకు తొలి విజయం సొంతం చేసుకున్నారు. డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా (DC) ప్రైమరీ ఎన్నికల్లో ఆదివారం ఆమె గెలుపొందారు. దీంతో రేసులో దూసుకుపోతున్న డొనాల్డ్‌ ట్రంప్‌ (Trump) విజయ పరంపరకు బ్రేక్‌ పడ్డట్లయింది. అయితే, ఆయన్ను అధిగమించడానికి వచ్చే మంగళవారం జరగనున్న పలు ప్రైమరీల్లో నిక్కీ భారీ గెలుపు నమోదు చేయాల్సి ఉంటుంది.

సొంత రాష్ట్రమైన దక్షిణ కరోలినాలోనూ నిక్కీ ఓడిపోయిన విషయం తెలిసిందే. అయినప్పటికీ రేసు నుంచి వైదొలగడానికి నిరాకరించారు. ఓవైపు ట్రంప్ (Donald Trump) ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ.. ఆయనకు ప్రత్యామ్నాయం తానేనంటూ నిక్కీ ప్రచారం చేస్తున్నారు. డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా డెమోక్రాట్లకు కంచుకోట. అక్కడ నమోదిత రిపబ్లికన్ల సంఖ్య 23,000 మాత్రమే. 2020లో అధ్యక్షుడు జో బైడెన్‌ తమ పార్టీ ప్రైమరీలో 92 శాతం ఓట్లు పొందారు.

పాక్‌ ప్రధానిగా షెహబాజ్‌

మరోవైపు ట్రంప్‌ (Donald Trump) శనివారం మిసోరి, మిషిగన్‌, ఐడహో ప్రైమరీల్లోనూ నిక్కీపై (Nikki Haley) ఘన విజయం సాధించారు. ఆయన నెగ్గిన ప్రతినిధుల సంఖ్య 244కు చేరుకుంది. హేలీ ఖాతాలో 24 మంది మాత్రమే ఉన్నారు. నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా నిలవాలంటే 1,215 మంది ప్రతినిధులను సొంతం చేసుకోవాలి. ప్రస్తుతం ట్రంప్‌ దూకుడు చూస్తుంటే ఈ సంఖ్యను ఆయన మంగళవారం జరిగే 15 రాష్ట్రాల ప్రైమరీల్లో సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని