South China Sea: రెండు నౌకలు ఢీ.. దక్షిణ చైనా సముద్రంలో భగ్గుమన్న ఉద్రిక్తతలు..!

దక్షిణ చైనా సముద్రంలో రెండు దేశాలకు చెందిన కోస్ట్‌గార్డ్‌ నౌకలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకటి స్వల్పంగా దెబ్బతింది.

Published : 05 Mar 2024 17:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మంగళవారం ఉదయం ఫిలిప్పీన్స్‌, చైనాకు చెందిన కోస్ట్‌గార్డ్‌ నౌకలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో మనీలాకు చెందినది స్వల్పంగా దెబ్బతింది. దక్షిణ చైనా సముద్రంలోని తమ అధీనంలోని ప్రాంతానికి చేస్తున్న సరఫరాలను అడ్డుకొనేందుకు బీజింగ్‌ యత్నిస్తోందని ఫిలిప్పీన్స్‌ కోస్ట్‌గార్డ్‌ ప్రతినిధి జైటర్రీలా ఆరోపించారు. దీనిలోభాగంగా బీజింగ్‌కు చెందిన భారీ నౌక తమ సరకుల పడవను సెకండ్‌ థామస్‌ షౌల్‌ వద్ద అడ్డుకొందని వెల్లడించారు. దీని సమీపంలో 25 ఏళ్ల నుంచి ఉన్న సియర్రా మాడ్రే వార్‌షిప్‌లో ఫిలిప్పీన్స్‌ సిబ్బంది ఉంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. చైనా నౌకలు జల ఫిరంగులను కూడా ప్రయోగించినట్లు తెలుస్తోంది. 

ఈ వీడియోలో చైనా నౌక అత్యంత సమీపంలోకి రావడంతో ఫిలిప్పీన్స్‌ షిప్‌లోని వారు పరుగులు పెట్టి మధ్యలో అడ్డంగా బోయూను విసురుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరోవైపు చైనా మాత్రం ఈ చర్యలను సమర్థించుకొంది. మనీలా నౌకలు అక్రమంగా తమ జలాల్లోకి ప్రవేశించడంతో వాటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకొన్నట్లు వెల్లడించింది.

సులేమానీపై దాడికి ప్రతీకారం కోసం అమెరికాలోకి ఇరాన్‌ ఏజెంట్లు.. ఎఫ్‌బీఐ వేట..!

ఆగ్నేయాసియా దేశాల సదస్సు రేపు ఆస్ట్రేలియాలో ప్రారంభం కానుంది. దీనిలో పాల్గొనేందుకు ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు మార్కోస్‌ జూనియర్‌ అక్కడికి చేరుకొన్నారు. సదస్సులో దక్షిణ చైనా అంశంపై చర్చించే అవకాశాలున్నాయి. అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో మార్కోస్‌ మాట్లాడుతూ.. తమ సరిహద్దులు కాపాడుకోవడానికి ఏ చర్యకైనా సిద్ధమే అని తెలిపారు. అదే సమయంలో తాము చర్చలు, దౌత్య మార్గాలనే నమ్ముతామని పేర్కొన్నారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే ఇరుదేశాల నౌకలు ఢీకొన్నాయి. 

సెకండ్‌ థామస్‌ షౌల్‌ను ఫిలిప్పీన్స్‌లో అన్యుంగిన్‌గా వ్యవహరిస్తారు. దీనినే చైనా రెనాయ్‌ జియావ్‌గా పిలుస్తుంది. మనీలాకు చెందిన ద్వీపం 200 కి.మీ. దూరంలో ఉండగా.. చైనా ప్రధాన భూభాగంలోని దక్షిణ హెనాన్‌ ఇక్కడినుంచి 1,000 కి.మీ. పైమాటే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని