Vladimir Putin: మోదీని పొగిడిన పుతిన్‌..!

ప్రధాని మోదీని  రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పొగడ్తలతో ముంచెత్తారు. మోదీ కోరిక మేరకు భారత్‌కు ఎరువుల సరఫరాను గణనీయంగా పెంచామని తెలిపారు. 

Updated : 28 Oct 2022 10:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పొగడ్తలతో ముంచెత్తారు. మాస్కోలోని ప్రతిష్ఠాత్మక ‘వాల్‌డై డిస్కషన్‌ క్లబ్‌’ వార్షిక ప్రసంగంలో పుతిన్‌ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ సారథ్యంలో భారత్‌ చాలా పురోగతి సాధించిందన్నారు. ఆయన దేశభక్తుడని పుతిన్‌ అభివర్ణించారు. ‘‘మోదీ నాయకత్వంలో చాలా చేశారు. ఆయన దేశభక్తుడు. ‘మేకిన్‌ ఇండియా’ ఆలోచన ఆర్థికంగా, నైతికంగా చాలా కీలకమైంది. భవిష్యత్తు భారత్‌దే. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయినందుకు భారత్‌ గర్వించాలి’’ అని పుతిన్‌ వ్యాఖ్యానించారు.

బ్రిటన్‌ పాలన నుంచి విముక్తి పొంది అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ ఎదుగుదల ఓ అద్భుతమని పుతిన్‌ తెలిపారు. 1.5 బిలియన్‌ ప్రజలు, అభివృద్ధి కారణంగా ప్రతిఒక్కరూ వారిని గౌరవిస్తారని పేర్కొన్నారు. భారత్ - రష్యా అనుబంధం ప్రత్యేకమని.. భారత్‌తో దశాబ్దాల తరబడి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పుతిన్‌ వివరించారు. రెండు దేశాల మధ్య ఎప్పుడూ ఇబ్బందికరమైన పరిస్థితులు రాలేదని ఆయన వెల్లడించారు. పరస్పరం పూర్తి మద్దతు ఇచ్చుకొంటామని తెలిపారు. అది ఇప్పటికీ కొనసాగుతోందని.. భవిష్యత్తులోనూ ఈ బంధం కొనసాగుతుందని పేర్కొన్నారు. భారత్‌లో వ్యవసాయం కోసం ఎరువుల సరఫరా పెంచాలని మోదీ కోరారని.. దీంతో సరఫరాను 7.6 రెట్లు పెంచామని పుతిన్‌ వివరించారు. వ్యవసాయ రంగంలో వ్యాపారం దాదాపు రెట్టింపైందన్నారు.

పశ్చిమ దేశాలు వాటి చర్యలకు తగిన ప్రతిఫలం అనుభవిస్తాయని పుతిన్‌ హెచ్చరించారు. ప్రపంచ దేశాలు.. ఎదుర్కొంటున్న సమస్యలపైనే సమష్టి ప్రయోజనాల కోసం ఏకమవుతాయని పేర్కొన్నారు. పశ్చిమ దేశాలు వాటి లక్ష్యాలు, విలువలను ప్రపంచంపై రుద్దుతున్నాయని పుతిన్‌ విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని