Age Standardize: దక్షిణ కొరియన్ల వయసు తగ్గనుంది!

దక్షిణ కొరియా(South Korea) పౌరుల వయసు.. ఒకటి, రెండేళ్లు తగ్గనుందా? ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా..! అవును. ఈ దేశంలో వయసు లెక్కింపును ప్రమాణీకరించేందుకు ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురావడమే దీనికి కారణం.

Published : 12 Dec 2022 01:20 IST

సియోల్‌: దక్షిణ కొరియా(South Korea) పౌరుల వయసు.. ఒకటి, రెండేళ్లు తగ్గనుందా? ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా..! అవును. ఈ దేశంలో వయసు లెక్కింపును ప్రమాణీకరించేందుకు ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురావడమే దీనికి కారణం. ప్రస్తుతం దక్షిణ కొరియన్లకు ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు వయసు లెక్కింపు విధానాలు ఉన్నాయి. అంతర్జాతీయ వయసు, కొరియన్‌ వయసు, క్యాలెండర్‌ వయసు.. ఇలా ఒక్కో వ్యక్తికి మూడు వయసులు ఉండటం ఇక్కడ సర్వసాధారణం. ఈ గందరగోళానికి తెరదించేందుకు పార్లమెంట్‌ ఇటీవల ముందుకొచ్చింది. ఈ క్రమంలోనే.. 2023 జూన్‌ నుంచి అంతర్జాతీయ వయసునే ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించింది.

ఏ వయసు ఎలా లెక్కిస్తారంటే..

* అంతర్జాతీయం: దీని ప్రకారం పుట్టినప్పుడు శిశువు వయసు ‘సున్నా’నుంచి మొదలవుతుంది. ఆపై.. వచ్చే ఏడాది అదే తేదీనాటికి ఒకటి చొప్పున లెక్కిస్తారు. ప్రపంచంలోని చాలావరకు దేశాలు ఇదే వ్యవస్థను పాటిస్తాయి.

కొరియన్‌: స్థానికులను వారి వయసు అడిగినప్పుడు.. చాలా మంది అంతర్జాతీయ వయసు కంటే ఒకటి, రెండు ఎక్కువగానే చెబుతారు. కారణం.. అక్కడ శిశువు పుట్టగానే ఒక ఏడాది వయసుగా పరిగణిస్తారు. ఆ తర్వాత ప్రతి జనవరి 1న ఒక్కో ఏడాది జోడిస్తారు.

క్యాలెండర్‌: కొన్ని సందర్భాల్లో దక్షిణ కొరియన్లు క్యాలెండర్ వయసునూ ఉపయోగిస్తారు. ఇది అంతర్జాతీయానికి‌, కొరియన్‌కు మధ్యలో ఉంటుంది. పుట్టినప్పుడు శిశువు వయసు సున్నాగానే ఉంటుంది. అనంతరం.. ప్రతి జనవరి 1న మరో సంవత్సరం కలుపుతారు.

ఉదాహరణ: దక్షిణ కొరియాకు చెందిన ఒక యువకుడు 1994 డిసెంబరు 31న జన్మించాడని అనుకుందాం. ఇంటర్నేషనల్‌ ప్రకారం అతని వయసు ప్రస్తుతం.. 27. అదే.. కొరియన్‌ ప్రకారం.. 29, క్యాలెండర్‌ ప్రకారం.. 28గా ఉంటుంది.

ఈ లెక్కింపు ప్రక్రియ గందరగోళంగా అనిపిస్తోందా! దక్షిణ కొరియాలో మాత్రం ఇది సాధారణమే. పౌరులు తమ రోజువారీ జీవితంలో, సామాజిక అంశాల్లో కొరియన్ వయసును ఉపయోగిస్తారు. చట్టపరమైన, అధికారిక విషయాల్లో అంతర్జాతీయ వయసు నమోదు చేస్తారు. మద్యపానం, ధూమపానం, నిర్బంధ సైనిక శిక్షణ వంటి విషయాల్లో క్యాలెండర్‌ వయసును పరిగణనలోకి తీసుకుంటారు. అయితే, తాజా నిర్ణయం.. అన్ని న్యాయ, పరిపాలనా వ్యవహారాల్లో అంతర్జాతీయ వయసును ప్రామాణికం చేస్తుంది. రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలూ.. పౌరులను ఇదే విధానం పాటించేలా ప్రోత్సహించాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని