Sri Lanka: శ్రీలంకలో ఈస్టర్‌ పేలుళ్ల కేసు.. అనుమానితుడిగా దేశ మాజీ అధ్యక్షుడు..!

ద్వీప దేశం శ్రీలంకలో మూడేళ్ల క్రితం చోటుచేసుకున్న భీకర ఉగ్ర పేలుళ్ల ఘటనలో ఆ దేశ మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనపై అభియోగాలు నమోదయ్యాయి

Published : 17 Sep 2022 01:18 IST

కొలంబో: ద్వీప దేశం శ్రీలంకలో మూడేళ్ల క్రితం చోటుచేసుకున్న భీకర ఉగ్ర పేలుళ్ల ఘటనలో ఆ దేశ మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో కొలంబోలోని మెజిస్ట్రేట్‌ కోర్టు ఆయనను అనమానితుడిగా పేర్కొంది. విచారణ నిమిత్తం అక్టోబరు 14వ తేదీన న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి దాఖలైన రహస్య పత్రాల ఆధారంగా కోర్టు ఈ సమన్లు జారీ చేసింది.

ఈ ఉగ్ర పేలుళ్ల గురించి అప్పటి అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, ప్రధాని రణిల్‌ విక్రమసింఘె నేతృత్వంలోని ప్రభుత్వానికి ముందే సమాచారం ఉన్నప్పటికీ ఘటనను నివారించలేకపోయిందని ప్రెసిడెన్షియల్‌ కమిషన్‌ దర్యాప్తులో తేలింది. ఈ పేలుళ్లపై శ్రీలంక క్యాథలిక్‌ చర్చి ఆర్చ్‌బిషప్‌ మాల్కోమ్‌ రంజిత్‌ ఆ మధ్య సంచలన ఆరోపణలు చేశారు. ‘‘2019లో మూడు చర్చిలు, కొన్ని హోటళ్లులో బాంబులు పెట్టేందుకు సహకరించినవారు ఇప్పటికీ ఇంకా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. పోలీసు అధికారులుగానూ ఉన్నారు’’ అని ఆయన ఆరోపించారు.

ఈ క్రమంలోనే దర్యాప్తు చేపట్టగా.. పలువురు ఉన్నతాధికారులపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ పేలుళ్లపై నిఘా సంస్థల నుంచి ముందస్తు హెచ్చరికలు వచ్చినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గానూ శ్రీలంక మాజీ పోలీసు చీఫ్‌ పూజిత్‌ జయసుందరేపై నేరాభియోగాలు నమోదయ్యాయి. రక్షణశాఖ మాజీ కార్యదర్శిపైనా కేసు నమోదైంది. తాజా అప్పటి దేశాధ్యక్షుడి మైత్రిపాలపైనా కోర్టు అభియోగాలు మోపింది.

2019 ఏప్రిల్‌ 21న ఈస్టర్‌ పండగనాడు లంకలో మూడు చర్చిలో, మూడు లగ్జరీ హోటళ్లలో వరుస పేలుళ్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఐఎస్‌ఐఎస్‌ ముఠాతో సంబంధమున్న నేషనల్‌ తవ్‌హీద్‌ జమాత్‌ అనే స్థానిక ఉగ్రముఠా ఈ దాడికి పాల్పడింది. మొత్తం 9 మంది ఆత్మహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ పేలుళ్లలో 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 500 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని