NATO: నాటోలో చేరికకు స్వీడన్‌కు మార్గం సుగమం.. ఎట్టకేలకు తుర్కియే అంగీకారం

పశ్చిమ దేశాల నాటో కూటమిలో చేరేందుకు ప్రయత్నిస్తున్న స్వీడన్‌కు ఇక మార్గం సుగమమైనట్లే. తొలి నుంచి మోకాలడ్డుతున్న తుర్కియే ఎట్టకేలకు స్వీడన్‌ చేరికకు ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని నాటో చీఫ్‌ జెన్స్‌ స్టోలెన్‌బర్గ్‌ వెల్లడించారు.

Updated : 11 Jul 2023 06:25 IST

తుర్కియే: పశ్చిమ దేశాల సైనిక కూటమి నాటో(NATO)లో చేరేందుకు విశ్వయత్నాలు చేస్తున్న స్వీడన్‌కు తీపికబురు. స్వీడన్‌(Sweden) చేరికకు తొలి నుంచి మోకాలడ్డుతున్న తుర్కియే(Turkey) ఎట్టకేలకు నాటోలో ఆ దేశం చేరేందుకు అభ్యంతరం లేదని పేర్కొంది. తుర్కియే అధ్యక్షుడు రెసిప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌(Recep Tayyip Erdogan) ఈ మేరకు అంగీకారం తెలిపినట్లు నాటో అధినేత జెన్స్‌ స్టోల్తెన్‌బర్గ్‌(Jens Stoltenberg) వెల్లడించారు. స్వీడన్‌ పెట్టుకున్న దరఖాస్తును తుర్కియే అధ్యక్షుడు పార్లమెంట్‌ ఆమోదానికి పంపేందుకు అంగీకరించినట్లు ఆయన తెలిపారు. లిథువేనియాలోని విల్నెయస్‌లో జరుగుతున్న నాటో శిఖరాగ్ర సమావేశంలో ఇరు దేశాల అధినేతలతో స్టోలెన్‌బర్గ్‌ సమావేశమయ్యారు. అనంతరం స్వీడన్‌ చేరికకు తుర్కియే అంగీకారం తెలిపిందని ఆయన ప్రకటన విడుదల చేశారు. ఇదొక చరిత్రాత్మక విషయమని స్టోల్తెన్‌బర్గ్‌ పేర్కొన్నారు. 

అంతకు ముందు తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌ స్వీడన్‌ చేరికకు మెలిక పెట్టాడు. నాటోలో స్వీడన్‌ చేరాలంటే ఈయూలో తుర్కియే చేరేందుకు అనుమతించాలని షరతు పెట్టారు. ‘తుర్కియే కోసం మొదట ఈయూ తలుపులు తెరవండి. మీరు మాకు మార్గం సుగమం చేస్తే.. మేం సైతం స్వీడన్‌కూ నాటో సభ్యత్వానికి మార్గం సుగమం చేస్తాం’ అని పేర్కొన్నారు. అయితే ఎలాంటి షరతులు లేకుండానే ఎర్డోగాన్‌ స్వీడన్‌ చేరికకు ఒప్పుకున్నారు. దీంతో నాటో కూటమిలో స్వీడన్‌కు 32వ దేశంగా సభ్యత్వం లభించనుంది. ఇక ఈయూ కూటమిలో మొత్తం 27 దేశాలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని