UK: దాడి తప్ప మాకు మరో మార్గం లేదు: బ్రిటన్‌

హౌతీలపై దాడులను బ్రిటన్‌ సమర్థించుకుంది. ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు ఆపకపోతే రెబల్స్‌ మరిన్ని కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.

Updated : 14 Jan 2024 11:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడుల విషయంలో హౌతీలపై సైనిక చర్య తప్ప తమకు మరో మార్గం లేదని బ్రిటన్‌ విదేశాంగ మంత్రి డేవిడ్‌ కామెరూన్‌ పేర్కొన్నారు. అమెరికాతో కలిసి దాడులు చేయడానికి ముందు.. హౌతీలను పలు మార్లు హెచ్చరించామని తెలిపారు. కీలకమైన జల రవాణా మార్గాన్ని హౌతీలు అడ్డుకుంటే.. యూకేలో నిత్యావసరాల ధరలు పెరిగిపోతాయన్నారు. స్వేచ్ఛాయుత సముద్రయానాన్ని రక్షించేందుకు తాము అమెరికాతో కలిసి దాడుల్లో పాల్గొన్నట్లు వివరించారు.

కెనడాలో విదేశీ విద్యార్థుల సంఖ్యపై పరిమితి?

‘‘భవిష్యత్తులో హౌతీలు తీరు మార్చుకోకుండా దాడులు కొనసాగిస్తే.. బ్రిటన్‌ దళాలు మరోసారి యెమెన్‌పై దాడి చేయడానికి వెనుకాడవు. మా మిత్ర దేశాలతో చర్చలు జరుపుతున్నాం. మేం చెప్పిన మాటలను చేతల్లో కూడా చూపిస్తాం. హమాస్‌కు మద్దతుగా దాడులు చేస్తున్నామంటూ హౌతీలు చెప్పటం సరికాదు. ప్రపంచ దేశాలకు చెందిన అన్ని నౌకలపై వారు దాడులు చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా మా సంకీర్ణ దళాల కార్యాచరణ ఇలాగే కొనసాగుతుంది. ఇరాన్‌ సాయంతో పెంచుకున్న హౌతీల సామర్థ్యాలను ధ్వంసం చేస్తాం’’ అని కామెరూన్‌ హెచ్చరించారు.

బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ అంతర్గతంగా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. హౌతీలపై దాడుల విషయంలో ప్రభుత్వం పార్లమెంట్‌కు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఈ దాడులపై సునాక్‌ సోమవారం ఎంపీల ఎదుట ప్రకటన చేయనున్నారు. ప్రపంచం చాలా అస్థిరతలో ఉందన్నారు. దాడులు చేయకుండా చూస్తూ ఊరుకొని.. ఆ తర్వాత పరిణామాలను ఎదుర్కొనే స్థితిలో బ్రిటన్‌ లేదన్నారు.

మరోవైపు శనివారం అమెరికా దళాలు చేసిన దాడులు తమపై ఏమాత్రం ప్రభావం చూపలేదని హౌతీల ప్రతినిధి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని