David Cameron: హౌతీలపై దాడులు ఫలితాన్నిస్తున్నాయి: బ్రిటన్‌

హౌతీల చర్యలను ఏమాత్రం సహించమని బ్రిటన్‌ హెచ్చరించింది. సోమవారం రాత్రి అమెరికా-బ్రిటన్‌ సంయుక్తంగా యెమెన్‌లోని తిరుగుబాటుదారుల స్థావరాలపై దాడులు చేశాయి. 

Updated : 23 Jan 2024 14:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికాతో కలిసి తాము చేస్తున్న దాడులను బ్రిటన్‌ సమర్థించుకొంది. యూకే విదేశాంగ మంత్రి డేవిడ్‌ కామెరూన్‌ (David Cameron) మాట్లాడుతూ..‘‘ ఎర్ర సముద్రంలో స్వేచ్ఛా నౌకాయానానికి హౌతీలు ముప్పుగా మారారు. వారి చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. మేం సంకీర్ణాన్ని సిద్ధం చేశాం. హౌతీలను దెబ్బతీయడానికి సోమవారం జరిపిన దాడుల్లో మా దేశానికి చెందిన నాలుగు టైఫూన్‌ జెట్‌లు పాల్గొన్నాయి. గత 10 రోజుల్లో రెబల్స్‌ 12 నౌకలపై దాడులు చేశారు. ఈ నేపథ్యంలో అమెరికాతో కలిసి వారికి స్పష్టమైన సంకేతాలు పంపేలా చర్యలు తీసుకొన్నాం. మా దాడులు ఫలిస్తున్నాయని నమ్ముతున్నాను. హౌతీల వాదనను మేం ఏమాత్రం అంగీకరించం. చివరికి యెమెన్‌ ప్రభుత్వం కూడా వారితో ఏకీభవించడం లేదు’’ అని వివరించారు. 

భారత్‌తో వివాదం వేళ.. మాల్దీవుల దిశగా చైనా పరిశోధక నౌక

అమెరికా, బ్రిటన్‌ దళాలు సోమవారం అర్ధరాత్రి హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై మరోసారి వైమానిక దాడులు నిర్వహించాయి. మొత్తం ఎనిమిది ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని ఇవి జరిగాయి. క్షిపణులు, ఆయుధాగారాలు, డ్రోన్‌ వ్యవస్థలను విజయవంతంగా ధ్వంసం చేసినట్లు అమెరికా సీనియర్‌ సైనికాధికారులు ప్రకటించారు. అమెరికా విమాన వాహక నౌక ఐసన్‌హోవర్‌పై నుంచి బయల్దేరిన యుద్ధ విమానాలతోపాటు, మరో యుద్ధనౌక, ఒక జలాంతర్గామి ఈ దాడుల్లో పాల్గొన్నట్లు వెల్లడించారు. దాదాపు 30 వరకు గురితప్పని ఆయుధాలను లక్ష్యాల పైకి ప్రయోగించామని చెప్పారు. తొలిసారి హౌతీల భూగర్భ ఆయుధ గోదాములను కూడా లక్ష్యంగా చేసుకొన్నట్లు వివరించారు. వీటిల్లో తిరుగుబాటుదారులు వాడే అత్యాధునిక ఆయుధాలున్నట్లు వెల్లడించారు.   

సోమవారం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌తో కలిసి ఎర్ర సముద్రంలో పరిస్థితిపై చర్చలు జరిపారు. అక్కడ ఉద్రిక్తతలు తగ్గి సుస్థిరత ఏర్పడాలని వారు ఆకాంక్షించారు. అదే సమయంలో ప్రజలు, వాణిజ్య నౌకలను రక్షించే క్రమంలో దాడులకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ప్రస్తుతం ఎర్ర సముద్రంలో చేపట్టిన చర్యలకు అమెరికా ‘ఆపరేషన్‌ పొసైడాన్‌ ఆర్చర్‌’ అని పేరు పెట్టినట్లు సీఎన్‌ఎన్‌ కథనంలో పేర్కొంది. దీంతో సుదీర్ఘకాలంపాటు ఇది కొనసాగవచ్చని భావిస్తున్నారు. ఈ పరిణామాలపై హౌతీలు స్పందించారు. ‘‘దాడులు యెమెన్‌ ప్రజలను మరింత బలోపేతం చేస్తాయి. దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు వారు మరింత బలంగా పనిచేస్తారు’’ అని ఎక్స్‌లో హెచ్చరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని