Pannun: పన్నూ హత్యకు కుట్ర కేసు.. నిఖిల్‌ గుప్తాకు ఆధారాలివ్వలేం: అమెరికా

Gurpatwant Singh Pannun: నిషేధిత ‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌’ నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు కుట్రపన్నినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న భారత వ్యక్తి నిఖిల్‌ గుప్తాకు కేసుకు సంబంధించిన వివరాలివ్వలేమని అమెరికా ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు న్యూయార్క్‌ కోర్టుకు తమ స్పందన తెలియజేసింది.

Updated : 11 Jan 2024 14:19 IST

న్యూయార్క్‌: ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌’ నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ (Gurpatwant Singh Pannun) హత్యకు తమ దేశంలో కుట్ర జరిగిందంటూ అమెరికా (USA) ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ కేసులో భారత్‌కు చెందిన నిఖిల్‌ గుప్తా (Nikhil Gupta) అనే వ్యక్తి ప్రమేయం ఉందన్న అగ్రరాజ్యం.. అతడిపై నేరాభియోగాలను నమోదు చేసింది. దీంతో గుప్తా న్యాయవాది ఇటీవల న్యూయార్క్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కేసుకు సంబంధించిన ఆధారాలివ్వాలని కోరారు. అయితే, ఇందుకు అమెరికా ప్రభుత్వం నిరాకరించింది.

నిఖిల్‌ గుప్తాను గతేడాది జూన్‌లో చెక్‌ రిపబ్లిక్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ప్రాగ్‌ జైల్లో ఉన్న అతడిని ఆధీనంలోకి తీసుకోవడం కోసం అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే జనవరి 4న గుప్తా తరఫు న్యాయవాది.. న్యూయార్క్‌లోని యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ‘‘ఈ కేసులో అతడిపై నేరాభియోగాలు మోపిన అమెరికా.. ఆధారాలు, ఆరోపణలను బలపర్చే పత్రాలను అందజేయలేదు. న్యాయవాదులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే.. జైల్లో అతడిని అగ్రరాజ్య అధికారులు పలుమార్లు ప్రశ్నించారు. ఈ కేసులో అతడు విచారణ ఎదుర్కోవాలంటే ముందు కేసుకు సంబంధించిన వివరాలను అందజేయాలి’’ అని గుప్తా న్యాయవాది అభ్యర్థించారు.

అమెరికా రక్షణమంత్రికి ప్రొస్టేట్‌ క్యాన్సర్‌.. గోప్యతపై సర్వత్రా అనుమానాలు

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. స్పందన తెలియజేయాలంటూ అమెరికా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలోనే బుధవారం ఫెడరల్‌ ప్రాసిక్యూటర్లు కోర్టుకు తమ సమాధానం తెలియజేశారు. గుప్తా అభ్యర్థనను తాము వ్యతిరేకిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ కేసులో గుప్తా.. న్యూయార్క్‌ కోర్టులో హాజరైనప్పుడు మాత్రమే తాము ఆధారాలను అందజేస్తామన్నారు. గుప్తా న్యాయవాది ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది. ‘‘ప్రాగ్‌ జైల్లో నిందితుడిని అమెరికా దర్యాప్తు అధికారులు కేవలం రెండు సార్లు మాత్రమే కలిశారు. ఆ సందర్భాల్లోనూ అతడి హక్కులను ఉల్లంఘించలేదు. న్యాయవాదుల సమక్షంలోనే అతడిని ప్రశ్నించారు’’ అని యూఎస్‌ ఫెడరల్‌ ప్రాసిక్యూటర్లు తమ స్పందనలో తెలియజేశారు.

పన్నూ హత్య కుట్రను అగ్రరాజ్యం భగ్నం చేసిందని, ఈ విషయాన్ని అమెరికా అధికారులు భారత ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినట్లు గతంలో అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఓ భారత అధికారితో కలిసి నిఖిల్‌ గుప్తా ఈ కుట్ర పన్నినట్లు ఆరోపణలు వచ్చాయి.  ప్రస్తుతం దీనిపై అమెరికా ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోంది. మరోవైపు, ఈ ఆరోపణలపై దర్యాప్తునకు భారత్‌ కూడా ఓ కమిటీని ఏర్పాటు చేసింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని