Ts News: లాక్‌డౌన్ 10 రోజుల పొడిగింపు 

తాజా వార్తలు

Updated : 30/05/2021 22:33 IST

Ts News: లాక్‌డౌన్ 10 రోజుల పొడిగింపు 

హైదరాబాద్‌: తెలంగాణలో లాక్‌డౌన్ మ‌రో 10 రోజులు పొడిగిస్తూ రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రంలో నేటితో లాక్‌డౌన్‌ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో సమావేశమైన కేబినెట్‌.. రేప‌టి నుంచి మరో ప‌ది రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. జూన్‌ 9 వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉండనుంది.

ఇళ్ల‌కు చేరేందుకు మ‌రో గంట వెసులుబాటు

లాక్‌డౌన్ స‌డ‌లింపు సమయాన్ని ప్ర‌భుత్వం మూడు గంటలు పెంచింది. ఇప్పటి వరకు ఉదయం 6 నుంచి 10 గంటల వరకే సడలింపు ఇస్తుండగా.. దాన్ని మ‌ధ్యాహ్నం 1 గంట వరకు పొడిగించారు. స‌డలింపు స‌మ‌యం త‌ర్వాత బ‌య‌టికి వెళ్లిన ప్ర‌జ‌లు ఇళ్ల‌కు చేరుకోవ‌డానికి మ‌రో గంట పాటు అద‌న‌పు స‌మ‌యం ఇచ్చారు. దీంతో  మ‌ధ్యాహ్నం 2 గంటల నుంచి మ‌రుస‌టి రోజు ఉద‌యం 6 గంటల వ‌ర‌కు క‌ఠిన లాక్‌డౌన్ అమ‌ల్లోకి రానుంది. అత్యవసర సేవలు సహా గతంలో వెల్లడించిన కార్యకలాపాలకు లాక్‌డౌన్‌ నుంచి యథావిధిగా మినహాయింపు కొనసాగనుంది.

ఉద‌యం 6 నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు అన్ని ర‌కాల ప్ర‌జా ర‌వాణాకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. రాష్ట్రంలో మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కే పెట్రోల్ బంకుల‌కు అనుమ‌తి ఇచ్చారు. జాతీయ ర‌హ‌దారుల‌పై ఉండే పెట్రోల్ బంకుల‌కు నిబంధ‌న‌ల నుంచి ప్ర‌భుత్వం మిన‌హాయింపు ఇచ్చింది. వ‌రంగ‌ల్‌లో మ‌ల్టీ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రి నిర్మాణానికి మంత్రి వ‌ర్గం నిర్ణ‌యించింది. తెలంగాణ‌లో థ‌ర్డ్ వేవ్ వ‌స్తుంద‌న్న వార్త‌ల ప‌ట్ల వైద్య‌శాఖ అప్ర‌మ‌త్తంగా ఉండాలని మంత్రివ‌ర్గం సంబంధిత అధికారుల‌ను ఆదేశించింది. అన్ని ఏరియా, జిల్లా ఆస్ప‌త్రుల్లో మౌలిక వ‌స‌తుల‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలిపింది. రాష్ట్ర అవ‌త‌ర‌ణ వేడుక‌ల‌ను కొవిడ్ నిబంధ‌న‌ల మేరకు జ‌రుపుకోవాల‌ని తెలిపింది. విత్త‌నాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాల‌ని వ్య‌వ‌సాయ‌శాఖను మంత్రివ‌ర్గం ఆదేశించింది. వ్య‌వ‌సాయ శాఖ‌లో రెండు అద‌న‌పు సంచాల‌కుల పోస్టుల‌కు మంత్రివ‌ర్గం నిర్ణ‌యం తీసుకుంది. 

కరోనా కట్టడికి రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ నెల 12 నుంచి లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. ఇవాళ్టితో గ‌డువు ముగియ‌నుండ‌టంతో సీఎం కేసీఆర్‌ మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇతర వర్గాల అభిప్రాయాన్ని తీసుకున్నారు. ఆ విష‌యాన్ని కేబినేట్ స‌మావేశంలో చ‌ర్చించారు. ఆంక్షలు కొనసాగించాలని ఎక్కువ మంది అభిప్రాయపడ‌టంతో లాక్‌డౌన్‌ను మ‌రో ప‌ది రోజులు పొడిగించారు. ఇప్పటికీ రోజూ సరాసరి దాదాపు మూడు వేలకు పైగా కేసులు నమోదవుతుండటం, బ్లాక్‌ఫంగస్‌ బాధితులు పెరుగుతున్నందున లాక్‌డౌన్‌ను కొనసాగించడమే మేలని ప్రభుత్వం భావించిన‌ట్లు ఈ నిర్ణ‌యంతో తెలుస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని