ఐరోపా దేశాల పెట్టుబడులకు విశేష ప్రోత్సాహం

ప్రధానాంశాలు

ఐరోపా దేశాల పెట్టుబడులకు విశేష ప్రోత్సాహం

 ప్రత్యేక పార్కు ఏర్పాటుకూ సిద్ధం
యూరోపియన్‌ వాణిజ్య బృంద సదస్సులో మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో పరిశ్రమలు స్థాపించే ఐరోపా దేశాల సంస్థలకు విశేష ప్రోత్సాహం, అత్యుత్తమ రాయితీలు అందిస్తామని, ప్రపంచస్థాయి మౌలిక వసతులను కల్పిస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ప్రత్యేక పారిశ్రామిక పార్కు ఏర్పాటుకూ సిద్ధమన్నారు. తెలంగాణలో ఇప్పటికే అమెరికా, జపాన్‌, కొరియా, చైనా, కొరియా, తైవాన్‌ తదితర దేశాలకు చెందిన పరిశ్రమలు పెద్దసంఖ్యలో ఉన్నాయని, అనేక ఐరోపా కంపెనీలూ తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని చెప్పారు. బుధవారం యూరోపియన్‌ వాణిజ్య బృందం నిర్వహించిన దృశ్య మాధ్యమ సదస్సుకు ఐరోపా, భారత్‌లకు చెందిన పలు సంస్థల ప్రతినిధులు, వ్యాపార వర్గాలు, రాయబార కార్యాలయాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘‘టీఎస్‌ఐపాస్‌ విధానంలో భాగంగా ఏ కార్యాలయానికీ వెళ్లనవసరం లేకుండా 15 రోజుల్లోనే అనుమతులు, స్వీయ ధ్రువీకరణ అవకాశం కల్పిస్తున్నాం. వ్యాపార సంస్థల అవసరాల మేరకు, పెట్టుబడి మేరకు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించేందుకు స్థలం సిద్ధంగా ఉంది. రహదారులు, టెలికాం, విద్యుత్‌, నీరు వంటి మౌలిక వసతులు సత్వరమే సమకూరుస్తున్నాం. సంస్థల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ ఖర్చుతో మానవ వనరుల శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. తెలంగాణలో ఐటీ, జీవశాస్త్రాలు, ఔషధ, వైమానిక, రక్షణ, జౌళి, ఆహారశుద్ధి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఈ రంగాల్లో ఇతర రాష్ట్రాలతోనే కాకుండా వివిధ దేశాలతోనూ రాష్ట్రం పోటీ పడుతోంది. ఇందుకోసం భారీ పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేస్తున్నాం’’ అని కేటీఆర్‌ వివరించారు. ఈ సందర్భంగా వివిధ దేశాల పారిశ్రామికవేత్తలు, రాయబారులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని