ఆన్‌లైన్‌  ఆరాటంలో..
close
Published : 04/05/2020 10:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆన్‌లైన్‌  ఆరాటంలో..

పుస్తకాలకు బదులు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు!

కళ్ల ముందుండే టీచరేమో అంతర్జాలంలో!!

ఇల్లే పాఠశాల, కాలేజీగా రూపాంతరం...

విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ పాఠాలకు సై అనడంతో ఇదీ పరిస్థితి... కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం అయినా లాక్‌డౌన్‌ వేళ ఇది తప్పనిసరైంది...

ఈ నేపథ్యంలో అమ్మకు మరో గురుతర బాధ్యత...

డిజిటల్‌ బాట పట్టిన పిల్లల్ని

మేటి విద్యార్థులుగా మలచాల్సింది ఆమెనే...

అందుకేం చేయాలి? ఏం చేయకూడదు?

పిల్లల్ని పొద్దున్నే నిద్రలేపి, తయారు చేయించి స్కూల్‌, కాలేజీకి పంపిస్తే అమ్మకి పెద్ద పని పూర్తయ్యేది. ఇప్పుడలా కాదు.. ఇంట్లోనే ఉంటూ ఆన్‌లైన్‌లో పాఠాలు చదివేస్తున్న పిల్లల్ని పొద్దంతా కనిపెట్టుకొని ఉండాల్సి వస్తోంది. కొత్త ట్రెండ్‌కు తనూ అలవాటు పడాలి, పిల్లల్నీ సంసిద్ధులను చేయాలి. కావాల్సినవన్నీ ముందే సమకూర్చాలి. తమ కంటిపాపల కోసం ఇలా కష్టపడటం ఏ తల్లికైనా ఇష్టమే అయినా ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.

ఇవి చేయండి

ఆన్‌లైన్‌ క్లాసుల్లో వర్చువల్‌ గురువు చెప్పింది వినాలి. ఒక్కసారిగా వచ్చిపడ్డ ఈ కొత్త ధోరణిని పిల్లలు త్వరగా జీర్ణం చేసుకోలేరు. అందుకే క్లాసు మొదలవకముందే ఓసారి డెమో ఇప్పించాలి.

ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌.. ఏదైనా విద్యార్థులకు క్రమశిక్షణ, సమయపాలన ముఖ్యం. స్కూల్‌/కాలేజీకి వెళ్తున్నప్పుడు వాళ్లని ఎలాగైతే సిద్ధం చేస్తామో ఇప్పుడూ అదే పాటించాలి. స్నానం, టిఫిన్‌.. అన్నీ సమయానుకూలంగా ఉండాలి. ఇంట్లోనే ఉంటున్నారు కదానీ వేళల్లో తేడా రానీయొద్దు.

ఆన్‌లైన్‌ పాఠాలకు ఏకాగ్రత ముఖ్యం. పిల్లలకు ఒక గది లేదా ప్రత్యేక స్థలం కేటాయించాలి. ఇంటర్నెట్‌ వేగంగా ఉండాలి. నాణ్యతలేనివి, అరకొర గ్యాడ్జెట్లతో టీచరు చెప్పే పాఠాలు సరిగా అందుకోలేరు.

బడిలో, కాలేజీలో స్నాక్స్‌, లీజర్‌, క్రాఫ్ట్‌, ప్లేయింగ్‌.. అంటూ రకరకాల విరామాలుంటాయి. హోం స్కూల్‌నీ అందుకు మినహాయించొద్ధు ఆ బ్రేక్‌లు పాటించేలా చూసుకోవాలి.

బడిలో ఉన్నప్పుడు ఆటపాటలు, కబుర్లు, సరదాలు.. పిల్లలకు ఎన్నో ఉంటాయి. ఇంట్లో ఉంటే ఒంటరి అయిపోయామనే బెంగ చిన్నారుల్ని చుట్టుముట్టొచ్ఛు ఆ భావన పోగొట్టడానికి అప్పుడప్పుడు స్నేహితులతో వీడియో చాట్‌లు, ఫోన్‌కాల్స్‌కి అనుమతినివ్వాలి.

విద్యాసంస్థలు తెరుచుకుంటే ఆన్‌లైన్‌లో చెప్పిన పాఠాలు మళ్లీ చెబుతారనే తేలికభావంతో పిల్లలు డిజిటల్‌ క్లాసులను ‘స్కిప్‌’ చేసేస్తుంటారు. ఆన్‌లైన్‌ పాఠాలూ ముఖ్యమేనని చెబుతూ బాగా దృష్టిపెట్టేలా చేయాలి.

భరోసా ఇవ్వాలి

ఆన్‌లైన్‌ క్లాసుల్లో స్నేహితులతో మాట్లాడటం కుదరదు. టీచరుతో ముఖాముఖి ఉండదు. ఈ తరహా వాతావరణానికి పిల్లల్ని ముందుగానే మానసికంగా సిద్ధం చేయాలి. ఆన్‌లైన్‌ క్లాసుల సానుకూలతలేంటో వివరించాలి. టీచర్లు చెబుతోంది స్పష్టంగా అర్థమవుతుందా? ప్రాక్టికల్‌గా, టెక్నికల్‌గా ఏమైనా ఇబ్బందులున్నాయా? అని క్లాసు పూర్తైన తర్వాత కనుక్కోవాలి. పిల్లలు కొత్త విధానానికి అలవాటు పడేంతవరకూ టీచర్లతో సంభాషిస్తూ ఉండాలి. తరగతితో పోలిస్తే ఆన్‌లైన్‌లో విద్యార్థులు పాఠాలు సరిగా గ్రహించగలుగుతున్నారా, అర్థం చేసుకుంటున్నారా అనే అభిప్రాయాలు తెలుసుకోవాలి. టీచర్లు విరామం ఇచ్చినప్పుడే జ్యూస్‌లు, హెల్త్‌డ్రింక్స్‌ లాంటివి ఇవ్వాలి. అప్పుడప్పుడు తడిగుడ్డతో వాళ్ల కళ్లను తుడిస్తే మంచిది. డ్రై ఐస్‌ సమస్య రాదు. టీనేజీ పిల్లల్లో తోటివారి ఒత్తిడి (పీర్‌ ప్రెజర్‌) ఎక్కువగా ఉంటుంది. అందరితో కలిసి చదువుకోవాలి, పోటీ పడాలనే స్వభావం ఉంటుంది. ఈ మానసిక ఒత్తిడి తగ్గడానికి కొద్దిరోజుల్లో అంతా సర్దుకుంటుందనే భరోసా వాళ్లకు ఇవ్వాలి. క్లాసులు ముగిసిన తర్వాత సబ్జెక్టులు చర్చించుకోవడానికి, గ్రూప్‌కాల్‌కి అనుమతించాలి.

- సుజాతా వేల్పూరి, కౌన్సెలర్‌

వాతావరణమూ ముఖ్యం

పిల్లలకు ఆన్‌లైన్‌ క్లాసులపై ఏకాగ్రత కుదరాలంటే చుట్టుపక్కల వాతావరణం బాగుండాలి. గదిలో లైటింగ్‌ సరిపోయినంతగా ఉంటేనే టీచరు, విద్యార్థి ఒకరికొకరు స్పష్టంగా కనిపిస్తారు. అందుకు తగ్గట్టుగా లైటింగ్‌ ఉండేలా చూసుకోవాలి. కిటికీ దగ్గర, వెలుతురు పడే చోట లాప్‌ట్యాప్‌, పీసీ, ట్యాబ్‌, స్మార్ట్‌ఫోన్‌ని అమర్చుకునేలా చూడాలి. కంప్యూటర్‌ ముందుకు మరీ ఒరిగినట్టుగా, వెనక్కి జారిపోయినట్టుగా కాకుండా వెన్నెముక నిటారుగా ఉండేలా కూర్చోవాలని చెప్పాలి. గంటలకొద్దీ కంప్యూటర్‌ ముందే ఉండాల్సి రావడం పిల్లలకి కొత్త అనుభవం. దానికి తగ్గట్టే స్క్రీనింగ్‌ వెలుతురు సరిపోయేలా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.

ఇవి చేయొద్దు

పిల్లలు ఏం చేస్తున్నారో అనే ఉత్సుకతతో పేరెంట్స్‌ మాటిమాటికీ వాళ్ల ఫోన్‌, ల్యాప్‌టాప్‌ల్లోకి తొంగి చూస్తుంటారు. పాఠం సరిగా వింటున్నారో, లేదోనని అనుమానిస్తారు. ఈ అత్యుత్సాహం వాళ్ల ఏకాగ్రతను దెబ్బతీస్తుంది.

క్లాసు మధ్యలో వెళ్లి మాట్లాడటం, టీకాఫీలు, స్నాక్స్‌లు అందిస్తూ ఇబ్బంది పెట్టొద్దు.

పాఠం వింటున్నప్పుడు సందేహాలు అడగాలనీ పదేపదే పోరు పెడుతుంటారు కొందరు. ఇది పిల్లలపై ఒత్తిడి తెస్తుంది. తల్లిదండ్రులు నన్నే గమనిస్తున్నారనే అభద్రతాభావానికి గురవుతారు.

పిల్లల ముందు ఆన్‌లైన్‌ తరగతుల గురించి తక్కువ చేసి మాట్లాడొద్ధు వాళ్లు నిరుత్సాహానికి గురవుతారు. క్లాసుల్ని తేలిగ్గా తీసుకుంటారు.

క్లాసు మధ్యలో గ్యాడ్జెట్‌కి ఫోన్‌కాల్స్‌, ఎసెమ్మెస్‌లు రాకుండా చూసుకోవాలి. ఈ సమయాల్లో ఫోన్‌లో ‘డు నాట్‌ డిస్ట్రబ్‌’ ఫీచర్‌ని ఉపయోగించుకోవచ్చు.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని