వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : ఇంట్లో ఈ మార్పులు చేసుకున్నారా? - you should do these changes in your home while working from home
close
Updated : 23/06/2021 19:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : ఇంట్లో ఈ మార్పులు చేసుకున్నారా?

కరోనా కారణంగా ఇప్పుడు చాలామంది ఇంటి నుంచే పని చేస్తున్నారు. వైరస్‌ అంతమయ్యేదాకా ఇదే పని విధానాన్ని కొనసాగించక తప్పదు. కొన్ని సంస్థలైతే తమ ఉద్యోగులకు కొవిడ్‌ తర్వాతా ఇంటి నుంచే పని చేయమని చెబుతున్నాయి. ఇలా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ప్రస్తుతం మన జీవన విధానంలో ఓ కీలక భాగమైపోయింది. అయితే ఇలా పనిచేసే క్రమంలోనూ పనిపై పూర్తి శ్రద్ధ పెట్టాలన్నా, చక్కటి ఉత్పాదకతను అందించాలన్నా అచ్చం ఆఫీస్‌ లాంటి వాతావరణాన్నే ఇంట్లోనూ సృష్టించుకోక తప్పదంటున్నారు నిపుణులు. అందుకోసం ఇంటి అలంకరణలో, గదుల్లో పలు మార్పులు చేర్పులు చేసుకోవడం అవసరం అంటున్నారు. అవేంటో చూద్దాం రండి..

ఉన్నదాంట్లోనూ సర్దుకోవచ్చు!

పెద్ద ఇల్లు, విశాలమైన గదులు అందరికీ ఉండకపోవచ్చు.. సింగిల్‌ బెడ్‌రూమ్‌, డబుల్‌ బెడ్‌రూమ్‌లోనే కుటుంబ సభ్యులందరూ సర్దుకోవాల్సి రావచ్చు. ఇలాంటప్పుడు ఆఫీస్‌ స్పేస్‌ కోసం ప్రత్యేకమైన గది కేటాయించడం కుదరదు. అలాగని అందరి మధ్యా కూర్చొని పని చేయలేం. కాబట్టి ఉన్న స్థలంలోనే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కోసం సర్దుబాటు చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఇంట్లో కాస్త విశాలంగా ఉన్న గదిని ఎంచుకొని అందులో మీకు సౌకర్యవంతంగా ఉండే చోట కాస్త స్థలాన్ని విభజించుకోవచ్చు. ఆ వీల్లేకపోతే.. మీ పడకగదిలోనే ఓ మూలన పార్టిషన్‌ చేసుకొని దాన్ని ఆఫీస్‌ స్పేస్‌ కోసం వాడుకోవచ్చు. ఇక ఇందులో మీకు నచ్చిన విధంగా టేబుల్‌ వేసుకోవడం, ఇండోర్‌ ప్లాంట్స్‌ అమర్చుకోవడం, అలంకరణ వస్తువులతో డెకరేట్‌ చేసుకోవడం.. ఇలా మీకు నచ్చినట్లుగా తీర్చిదిద్దుకోవచ్చు. తద్వారా ఏకాగ్రత పెరుగుతుంది.. మీ పనికి ఎలాంటి అంతరాయం కూడా కలగదు.

బాల్కనీని వివిధ రకాలుగా..!

మీ ఇంటి బాల్కనీ మీకు ఇష్టమైన ప్రదేశమా? మనసుకు ఒత్తిడి కలిగినప్పుడల్లా అక్కడే రిలాక్సవుతుంటారా? అయితే ఆ బాల్కనీనే ఆఫీస్‌ స్పేస్‌గా మార్చితే సరిపోతుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం ప్రత్యేకించి అలంకరణ అక్కర్లేదు. ఎందుకంటే ఆ ప్రదేశంలో ఎలాగూ పచ్చపచ్చటి మొక్కలు, విండ్‌ఛైమ్స్‌.. వంటివి అమర్చే ఉంటారు కాబట్టి..! వీలైతే బాల్కనీలో ఓ కేన్‌ స్వింగ్ వేలాడదీస్తే సరి! మధ్యమధ్యలో అందులో సేదదీరుతూ ఆహ్లాదంగా పని చేసుకోవచ్చు. అలాగే వీకెండ్స్‌లో ఇదే బాల్కనీలో మీ కుటుంబ సభ్యులతో సరదాగా కబుర్లు చెప్పుకోవడం వంటివి చేయచ్చు. అంతేకాదు.. కాస్త విశాలంగా ఉన్న బాల్కనీలో అయితే ఓ మినీ జిమ్‌ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా వివిధ రకాలుగా బాల్కనీని వాడుకోవచ్చు.

సౌకర్యానికే ప్రాధాన్యం!

ఇంటి నుంచి పని చేసే క్రమంలో కొంతమందికి కుర్చీలో కూర్చోవడం అలవాటు. మరికొంతమందికి కింద కూర్చుంటేనే సౌకర్యంగా ఉంటుంది.. ఇంకొంతమంది సోఫాలో అయితేనే అనువుగా పని చేయగలుగుతారు. కాబట్టి మీకు ఎలా నచ్చితే అలా పని చేయచ్చు.. ఇలా సౌకర్యానికి ప్రాధాన్యమిచ్చినప్పుడే మనం చేసే పనిపై ఏకాగ్రత పెరిగి చక్కటి అవుట్‌పుట్‌ను అందించే వీలుంటుంది. ఇలా మీ సౌకర్యార్థం ప్రస్తుతం మార్కెట్లో విభిన్నమైన అడ్జస్టబుల్‌ ఫ్లోర్ చెయిర్స్, ల్యాపీ పెట్టుకోవడానికి వీలుగా ఫ్లోర్‌ డెస్క్‌.. వంటివి అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు సోఫానే కావాలనుకుంటే అటు సేదదీరడానికి, ఇటు పని చేసుకోవడానికి సౌకర్యవంతంగా ఉండే ప్లే అండ్‌ వర్క్‌ సోఫాలు కూడా లభిస్తున్నాయి. కాబట్టి వీటిలో మీకు ఏది కావాలనుకుంటే దాన్ని ఎంచుకోవచ్చు.

సరైన వెలుతురూ ఉండాల్సిందే!

పనిచేసే చోట సరైన వెలుతురు లేకపోతే ఆ ప్రభావం కంటి మీద పడుతుంది. కాబట్టి మనం పని చేసే గదిలో సరైన వెలుతురు ఉండేలా చూసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. అలాగని ల్యాప్‌టాప్‌ స్క్రీన్‌ మీద ఎక్కువ వెలుతురు పడకుండా, నీడ పడకుండా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా రాతపూర్వకమైన పని చేయాల్సి వస్తే.. అందుకు డెస్క్‌ ల్యాంప్‌ సరైన ఎంపిక! సాధారణంగా ఆఫీసుల్లో డెకరేటివ్‌ ఎల్‌ఈడీ లైటింగ్‌ ఏర్పాటు చేస్తారు. దానివల్ల కళ్లపై ప్రభావం పడకుండా ఉంటుంది. కాబట్టి మీకు వీలుంటే ఇంట్లోనూ అలాంటి వెలుతురును ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకోసం మార్కెట్లో విభిన్న రకాల డెకరేటివ్‌ ల్యాంప్స్‌, లైట్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇక పగటి పూట సహజసిద్ధంగా బయటి నుంచి వచ్చే వెలుతురు కోసం గది కిటికీలు, బాల్కనీ తలుపులు తెరిచి పెట్టుకోవడం మంచిది.

వంటగదిలో ఈ మార్పులు!

ఇంటి నుంచి పని చేస్తోన్న మహిళలు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్‌ పనులు సమన్వయం చేసుకోలేక సతమతమైపోతున్నారు. వంట చేసే క్రమంలో కిచెన్‌లో ఎక్కువ సమయం గడపాల్సి రావడంతో వీరిపై ఒత్తిడి పెరిగిపోతుంది. అయితే వంటగదిలోని వస్తువులన్నీ అందుబాటులో, పొందికగా సర్దుకుంటే పని ఈజీ అవుతుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో రోజూ వాడే వస్తువుల్ని మీ చేతికి అందుబాటులో ఉండేలా అమర్చుకోవడం, డబ్బాల్లో సరుకులు ఎప్పటికప్పుడు నింపుకోవడం, వారాంతాల్లో సమయం దొరికినప్పుడు ఆరోగ్యకరమైన స్నాక్స్‌ తయారుచేసి పెట్టుకోవడం.. వంటివి చేస్తే వంటగదిలో ఎక్కువ సమయం గడపాల్సిన అవసరం ఉండదు. తద్వారా ఆ ఒత్తిడి పనిపై పడకుండా జాగ్రత్తపడచ్చు.

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేసే వారు అనువుగా, సౌకర్యవంతంగా పని చేసుకోవాలంటే ఇంట్లో చేసుకోవాల్సిన కొన్ని మార్పులేంటో తెలుసుకున్నారుగా! సో.. ఈ చిట్కాలన్నీ పాటిస్తే అటు ఏకాగ్రతతో పని చేసుకోవచ్చు.. మంచి ఉత్పాదకతనూ సంస్థకు అందించచ్చు.. తద్వారా కెరీర్‌లో అభివృద్ధి సాధించచ్చు!

ఇదేవిధంగా ఇంటి నుంచి పని చేసే క్రమంలో మీరు పాటిస్తున్న ఇతర చిట్కాలేవైనా ఉంటే పంచుకోండి. మీలాంటి మహిళలెందరికో అవి ఉపయోగపడచ్చు. 


మరిన్ని

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని