ఆపద్బంధువుతో ఆటలా?
close

తాజావార్తలు


ఆపద్బంధువుతో ఆటలా?
డయల్‌ 100కు పొంచిఉన్న ముప్పు
దుర్వినియోగం చేయడం నష్టమే
విజయవాడ
మల్లేష్‌... మహబూబ్‌నగర్‌వాసి. మద్యం తాగి కృష్ణలంక కనకదుర్గమ్మ వారధి కింద ఉన్న ఇసుక తిన్నెల్లో పడుకున్నాడు.కళ్లు తెరిచి చూసేసరికి చుట్టూ నీరు. ఒక్కసారిగా వచ్చిన కృష్ణమ్మ వరద తాకిడికి ఉక్కిరిబిక్కిరయ్యాడు. బెంబేలెత్తిపోయాడు. అంతటి ఆపదలోనూ స్పురించింది... పోలీసు డయల్‌ 100 నెంబరు. వెంటనే కాల్‌ చేశాడు వరద నీటిలో చిక్కుకున్నానని. అంతే పోలీసులు ఆఘమేఘాల మీద బయలుదేరారు. అష్టకష్టాలు పడి నది మధ్యలో వరద నీటిలో చిక్కుకున్న మల్లేష్‌ను కాపాడారు.

ఈ నెల 17న ఒక వ్యక్తి ప్రకాశంబ్యారేజీ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా 100కు వచ్చిన సమాచారం మేరకు అతడిని కాపాడారు.

17వ తేదీనే అరండల్‌పేట కూర్మయ్యవంతెన లాకుల వద్ద కాలువలో ఇరుక్కున్న ఒక వ్యక్తిని డయల్‌ 100కు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు కాపాడారు.

ఈ దృష్టాంతాలు చాలు... 100.. ఈ సంఖ్య ప్రాధాన్యం చెప్పడానికి. కానీ ఆకతాయితనంతో చేస్తున్న చేష్టలు ముప్పు తెచ్చిపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజలకు అత్యుత్తుమ సేవలు అందించాలన్న లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ నంబరును కొందరు దుర్వినియోగపరుస్తున్నారు. సగటున రోజుకు 3700 నుంచి 4000 కాల్స్‌ విజయవాడ పోలీస్‌ కంట్రోల్‌రూంకు వస్తున్నాయి. వీటిలో అతి తక్కువ మాత్రమే నిజమైన కాల్స్‌ ఉంటున్నాయని... మిగిలినవన్నీ అనవసర కాల్స్‌ మాత్రమేనని పోలీసులు చెబుతున్నారు. ఎక్కువ భాగం బ్లాంక్‌ కాల్స్‌ ఉంటే... మరికొంతమంది వివరాల కోసం కాల్స్‌ చేస్తున్నారు. అసలైన కాల్స్‌ మాత్రం చాలా తక్కువ ఉంటున్నాయని డీసీపీ పాలరాజు తెలిపారు. తప్పుడు కాల్స్‌ కారణంగా పోలీసుల అత్యంత విలువైన సమయం వృధా అవుతోందని ఏ ఒక్క కాల్‌ను తప్పుడు కాల్‌ అని నిర్లక్ష్యం చేయలేమంటున్నారు. ఒకోసారి నిర్లిప్తంగా ఉంటే పెను ప్రమాదాలకు దారి తీయవచ్చని చెబుతున్నారు.

తప్పని వేధింపులు...: పోలీస్‌ కంట్రోల్‌రూం 100కు ఒకోసారి తప్పుడు ఫోన్‌ కాల్స్‌ వస్తుంటాయి. శనివారం విజయవాడ పోలీస్‌ కంట్రోల్‌రూంకు ఒక కాల్‌ వచ్చింది. మహిళా కానిస్టేబుల్‌ ఆ కాల్‌ను రిసీవ్‌ చేసుకున్నారు. అవతలి వ్యక్తి అసభ్యంగా మాట్లాడాడు. దాన్ని కట్‌ చేసినా మరలా మరలా ఫోన్‌ కాల్స్‌ వస్తూనే ఉన్నాయి. 2 గంటల సమయంలో 40 కాల్స్‌ రావటంతో పోలీసులు ఆ నంబరును గుర్తించారు. కృష్ణాజిల్లా ముసునూరు మండలంలోని ఒక గ్రామం నుంచి కాల్‌ వచ్చినట్లుగా గుర్తించి అక్కడకు వెళ్లారు. ఫోన్‌ యజమానిని పట్టుకోగా అసలు విషయం బయటపడింది. 16 సంవత్సరాల బాలుడు ఆ ఫోన్‌కాల్స్‌ చేసినట్లు గుర్తించారు. అతని మానసిక స్థితి సక్రమంగా లేదని గుర్తించారు. దీంతో అతనిని పోలీసులే మానసిక వైద్యుని వద్దకు పంపించి చికిత్స చేయిస్తున్నారు. ఎవరైనా పోలీస్‌లకు తప్పుడు సమాచారం అందించినా, పోలీసుల విలువైన సమయం వృధా చేసేందుకు ప్రయత్నించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

నగరంలో 20 నిమిషాలు...: 100కు కాల్‌ పోలీస్‌ కంట్రోల్‌రూం సిబ్బంది సంబందిత పోలీస్‌స్టేషన్‌కు లేదా ఆ పోలీస్‌స్టేషన్‌కు సంబందించిన రక్షక్‌ లేదా బ్లూకోల్ట్స్‌ వాహనానికి సమాచారం అందిస్తారు. వెంటనే సంబందిత పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తారు. రోడ్డు ప్రమాదాలు, నేరాలు, గొడవలు, మందుబాబుల ఆగడాలు... ఇలాంటివి పోలీస్‌ కంట్రోల్‌రూంకు వస్తాయి. ఘటనాస్థలానికి చేరుకున్న సిబ్బంది వివరాలను సేకరించి తిరిగి కంట్రోల్‌రూంకు సమాచారం అందిస్తారు. కంట్రోల్‌రూం సిబ్బంది అపుడు ఆ కాల్‌ను క్లోజ్‌ చేస్తారు. ఆ తరువాత కంట్రోల్‌రూంకు సమాచారం అందించిన వ్యక్తికి కూడా వివరాలను తెలియజేస్తారు. ఇలా కాల్‌ క్లోజింగ్‌ సమయం విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 20 నిమిషాలు కాగా జిల్లా లేదా గ్రామీణ ప్రాంతాల్లో 40 నిమిషాలుగా అధికారులు లెక్కించారు.

విజయవాడలో 6 నిమిషాల్లోనే గమ్యానికి...: విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో కాల్‌కు హాజరవుతున్న సమయం సగటున 6 నిమిషాలే. ఈ నెల 23న పోలీసులు 184 నిజమైన కాల్స్‌కు హాజరు కాగా వీటికి తీసుకున్న సగటు సమయం 6 నిమిషాలు. దీన్ని 5 నిమిషాలకు కుదించాలన్నదే తమ లక్ష్యమని డీసీపీ పాలరాజు చెబుతున్నారు. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందిస్తున్నామని దీని కోసం పోలీసు యంత్రాంగం మొత్తం నిమగ్నమై ఉంటుందని తెలిపారు. కొన్ని ప్రపంచ దేశాల్లో 5 నిమిషాల కన్నా తక్కువ వ్యవధిలో పోలీసులు కాల్‌కు హాజరవుతున్నారని విజయవాడలో దాన్ని 5 నిమిషాలుండేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

పోలీసు సేవలకు ఆధునిక హంగులు... : పోలీసు సేవలకు ఆధునిక హంగులు సమకూరుస్తున్నారు. త్వరలో క్రైం స్టాఫర్‌ను ఏర్పాటు చేసి దానికి ఒక ప్రత్యేకమైన నెంబరు కేటాయిస్తారు. దాన్ని వాట్సాప్‌కు కూడా అనుసంధానం చేస్తారు. ఎక్కడైనా నేరం జరిగినా దాని వివరాలు క్రైం స్టాఫర్‌కు చేరేలా ప్రజలను సిద్ధం చేయాలన్నది విజయవాడ పోలీసుల లక్ష్యం. దీని కోసం కసరత్తు చేస్తున్నారు.

ఇక నాలుగో సింహం యాప్‌ ద్వారా అత్యుత్తమ సేవలు ఇప్పటికే అందిస్తున్నారు. ఎస్‌ఓఎస్‌ పేరిట ఇప్పటికే ఆపదలో ఉన్న వారు నాలుగో సింహం యాప్‌ ద్వారా సేవలు పొందుతున్నారు. తాజాగా ‘సేఫ్‌ ట్రావెల్‌’ పేరిట కొత్త సేవలను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీని ద్వారా నగలు, భారీ స్థాయిలో నగదు తీసుకువెళ్లే వ్యాపారులు నాలుగో సింహం యాప్‌ ద్వారా ‘సేఫ్‌ ట్రావెల్‌ మోడ్‌’తో రిజిస్టర్‌ చేసుకుంటే వారి కదలికలపై పోలీసులు కంట్రోల్‌రూం నుంచి నిఘా ఉంచేందుకు అవకాశం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. త్వరలో ఈ సౌకర్యం నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

పోలీసు వాహనాల్లో ట్రామా సెంటర్ల సమాచారం...: ఒకోసారి పోలీసు వాహనాలు ప్రమాద స్థలానికి నిమిషాల వ్యవధిలో చేరుకుంటాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకువెళ్లే 108 వాహనం రావటం ఆలస్యం కావచ్చు. రోడ్డు ప్రమాదబాధితులకు గోల్డెన్‌ అవర్‌ అనేది అత్యంత కీలకమైంది. వెంటనే వారిని ఆసుపత్రికి తీసుకువెళ్లగలిగితే వారి ప్రాణాలను కాపాడవచ్చు. ఈ సమాచారం పోలీసు వాహనానికి ఉంటే... పోలీసు వాహనంలో ట్రామా కేర్‌ సెంటర్ల వివరాలు ఉంటే అంబులెన్స్‌ రాక ముందే వారిని అక్కడకు తీసుకువెళ్లవచ్చు. ఇలాంటి సౌకర్యం కూడా పోలీసు వాహనాల్లో త్వరలో రాబోతున్నాయి. ఇలాంటి ఆధునిక సౌకర్యాలతో ప్రజలకు మేలైన సౌకర్యాలు అందించాలన్నదే తమ లక్ష్యమని అంటున్నారు పోలీసులు. డయల్‌ 100, క్రైం స్టాఫర్‌, నాలుగో సింహం... ఇలాంటివి ప్రజలకు చేరువయ్యాయి. వీటిని మరింతగా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పోలీసులు కోరుతున్నారు.

FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.