close

సినిమా

ఆరంభం... అదిరింది!

సినిమాల మీద మమకారం మనవాళ్లకి కాస్త ఎక్కువే. సినిమాలు బాగా చూసేవాళ్లలో చాలామంది కల మెగాఫోన్‌ పట్టుకోవాలన్నదే. వీళ్లూ అలాంటి స్వాప్నికులే. ఈ ఏడాది తమ తొలి చిత్రంతో వాటినెలా సాకారం చేసుకున్నారో చూడండి...

ఊరే ఒక సెట్‌గా...

స్టార్‌ హీరోహీరోయిన్లూ, భారీ సెట్టింగులూ, అదిరిపోయే ఫైట్లూ... ఇవన్నీ ఉంటేనే సినిమా అన్న ఆలోచనని చెరిపేశాడు ‘కేరాఫ్‌ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేష్‌ మహా. నటుడు కావాలని ఏడేళ్ల కిందట విజయవాడ నుంచి హైదరాబాద్‌ వచ్చిన వెంకటేష్‌... తర్వాత షార్ట్‌ ఫిల్మ్‌ దర్శకుడిగా మారాడు. సరైన అవకాశాలు రాలేదని బ్రేక్‌ కోసం వైజాగ్‌లో స్నేహితుడి దగ్గరకు వెళ్లి అక్కడో ఉద్యోగంలో చేరాడు. విశాఖలోని కంచరపాలెం వాతావరణమే తన కథకి ప్రేరణనీ... అదే తనని మళ్లీ సినిమారంగంవైపు పంపిందనీ చెబుతాడు వెంకటేష్‌. చిన్న ప్రయత్నంగా మొదలైన ఈ ప్రయోగాత్మక సినిమాని చూసిన హీరో రానా దగ్గుపాటి స్వయంగా డిస్ట్రిబ్యూషన్‌కి ముందుకొచ్చాడు! 

గూఢచారిలా వచ్చాడు....

న్యూయార్క్‌ ఫిల్మ్‌ అకాడమీలో ఫిల్మ్‌ మేకింగ్‌ కోర్స్‌ చేసిన శశికిరణ్‌ తిక్క... లీడర్‌ సినిమాకి శేఖర్‌ కమ్ముల దగ్గర సహాయకుడిగా చేశాడు. ‘కర్మ’ సినిమాతో అడివి శేష్‌తో ఏర్పడిన స్నేహం ‘గూఢచారి’ దాకా వచ్చింది. శేష్‌ రాసిన గూఢచారి స్క్రిప్టుకి రచయితల సాయంతో తొమ్మిది నెలలు శ్రమించి స్క్రీన్‌ప్లే తయారుచేసుకున్నాడు శశికిరణ్‌. సినిమా బాక్సాఫీసు దగ్గర పెద్ద హిట్‌ అవ్వడమే కాదు, చిత్ర బృందం హీరో నాగార్జున నుంచి ప్రత్యేకంగా ప్రశంసల్నీ అందుకుంది. అంతేకాదు... త్వరలో ‘గూఢచారి పార్ట్‌-2’ కూడా వస్తుందట. 

ఆ పేరు కోసం...

ఏడాది యూత్‌ని బాగా ఆకట్టుకున్న సినిమా... ‘ఆర్‌ఎక్స్‌ 100’. దర్శకుడిగా అజయ్‌ భూపతికి మొదటి సినిమానేగాని ఇదివరకే రామ్‌గోపాల్‌ వర్మ దగ్గర ‘వంగవీటి’, ‘కిల్లింగ్‌ వీరప్పన్‌’ సినిమాలకు పనిచేశాడు. ఈ కోనసీమ కుర్రాడు డిగ్రీ పూర్తిచేసి భుజానికి బ్యాగు, జేబులో రూ.3000 వేసుకుని హైదరాబాద్‌లో అడుగుపెట్టాడట. దర్శకుడిగా ఛాన్స్‌ వచ్చాక తనకెంతో నచ్చిన ‘ఆర్‌ఎక్స్‌ 100’ టైటిల్‌ కోసం జపాన్‌లోని యమహా కంపెనీ నుంచి అనుమతి తెచ్చుకున్నాడు. టైటిల్‌ కోసమే ఇంత కష్టపడ్డాడంటే సినిమా కోసం ఇంకెంత కష్టపడి ఉండాలి. అందుకే ఆ సినిమా కోట్ల వర్షం కురిపించింది!

త్రివిక్రమ్‌ శిష్యుడు...

లాంటి అంచనాలూ లేకుండా వచ్చి సంచలనం సృష్టించిన సినిమా... ‘ఛలో’. దీని దర్శకుడు వెంకీ కుడుముల. ‘నా దగ్గర పనిచేసినవాళ్లు దర్శకులుగా రాణించడంలేదన్న అసంతృప్తి ఉంది. నువ్వయినా ఆ లోటు తీర్చు...’ త్రివిక్రమ్‌ అన్న ఆ మాటలు వెంకీని మరింత కష్టపడేలా చేశాయి. త్రివిక్రమ్‌ దగ్గర ‘అ ఆ’ సినిమాకి పనిచేసిన ఖమ్మం కుర్రాడు వెంకీ ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి పీజీ చేశాడు. సినిమాలపైన ఆసక్తితో కృష్ణానగర్‌లో గది అద్దెకు తీసుకుని సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టి లక్ష్యాన్ని ఛేదించాడు. 

హీరో టు డైరెక్టర్‌ వయా రైటర్‌!

వెంకీ అట్లూరి... ‘తొలి ప్రేమ’తో 2018కి మొదటి సూపర్‌హిట్‌ ఇచ్చిన దర్శకుడు. డైరెక్టర్‌ అవుదామనుకున్న అతనికి ముందు ‘జ్ఞాపకం’ సినిమాతో హీరోగానే అవకాశం వచ్చింది. తర్వాత మధుర శ్రీధర్‌ దర్శకత్వంలో ‘స్నేహగీతం’లో హీరోగానే కాకుండా రచయితగానూ చేశాడు. తరవాత నాగార్జున ‘ఊపిరి’, అక్కినేని అఖిల్‌ ‘హలో’ సినిమాలకి రాశాడు. మరోవైపు 2011లో రాసుకున్న నాలుగు కథల్లో ఒకదాన్ని వరుణ్‌తేజ్‌కి వినిపించి ఓకే చేయించుకున్నాడు. కథ నచ్చి బీవీఎస్‌ ప్రసాద్‌ నిర్మాణబాధ్యతలు తీసుకున్నాడు. అలా ‘తొలి ప్రేమ’ మనముందుకొచ్చింది!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.