దాడి ఘటనపై చర్య తీసుకోండి

ప్రధానాంశాలు

దాడి ఘటనపై చర్య తీసుకోండి

గవర్నర్‌కు తెదేపా నేతల విజ్ఞప్తి
తక్షణం విచారణ జరిపించండి

ఈనాడు, అమరావతి: ప్రధాన ప్రతిపక్ష నేత, జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత కలిగిన చంద్రబాబు ఇంటిపై వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్‌ ఆధ్వర్యంలో  దాడికి ప్రయత్నించారని, పోలీసులకు ముందస్తు సమాచారం ఉన్నా ప్రేక్షకపాత్ర వహించారని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌కు తెలిసి, ఆయన సూచనల మేరకే వారు దాడికి వచ్చారని, ఆ ఘటనలో వైకాపా నేతలు, కొందరు పోలీసు అధికారుల పాత్రను నిగ్గుతేల్చేందుకు విచారణ చేయించాలని కోరారు. గవర్నర్‌ తక్షణం జోక్యం చేసుకుని, బాధ్యులపై చర్యలు చేపట్టాలని, రాష్ట్రంలో శాంతిభద్రతల్ని గాడిలో పెట్టాలని విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బుద్దా వెంకన్న గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. వారంతా శనివారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లారు. కానీ గవర్నర్‌కు ఒంట్లో నలతగా ఉండటంతో, ఆయన కార్యదర్శికి విజ్ఞాపనపత్రం అందజేసి వచ్చామని వర్ల రామయ్య, బుద్దా వెంకన్న తెలిపారు. విజ్ఞాపన పత్రం ప్రతిని మీడియాకు విడుదల చేశారు. చంద్రబాబు నివాసం వద్ద వైకాపా గూండాల దాడిలో పలువురు సందర్శకులు, తెదేపా నాయకులు, కార్యకర్తలు గాయపడ్డారని, అయినా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని, దాడికి వచ్చినవారిని చెదరగొట్టకుండా, తెదేపా మద్దతుదారులపై లాఠీఛార్జి చేశారని విజ్ఞాపన పత్రంలో పేర్కొన్నారు. వైకాపా కార్యకర్తల దాడిలో బుద్దా వెంకన్న, రాకేష్‌, చెన్నుపాటి గాంధీ, శ్రావణ్‌, జంగాల సాంబశివరావు తదితర తెదేపా నాయకులకు తీవ్ర గాయాలయ్యాయన్నారు. ‘ముఖ్యమంత్రి, డీజీపీ మద్దతుతోనే చంద్రబాబు ఇంటిపై దాడి చేశామని జోగి రమేష్‌ బహిరంగంగానే ప్రకటించారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ విధానాల్ని ప్రజాస్వామ్యయుతంగా వ్యతిరేకించే వారి పరిస్థితి ఏంటి?’ అని వారు ధ్వజమెత్తారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని