అక్రమ వసూళ్లలో పక్కా ‘ప్రణాళిక’

అనిశా అధికారుల తనిఖీల్లో బయటపడిన అవినీతి

మూడు పురపాలక సంఘాల్లో రూ.2,74,720 స్వాధీనం

ఈనాడు, అమరావతి: పుర, నగరపాలక సంస్థల్లోని పట్టణ ప్రణాళిక విభాగాన్ని అవినీతి మరకలు వదలట్లేదు. కొత్త నిర్మాణాలకు అనుమతుల కోసం లంచాలు డిమాండుచేస్తూ.. ఇవ్వకపోతే దస్త్రాలపై కొర్రీలు వేసి చుక్కలు చూపిస్తున్నారు. అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులు రెండు రోజులుగా రాష్ట్రంలోని వివిధ పురపాలక సంఘాల్లో చేసిన ఆకస్మిక తనిఖీల్లో పట్టణ ప్రణాళిక అధికారులు, ఉద్యోగుల అక్రమ వసూళ్లు బయటపడ్డాయి. కొన్నిచోట్ల పుర కమిషనర్లు సైతం వాటాలు అందుకుంటున్నట్లు గుర్తించారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పురపాలక సంఘం కార్యాలయానికి అనిశా అధికారులు బుధవారం వెళ్లినపుడు కమిషనర్‌ ఛాంబర్‌ కిటికీలో నుంచి రూ.1.13 లక్షలు బయట పడేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేట పురపాలక సంఘంలోని పట్టణ ప్రణాళిక విభాగంలోనూ డబ్బులు తీసుకొని అడ్డగోలుగా కొన్ని భవన నిర్మాణాలకు అనుమతులిచ్చినట్లు అనిశా అధికారుల తనిఖీల్లో ప్రాథమికంగా వెల్లడైంది. నందిగామ, అనకాపల్లి, బొబ్బిలి, సామర్లకోట, ఏలూరు, మార్కాపురం, రాజంపేట, పుట్టపర్తి పురపాలక సంఘాల్లో, తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం కూడా అనిశా అధికారులు తనిఖీలు చేశారు. అనిశా యాప్‌కు వచ్చిన 14,400 ఫిర్యాదుల్లో పట్టణ ప్రణాళిక విభాగంపైనే అత్యధికంగా ఉన్నాయి. ఆకస్మిక తనిఖీలు శుక్రవారం కూడా ఉంటాయి.

అడ్డగోలు వ్యవహారాలిలా...
* తనిఖీల్లో రూ.2,74,720 నగదు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో రూ.2,00,960, మహావిశాఖ నగరపాలక సంస్థ అనకాపల్లి జోనల్‌ కార్యాలయంలో రూ.38,200, సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రూ.35,560 నగదు స్వాధీనం చేసుకున్నారు.

* కొత్త భవన నిర్మాణాలకు అనుమతుల్వికుండా పట్టణ ప్రణాళిక అధికారులు జాప్యం చేస్తున్నట్లు గుర్తించారు. ప్లాను అనుమతి, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ, ప్లాన్లు ఇచ్చే ముందు సర్వేలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు కనుగొన్నారు.

* అనుమతుల్లేని నిర్మాణాలపై చర్యలు తీసుకోకపోవడం, ప్లానుకు విరుద్ధంగా చేసిన నిర్మాణాలపై ఉదాసీనంగా ఉండటాన్ని గుర్తించారు. ఇందుకు భారీగా డబ్బు చేతులు మారి ఉండొచ్చని అనిశా భావిస్తోంది.

* బిల్డింగ్‌ పీనలైజేషన్‌ స్కీం (బీపీఎస్‌) రుసుముల వసూళ్లలోనూ లోపాలు గుర్తించారు. ఇందుకు కారణాలేంటనేది సమగ్ర పరిశీలన తర్వాతే బయటపడనుంది.

* పట్టణ ప్రణాళిక విభాగంలో విధిగా నిర్వహించాల్సిన కొన్ని దస్త్రాల విషయంలో నిర్లక్ష్యాన్ని గుర్తించారు. ప్రజల నుంచి ప్రతి శుక్రవారం ఫిర్యాదుల స్వీకరణ సరిగా లేదని అనిశా కనుగొంది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని