సికింద్రాబాద్‌ ఘటనలో వాట్సప్‌ సంభాషణలే కీలకం

ఫొరెన్సిక్‌  నివేదిక అందగానే అభియోగపత్రం

ఈనాడు, హైదరాబాద్‌ : సంచలనం సృష్టించిన సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ విధ్వంస ఘటనలో వాట్సప్‌ సంభాషణలే కీలకంగా మారాయి. ఇప్పటికే వీటిని ఫొరెన్సిక్‌ విశ్లేషణకు పంపిన రైల్వే పోలీసులు మిగతా దర్యాప్తును వేగిరం చేశారు. ఆందోళనకారులు వాడిన ఇనుప రాడ్‌ల వంటి ఆయుధాలను కూడా పరీక్షల కోసం పంపారు. సాధ్యమైనంత త్వరలోనే ఈ కేసులో అభియోగపత్రం దాఖలు చేయాలని భావిస్తున్నారు. ఇందులో రక్షణ విభాగం కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. నిందితులకు ఇప్పటికే న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. జూన్‌ 17న జరిగిన ఈ ఘటనలో రైల్వేశాఖకు సుమారు రూ.7 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా. పోలీసు కాల్పుల్లో ఓ యువకుడు మరణించాడు. ఆందోళనలో పాల్గొన్న 70 మందికిపైగా నిందితులను, తెలుగు రాష్ట్రాల్లోనూ కోచింగ్‌ సెంటర్లు నిర్వహిస్తున్న ఆవుల సుబ్బారావును పోలీసులు అరెస్టు చేశారు.

సంభాషణలు ఎవరెవరి మధ్య జరిగాయో?
‘‘వివిధ వాట్సప్‌ గ్రూపులలో ఏకమైన నిరుద్యోగ యువకులు విధ్వంసానికి ప్రణాళిక వేసుకున్నారు. ఎన్ని గంటలకు ఎక్కడ కలవాలి, ఏమి చేయాలన్నది ముందే నిర్ణయించుకున్నారు. వీరిని కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులు మరింత రెచ్చగొట్టారు. ఇదంతా వాట్సప్‌ వేదికగా సాగింది’’ అని రైల్వే పోలీసుల దర్యాప్తులో తేలింది. దాంతో ఈ కేసులో వాట్సప్‌ చాటింగ్‌లే కీలకంగా మారాయి. అభియోగాలను నిర్ధారించాలంటే ఈ సంభాషణలు ఎవరెవరి మధ్య జరిగాయి, వాటి సారాంశమేమిటన్నది సాంకేతికంగా తేల్చాలి. అందుకే నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లను ఫొరెన్సిక్‌ విశ్లేషణకు పంపారు. అప్పటికే చాలా మెసేజ్‌లను డిలీట్‌ చేశారు. వాటిని పునరుద్ధరించాల్సి ఉంటుంది. ఎవరి ఫోన్‌ నుంచి ఎవరి ఫోన్‌కు మెసేజ్‌ వెళ్లింది, అసలు ఆ మెసేజ్‌ ఎక్కడ పుట్టింది అన్న వివరాలను సాంకేతికంగా నిర్ధారించాలి. దాంతోపాటు ఆందోళనకారులు.. చేతికి అందిన వస్తువునల్లా ఆయుధంగా మార్చి విధ్వంసానికి పాల్పడ్డారు. కొందరు పెట్రోల్‌తో పాటు బయట నుంచి ఇనుపరాడ్లు తెచ్చారని పోలీసులు గుర్తించారు. వారు వాడిన ఆయుధాలను సేకరించిన పోలీసులు వాటిని కూడా ఫొరెన్సిక్‌ విశ్లేషణకు పంపారు. పోలీసులు కాల్పులకు వాడిన ఆయుధాలను, ఆందోళనకారుల దేహాల్లో దూసుకుపోయిన బుల్లెట్లను కూడా సేకరించి పరీక్షల కోసం పంపారు. ఈ కేసులో ఫొరెన్సిక్‌ నివేదిక మాత్రమే పెండింగ్‌లో ఉందని, అది అందిన వెంటనే అభియోగపత్రం దాఖలు చేస్తామని రైల్వే పోలీసు అధికారులు వెల్లడించారు.


మరిన్ని

ap-districts
ts-districts