close

గ్రేటర్‌ హైదరాబాద్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కరోనా పరీక్షలు, ఫలితాల్లో పారదర్శకత లేదు

 సూపర్‌ స్ప్రెడర్లతో 60 శాతం మందికి కొవిడ్‌
 ప్రమాదంలో 10-19 ఏళ్లలోపు పిల్లలు, యువత
 ప్రముఖ ఎపిడిమాలజిస్టు డాక్టర్‌ రామనన్‌ లక్ష్మీనారాయణ్‌

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో కరోనా పరీక్షలు, ఫలితాల్లో పారదర్శకత లోపించిందని వాషింగ్టన్‌లోని చలనశీల వ్యాధులు, ఆర్థిక విధానాల కేంద్రం (సీడీడీఈపీ) డైరెక్టర్‌, ప్రముఖ ఎపిడిమాలజిస్టు, ఆర్థికవేత్త డాక్టర్‌ రామనన్‌ లక్ష్మీనారాయణ్‌ తెలిపారు. పాఠశాలలు తెరిచిన తరువాత 15 ఏళ్లు దాటిన పిల్లలు వైరస్‌కు ప్రభావితమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ప్రజారోగ్య రంగానికి జీడీపీలో కేటాయింపులు పెంచాలని, వైద్య మౌలిక సదుపాయాలు సమకూర్చుకుని మహమ్మారులను ఎదుర్కొనే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్‌ తయారీ క్లిష్టమైన ప్రక్రియ అని, ఈ మేరకు పరిశోధనలు జరుగుతున్నా ఎప్పుడు వస్తుందో తెలియదని అభిప్రాయపడ్డారు. శనివారమిక్కడ మంథన్‌ ప్రతినిధులు అజయ్‌గాంధీ, విక్రమ్‌ ఆధ్వర్యంలో ‘కొవిడ్‌కు ముందు పరిస్థితి.. భవిష్యత్తు కార్యాచరణ’ అనే అంశంపై నిర్వహించిన ఆన్‌లైన్‌ చర్చలో మాట్లాడారు. ‘‘గత దశాబ్దంగా కొత్త వైరస్‌లు పుడుతున్నాయి. ఇవన్నీ జంతు మాంసం నుంచి మనుషులకు సోకుతున్నాయి. చైనాలోని మాంసం విక్రయశాలల్లో కరోనా బయటపడింది. 8 శాతం మంది సూపర్‌స్ప్రెడర్‌లతో 60 శాతం మందికి వైరస్‌ వ్యాప్తి చెందుతున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. సమూహంలో ఒకరి నుంచి 40 మందికి.. ప్రయాణాల్లో మరింత భారీ సంఖ్యలో ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశముంది. వ్యాక్సిన్‌కు భారత్‌ భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. దేశంలో పిల్లలకు ఇచ్చే వ్యాక్సిన్‌లు 72 శాతమే అమలవుతున్నాయి. నేపాల్‌, బంగ్లాదేశ్‌లో ఈరేటు 90 శాతానికి పైగా ఉంది. పిల్లల వ్యాక్సిన్లు సరిగా అమలు కాకుంటే... వైరస్‌ వ్యాక్సిన్‌ పరిస్థితి ఏమిటి? ఐదేళ్లలోపు పిల్లల్లో కరోనా ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ... 10-19 ఏళ్ల వారిలో వైరస్‌ ఆందోళనకరంగా ఉంది. ఇక్కడ 40 ఏళ్లు దాటిన వారిలో మరణాల రేటు ఎక్కువగా కనిపిస్తోంది’’ అని లక్ష్మీనారాయణన్‌ చెప్పారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు