close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
నా పాట అందరి నోట!

నా పాట అందరి నోట!

సినిమాల్లో పాడే అవకాశం కోసం ఒక్క ఛాన్స్‌ అంటూ ఎంతో మంది తిరగడం చూస్తూనే ఉంటాం. కానీ ఒక్క పాటతో ఆ ఛాన్స్‌లే తన వెంట పడేలా చేసుకుంది పల్లెటూరి గానకోకిల బేబి. సింగర్‌ బేబి అనగానే... ఆమె పాడిన పాటతో పాటు పక్కన ఓ తెల్ల బకెట్టు, ఆమె ధరించిన నీలం రంగు చీర, ఎరుపురంగు జాకెట్‌ మొదట గుర్తొస్తాయి. ఇప్పుడు ఆమె ఆహార్యంలో మార్పు... అందివచ్చిన అవకాశాలు... అహో అని ఆకాశానికి ఎత్తేస్తున్నా.. నేనెప్పుడూ ఆ మట్టిలో పుట్టిపెరిగినదాన్నే అంటూ తన గొప్పతనాన్ని చాటుకుంది. రామోజీ ఫిల్మ్‌సిటీకి వచ్చిన వడిశలేరుకి చెందిన పసల బేబితో వసుంధర ప్రత్యేకంగా ముచ్చటించింది. ఆ వివరాలే ఇవి... 
రెండు నెలల క్రితం సరదాగా పాడిన ఓ పాట నా జీవితాన్నే మలుపు తిప్పుతుందని అస్సలు అనుకోలేదు. అక్షరం ముక్క రాని నేను... ఈ రోజు ఇంతమంది ప్రముఖుల ప్రశంసలు అందుకోవడం కలలానే ఉంది. నిజానికి నేను హైదరాబాద్‌ రావడం ఇదే మొదటిసారి. వస్తోన్న అవకాశాలు, ప్రశంసలు... ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అసలు ఇదంతా ఎలా జరిగిందో చెబుతా. మాది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిశలేరు గ్రామం. నాన్న సేవా వెంకన్న, అమ్మ దయా కరుణ వ్యవసాయ కూలీలు. నేనే ఇంట్లో పెద్దదాన్ని. నాకు ఇద్దరు తమ్ముళ్లు. ఇద్దరు చెల్లెళ్లు. మా ఇంట్లో ఎవరూ చదువుకోలేదు. అంతమంది పిల్లల్ని పోషించలేక నాకు పదమూడో ఏటనే ఓ లారీ డ్రైవర్‌కి ఇచ్చి పెళ్లి చేశారు. మాకు ఇద్దరు పిల్లలు. హిమబిందు, ప్రియ బిందు. పదోతరగతి వరకూ ప్రభుత్వ పాఠశాలలోనే చదివించా. ఆపై చదివించలేక పెళ్లి చేసేశా. చిన్నప్పుడు మా అమ్మమ్మ కూడా బాగా పాడేదట. నేను పాడుతుంటే అమ్మ ఆ విషయం చెప్పేది.  మా పిల్లలకు ఆ ఆనవాయితీ రాలేదు. బహుశా భవిష్యత్తులో నా మనవళ్లైనా పాడతారమో చూడాలి.

మా ఇంటికే వస్తుంటే...!

నా పాట అందరి నోట!

నిజానికి ఈ రోజు నా పాట ఈ స్థాయికి చేరుకుందంటే... రాణి చలవే. ఆమె మా ఇంటి పక్కనే ఉంటుంది. గంజి తెచ్చుకోవడానికి వెళ్లి... వాళ్లింటి తాటాకు చూరుకింద కూర్చుని కబుర్లు చెప్పుకున్నాం. కాసేపటికి రాణి ‘అక్కా ఓ పాట పాడు’ అంటూ అడిగింది. అదంతా మా ఇద్దరికీ మామూలే. తను కూడా గాయనే. ఏవైనా పాటల బృందాలు అడిగితే పాడుతుండేవాళ్లం. అందుకే తను అడగ్గానే ‘ఓ చెలియా నా ప్రియా సఖియా చేజారెను నా మనసే’ అని పాడా. అది ఆమె వీడియో తీసి, తనతో పాడే స్నేహితులు కొందరికి వాట్సాప్‌లో  పంపించిందట. అంతే మీడియా నాతో మాట్లాడటానికి ఆసక్తి చూపించింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అంతా నేరుగా నాకోసం మా ఇంటినే వెతుక్కుంటూ వస్తోంటే ఆశ్చర్యంగా అనిపించింది. వాళ్లంతా ‘ఫేస్‌బుక్‌లో చూశాం, వాట్సాప్‌లో మీ వీడియో వచ్చింది’ అని అంటోంటే... చదువురాని నాకు మొదట ఏం జరుగుతోందో అర్థం కాలేదు. ఆ తరువాత మా పిల్లలు, చుట్టుపక్కల వాళ్లు నాకు విషయం అర్థమయ్యేలా చెప్పారు.

కోటిగారి సాయంతో...

హైదరాబాద్‌ రావడానికి ఇంతమందిని కలవడానికి, ఇన్ని అవకాశాలు కలగడానికీ సంగీత దర్శకుడు కోటీ సారే కారణం. నగరంలో అడుగుపెట్టిన నాకు కట్టూబొట్టు నేర్పించి చేతి ఖర్చులకూ డబ్బులిచ్చారు విజయలక్ష్మి. ఇక చిరంజీవి అన్నయ్యని కలవడం అంటే...మాటల్లో చెప్పలేని మధురానుభూతి. ఆయన భార్య సురేఖ స్వయంగా నా అభిమాని అని అంటుంటే కళ్లల్లో నీళ్లు తిరిగిపోయాయి. ఇంటి ఆడపడుచులా చీరలు పెట్టారు. ఆఖరికి బ్లవుజులూ కుట్టించారు. వీళ్లే కాదు మా ఊరి స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, రాజమండ్రికి చెందిన గోవింద్‌, నళినీకాంత్‌ వంటి దాతలు నా పాటవిని నాకెంతో సాయం చేశారు. కోటీసార్‌ సాయంతో బోల్‌బేబీ బోల్‌లోనూ పాడే అవకాశం లభించింది. అంతేనా... ఓ చెలియా పాట స్వరకర్త ఏ ఆర్‌ రెహమాన్‌ సైతం తన ఫేస్‌బుక్‌లో నన్ను అభినందిస్తూ పోస్ట్‌ చేశారట. అంతకంటే సంతోషం ఏముంటుంది చెప్పండి. నా అభిమాన గాయని జానకిఅమ్మని కలవగలిగా. ఇక దుబాయ్‌, అమెరికా వంటి చోట్ల నుంచీ పాడేందుకు అవకాశాలూ వస్తున్నాయి. ఇప్పటికీ నా వీడియో ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ వంటిచోట్ల తిరుగుతూ వైరల్‌ అవుతోందట. నేనెవరో తెలుసుకోవాలని ఇంకా చాలామంది ప్రయత్నిస్తున్నారు. కనిపిస్తే నాతో ఫొటోలు తీసుకుంటున్నారు.

నా జీవితం ధన్యమైంది...

నాకు చదువు లేదు.. సంగీత జ్ఞానం అసలే తెలియదు. నేను పాడిన పాట సరదాగా తీసిన కూనిరాగమే అనుకున్నా. నిజానికి విన్న ప్రతిపాట పాడతాను కానీ వాటిని ఎవరు రాశారో, పాడారో వంటివేవీ నాకు తెలియదు. సామాజిక మాధ్యమాల్లో చూసి రఘుకుంచె, రచయిత లక్ష్మీభూపాల రాసిన ‘‘పల్లె కోయిల్లమ్మ తెల్లవారె కూసే కూతే నా పాట..’’ అంటూ నా మీదే పాట పాడించారు.

నా పాట ఎప్పుడు మొదలైందంటే..!

నిజానికి నేనెప్పుడు పాడటం మొదలెట్టానో తెలియదు కానీ, చిన్నప్పటి నుంచీ సినిమాలంటే చాలా ఇష్టం. విడుదలైన ప్రతి సినిమా చూసేదాన్ని. ఆ పాటల్ని ఇంటికొచ్చి అలవోకగా పాడేస్తుంటే అమ్మ మురిసిపోయేది. ఇల్లు గడవడానికి నేను కూలికి వెళ్లేదాన్ని. అక్కడ తోటి కూలీలు శ్రమ తెలియకుండా ఉండకుండా పని గడిచిపోవడానికి నన్నుపాడమనేవారు. నేను పాడటం చూసిన అక్కడి రైతులు...నువ్వు పనిచేయకపోయినా ఫరవాలేదు. చక్కగా పాడు అంటూ పాడించుకునేవారు. పనిచేసినవారితో సమానంగా డబ్బులు ఇచ్చి పంపించేవారు. అలా పాటలు పాడుతుంటే ఓ పాస్టర్‌ చక్కగా పాడుతున్నావంటూ క్రైస్తవ భక్తిగీతాల్ని నేర్పించి ఓ ఆల్బమ్‌ చేయించారు. ఆ తరువాత ఆరోగ్యం సహకరించక వ్యవసాయ పనులు మానేసి దగ్గర్లోని ఓ జీడిపప్పు ఫ్యాక్టరీలో కార్మికురాలిగా చేరాను. ఇక, నాకు చదువు రాదు కాబట్టి ఏ పాటైనా ఒకటికి రెండు సార్లు విని పాడతా. నిజానికి ఆ వీడియో వైరల్‌ అయ్యేవరకూ సినిమా పాటలు వేళ్లమీద లెక్కపెట్టగలిగేవి మాత్రమే పాడేదాన్ని. నచ్చిన పాటను కంఠతా వచ్చే వరకూ అస్సలు వదిలిపెట్టను. అయితే ఒకపాట నేర్చుకోవడానికి ఎన్నిరోజులు పట్టేదో చెప్పలేను. ఇక ముందు ఎన్ని రోజుల్లో నేర్చుకుని పాడగలుగుతానో మాత్రమే చూడాలి. అయితే చూసి పాడే విధంగా కోటిగారు నాకు అక్షరాభ్యాసం చేయిస్తానని అన్నారు.

- స్వాతి కొరపాటి

 


మరిన్ని