close

ఆంధ్రప్రదేశ్

బతికుండగానే చంపేశారు!

విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో ఓట్ల గల్లంతుపై జనాగ్రహం

‘ఓటరు కార్డుంది.. నెల కిందట జాబితాలో పేరుంది.. ఇంటికి వచ్చి స్లిప్పులు ఇవ్వలేదు.. ఓటు వేయడానికి  వెళ్తే జాబితాలో మీ పేరు లేదు.. బయటకు వెళ్లమంటున్నారు.. బతికుండగానే మమ్మల్ని చంపేశారు.’ అంటూ గురువారం విజయవాడ మధ్య నియోజకవర్గం అజిత్‌సింగ్‌నగర్‌లోని వివేకానంద సెంటినరీ హైస్కూల్‌ పోలింగ్‌ కేంద్రంలో వందలాది మంది ఓటర్లు అధికారులతో వాగ్వాదానికి దిగారు. విసిగి వేసారిన కొందరు కేంద్రం ఆవరణలోనే సాయంత్రం 5 గంటలకు ఆందోళనకు దిగారు. ఓటరు కార్డులు, ఆధార్‌కార్డులు చూపిస్తూ బతికుండగానే చంపేశారంటూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వచ్చి ఆందోళన చేస్తున్న వారిని బయటకు పంపించారు.

కుప్పంలోనూ..
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోనూ పలువురు తమ పేర్లు ఓటర్ల జాబితాలో గల్లంతయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. భార్య ఓటు వేసి తాను వేయలేకపోయానని భర్త, కుటుంబ సభ్యులందరి పేర్లు ఉండీ తన పేరు లేకపోవడమేమిటని ఒక యువకుడు... ఇలా పలువురు తమ పేర్లు జాబితాలో లేకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. వీరందరూ అధికారులను నిలదీసినా ప్రయోజనం లేకపోవడంతో నిరుత్సాహంగా ఇళ్లకు తిరిగి వెళ్లారు.

- న్యూస్‌టుడే, విజయవాడ, కుప్పం(రూరల్‌)


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు