ఇలా అయితే మీరు కోటీశ్వరులు కాలేరు! - Reasons that may stop you from becoming millionaire
close

Updated : 17/03/2021 12:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇలా అయితే మీరు కోటీశ్వరులు కాలేరు!

కోటీశ్వరులు కావాలని ప్రతిఒక్కరూ కల కంటారు. కానీ, అందరూ ఆ లక్ష్యాన్ని చేరుకోలేరు. ఎలన్‌ మస్క్‌, జెఫ్‌ బెజోస్‌, ముకేశ్‌ అంబానీ వంటి కుబేరులు ఏటా రూ.లక్షల కోట్ల సంపద పోగేసుకుంటుంటే చూస్తూ ఉండిపోతారు. ఇక కొంతమందైతే అది అందరికీ సాధ్యం కాదని మెంటల్‌గా ఫిక్సయిపోతారు. నిజానికి అపర కుబేరులంతా ఒకప్పుడు జీరో నుంచి మొదలుపెట్టిన వారే. ముకేశ్ అంబానీ తండ్రి ధీరూభాయ్‌ అంబానీ, చైనా కుబేరుడు జాక్‌ మా, ఎలన్‌ మస్క్‌.. ఇలా ఇప్పుడు ధనవంతుల జాబితాలో ఉన్నవారంతా ఒకప్పుడు సామాన్యులే. మరి కోటీశ్వరులు కావడం సాధ్యం కాదని అనుకుంటే ఎలా! అయితే, సంకల్పం ఒక్కటే సరిపోదు. దానికి నిరంతర శ్రమతో పాటు చక్కని ఆర్థిక ప్రణాళిక, స్మార్ట్‌ టెక్నిక్స్‌ కూడా అవసరమే. అయితే, సంపన్నులుగా మారడానికి సాధారణంగా అందరికీ అడ్డుపడే కొన్ని కారణాలు చూద్దాం...


పెట్టుబడి పెట్టడానికి భయం

ఆర్థికపరమైన విషయాల్లో చాలా మంది రిస్క్‌ తీసుకోవడానికి భయపడుతుంటారు. కేవలం బుద్ధిబలంతోనో లేక శారీరక శ్రమ వల్లనో వచ్చే సంపాదనతో ధనవంతులు కావాలంటే కష్టమే. కచ్చితంగా పెట్టుబడులు పెట్టాల్సిందే. అప్పుడే మన రూ.వేలు.. లక్షలుగా, రూ.లక్షలు.. కోట్లుగా మారతాయి. అయితే, నష్టభయం అన్నది లేకుండా ఉండదు. ఇక్కడే మన బుద్ధికి పని చెప్పాలి. మార్కెట్‌ ట్రెండ్‌ను గమనించాలి. అవసరమైతే ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవాలి. ద్రవ్యోల్బణాన్ని అధిగమించేలా రిటర్నులు ఇచ్చే వాటిలో పెట్టుబడులు పెట్టాలి. స్టాక్‌ మార్కెట్‌, బాండ్లు, మ్యూచువల్‌ ఫండ్లు, స్థిరాస్తి ఇలా చాలా మార్గాలున్నాయి. సరైన వాటిని ఎంపిక చేసుకోవడంపైనే మీ వృద్ధికి బాటలు పడతాయి. ధనవంతులంతా ఏటా వారికి వచ్చే లాభాల్ని ఎక్కడో ఒక చోట పెట్టుబడి పెడుతుంటారన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. దాని వల్లే వారి కంపెనీల మార్కెట్‌ విలువ పెరిగి ఏటా రూ.లక్షల కోట్లు గడిస్తుంటారు.


పొదుపు చేయకపోవడం

ఎంత సంపాదించినా.. ఎన్ని పెట్టుబడులు పెట్టినా.. వచ్చే దాంట్లో కొంతైనా దాచిపెట్టుకోవాలి. లేదంటే ఎప్పటికీ కోటీశ్వరులం కాలేం. ఎంత సంపాదించామన్నది కాదు.. ఎంత పొదుపు చేశామన్నదే ముఖ్యం. ‘రూపాయి ఆదా చేస్తే రూపాయి సంపాదించినట్లే’నన్న సూత్రం ఎప్పటికీ మరవొద్దు. సంపాదనలో పడి పొదుపు చేయడం మర్చిపోతే.. భవిష్యత్తులో అనుకోకుండా వచ్చే ఆపదల నుంచి గట్టెక్కడం కష్టం. అలాగే చేతిలో సరిపడా డబ్బు లేకపోతే.. వచ్చే అవకాశాల్నీ చేజిక్కించుకోలేం.


స్తోమతకు మించి ఖర్చు

చాలా మంది తమ స్తోమతకు మించి ఖర్చు చేస్తుంటారు. వచ్చిన సంపాదనను విలాసాలకే వెచ్చిస్తుంటారు. వీరిలో చాలా మంది కోటీశ్వరులు కావాలని కలలు కంటున్నవారే ఉంటారు. లక్ష్యానికి చేరుకోకముందే కోటీశ్వరుల పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసేస్తారు. ఖరీదైన ఆహార్యం, కార్లు, విల్లాల్లో అద్దెకు ఉండడం లక్ష్య సాధనలో భాగమని భావిస్తుంటారు. ఇక కొంతమందైతే.. సరైన లక్ష్యం, ప్రణాళిక లేకుండానే పెట్టుబడుల పేరిట రూ.కోట్లకు కోట్లు ఖర్చు చేస్తుంటారు. ఈ క్రమంలో అప్పులు కూడా చేసేస్తుంటారు. ఇలా చేస్తే కోటీశ్వరులు కాదు కదా.. ఉన్నది కూడా పోయి దివాలా తీయాల్సి వస్తుంది.


రుణ చెల్లింపుల కోసం డబ్బు వృథా చేయడం

చాలా మంది వ్యాపారం లేదా ఇతర ఆర్థిక లక్ష్యాల సాధన కోసం రుణాలు తీసుకుంటారు. అయితే, చాలా మందికి ఎలాంటి రుణం తీసుకోవాలి? ఎక్కడ తీసుకోవాలి? ఎంత మొత్తం తీసుకోవాలి? వంటి విషయాల్లో స్పష్టత ఉండదు. దీంతో తిరిగి చెల్లించే క్రమంలో చాలా డబ్బు వృథా చేస్తుంటారు. మీ అవసరాన్ని బట్టి తక్కువ వడ్డీ పడే రుణ సదుపాయాన్ని మాత్రమే వినియోగించుకోవాలి. అలాగే పన్ను ఆదా అయ్యే మార్గాల్నీ అన్వేషించాలి. లేదంటే మీరు సంపాదించేదంతా వడ్డీ చెల్లింపులకే సరిపోతుంది.


చిన్న చిన్న విషయాలపై అశ్రద్ధ

చాలా మంది చిన్న చిన్న ఆర్థికపరమైన విషయాలపై అశ్రద్ధ వహిస్తుంటారు. రూ.వెయ్యే కదా కొనేద్దాం.. పడి ఉంటుంది.. అన్న ధోరణి చాలా మందిలో ఉంటుంది. ఇలా ఒక చోట రూ.వెయ్యి, మరోచోట రూ.మూడు వేలు ఇలా ఎన్ని అనవసరపు ఖర్చులు అవుతాయో గమనించారా. వీటన్నింటినీ కట్టడి చేసి ఒకచోట మదుపు చేస్తే ఎంత ఉపయోగకరమో ఆలోచించారా. ఈరోజు మన దగ్గర ఉన్న రూపాయి రేపటి వంద రూపాయలతో సమానం అన్న విషయాన్ని మరచిపోవద్దు. ప్రతి పైసాను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. మనం ఎక్కువగా ఉపయోగించని వసతుల కోసం ఖర్చు చేస్తుంటాం. నిజంగా ఇలాంటి అవసరం మనకు ఎంత వరకు ఉందో ఆలోచించండి. ఇలాంటివి చిన్న విషయాలే అయినా.. దీర్ఘకాలంలో చాలా ప్రతికూల ప్రభావాలు ఉంటాయి.


ఆర్థిక ప్రణాళిక లేకపోవడం

సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోవడం అంటే.. లక్ష్యాన్ని చేరుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. మన ఖర్చులు, ఆదాయాలు.. ఎక్కడ పెట్టుబడి పెట్టాలి.. వంటి అంశాలన్నింటిపై సరైన అవగాహన ఉండాలి. దీంట్లోనే మీ పెట్టుబడి మార్గాలు, ట్యాక్స్‌ ప్లానింగ్‌ని కూడా చేర్చాలి. అలాగే మీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఎంత డబ్బు కావాలి..? దాన్ని సంపాదించాలంటే ఉన్న వనరులేంటి? ఇలా ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకొని ఓ ఆచరనీయమైన ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. దానికి అనుగుణంగా ముందుకు సాగాలి. ఈ క్రమంలో ప్రభుత్వం, బ్యాంకుల నుంచి అందే ప్రయోజనాల్ని వినియోగించుకునేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలి.

- ఇంటర్నెట్‌ డెస్క్‌


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని